ఇక ఆఫ్ లైన్‌లోనూ అమెజాన్‌ సర్వీస్..!!

గ్లోబల్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’ ఆఫ్ లైన్ మార్కెట్లోకి విస్తరించేందుకు భూమిక సిద్ధం చేసుకుంటున్నది. అందులో భాగంగా ఈ ఏడాది చివరిలోగా దేశవ్యాప్తంగా 100 కియోస్కీలను ఏర్పాటు చేయ తలపెట్టింది. 

In major offline push, Amazon to roll out over 100 kiosks in malls by year end

గ్లోబల్ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ దిగ్గజం అమెజాన్‌ ఇప్పుడు ఆఫ్‌లైన్‌ మార్కెట్లోకి అడుగు పెట్టేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఇందులో భాగంగా పలు మాల్స్‌లో  100 అమెజాన్‌ కియోస్కీలను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఆ మాల్స్‌లో అమెజాన్‌కు చెందిన కిండ్లె ఈబుక్‌ రీడర్‌, ది ఎకో స్పీకర్‌, ఫైర్‌ టీవీ డోంగల్‌ వంటి వస్తువులను విక్రయించాలని నిర్ణయించింది. 

రెండేళ్ల క్రితమే ఇలా కియోస్కీల ఏర్పాటు
ఈ ఆన్‌లైన్‌ దిగ్గజం ఆఫ్‌లైన్‌ మార్కెట్లో అడుగు పెట్టడానికి వీటిని వేదికగా వాడుకుంటోంది. ఇప్పటికే ఈ మాల్స్‌లో వాడదామనుకుంటున్న కియోస్కీలను రెండేళ్ల క్రితమే బెంగళూరు, ముంబై, అహ్మదాబాద్‌ల్లో అమెజాన్‌ పరీక్షించింది.

రెండింటిని బెంగళూరులో, ఒకదానిని ముంబై, మరో దానిని ఆహ్మదాబాద్‌లో ఏర్పాటు చేసింది. గత వారమే నోయిడాలోని లాజిక్స్‌ మాల్‌లో ఐదో కియోస్కీని ఏర్పాటు చేసింది. 

బెస్ట్ సేవలందిస్తామంటున్న అమెజాన్
ప్రస్తుతం అమెజాన్‌  కియోస్కీకి దాదాపు 70-80 చదరపు అడుగుల స్థలం అవసరం. ‘భవిష్యత్‌ను మనం అంచనావేయలేము. కానీ ఒక్కటి మాత్రం కచ్చితంగా చెప్పగలను. మన కస్టమర్లకు అత్యుత్తమ అనుభవాన్ని అందజేస్తాం’ అని అమెజాన్‌ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. 

కియోస్కీలు ఇలా పని చేస్తాయి
వినియోగదారులకు అత్యుత్తమ అనుభవాన్ని, అనుభూతిని కల్పించేందుకు అమెజాన్ కియోస్కీలను ఏర్పాటు చేసింది. కియోస్కీల వద్దకు కస్టమర్లు వచ్చి కిండ్లె, ఫైర్‌టీవీ, ఎకో వంటి పరికరాలు ఎలా పనిచేస్తాయో నేరుగా తెలుసుకొంటారు.

అక్కడ వారి సందేహాలు తీరాక వాటిని కొనుగోలు చేసే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెజాన్‌ కొన్నేళ్లపాటు ఈ విధానాన్ని పరిశీలించింది. ఆ తర్వాత అమెరికాలో దాదాపు 80 వరకు కియోస్కీలను ఏర్పాటు చేసింది. 

అవకాశాలు బంగారం వంటివే మరి  
అమెజాన్‌లో జపాన్ కేంద్రంగా బ్యాంకింగ్ సేవలందిస్తున్న సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు మసాయోషి సన్‌ వాటా కొనుగోలు చేసేందుకు విఫల యత్నం చేశారు. కాకపోతే డీల్‌లో 30 మిలియన్‌ డాలర్ల విషయంలో తేడా రావడంతో డీల్‌ కుదరలేదు.

సన్‌ మిల్కెన్‌ ఇన్‌స్టిట్యూట్‌ కాన్ఫరెన్స్‌లో ఆయనే స్వయంగా ఈ సంగతి చెప్పారు. దాదాపు 30శాతం వాటాను కొనుగోలు చేసే అవకాశం వచ్చిందని పేర్కొన్నారు. అప్పట్లో తాను 100 మిలియన్‌ డాలర్లను ఆఫర్‌ చేయగా అమెజాన్‌ వ్యవస్థాపకుడు జెఫ్‌బెజోస్‌ మాత్రం 130 మిలియన్‌ డాలర్లను కోరినట్లు వెల్లడించారు. 

రెండేళ్ల క్రితం రెండోసారి కూడా అమెజాన్ షేర్ల కొనుగోలుకు యత్నం
‘నేను ఇటీవల బెజోస్‌ను కలుసుకున్నప్పుడు ఈ విషయాన్ని చర్చించుకొని నవ్వుకున్నాం. కాకపోతే అప్పట్లో నేను గొప్ప అవకాశాన్ని వదులుకున్నాను. అప్పట్లో నా వద్ద అంత డబ్బులేదు. కానీ ఊహా, అంచనాలు మాత్రం నిజం’ అని సాఫ్ట్‌ బ్యాంక్‌ గ్రూప్‌ వ్యవస్థాపకుడు మసాయోషి సన్‌ వెల్లడించారు.

రెండేళ్ల క్రితం కూడా అమెజాన్‌లో వాటాలు కొనేందుకు ప్రయత్నించినట్లు వెల్లడించారు. వివరాలు మాత్రం గోప్యంగానే ఉంచారు. 

ఆలీబాబా గ్రూపులో సాఫ్ట్ బ్యాంక్‌కు 132 బిలియన్ల డాలర్ల పెట్టుబడులు
ఇప్పుడు అమెజాన్‌ మార్కెట్‌ విలువ 860 బిలియన్‌ డాలర్లు. అంటే ఒకొ వేళ సన్‌ 30శాతం వాటా కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు అది 260 బిలియన్‌ డాలర్లకు సమానం అన్నమాట. కాకపోతే చైనాకు చెందిన ఆన్‌లైన్‌ దిగ్గజం అలీబాబా గ్రూప్‌లో 132  బిలియన్‌ డాలర్ల విలువైన వాటాలు సాఫ్ట్‌బ్యాంక్‌కు ఉన్నాయి. 


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios