Asianet News TeluguAsianet News Telugu

ఢిల్లీలో దళిత ‘కోవింద’మ్...ఆంధ్రలో అంబేద్కర్ కు కష్టాలు

బిజెపి దళిత నేత బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి దేశమంతా దళితోద్ధరణ చర్చ సాగుతూ ఉంది. అంతకంటే ముందే  , దళితుల మీద అభిమానం చాటుకునేందుకు  తెలుగు రాష్ట్రాలు చెరో వంద కోట్ల రుపాయలు ఖర్చు చేసి బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలనుకుంటున్నాయి. అయితే, పశ్చిమ గోదావరి జిల్లా గరగపర్రులో ఏమి జరిగిందో  చూడండి.

Andhra dalits face social boycott for trying to install Ambedkar statue

బిజెపి దళిత నేత బీహార్ గవర్నర్ రామ్ నాథ్ కోవింద్ పేరును రాష్ట్రపతి అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచి దేశమంతా దళితోద్ధరణ చర్చ సాగుతూ ఉంది. ఇక తెలుగు రాష్ట్రాలయితే, అంతకు ఏడాది ముందే దళితుల మీద తమకు ఉన్న  అభిమానం చాటుకునేందుకు చెరో వందకోట్లరుపాయలు ఖర్చు చేసి బాబా సాహేబ్ అంబేద్కర్ విగ్రహాలు పెట్టాలనుకున్నాయి.

 

దళితనేతను రాష్ట్ర పతి చేయాలని ప్రధాని కి సూచించింది తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్. ఇక ఆయననే రాష్ట్రపతిగా గెలిపించేందుకు ఆంధ్రముఖ్యమంత్రి నాయుడు ప్రధానికి సాయం చేస్తున్నారు. కోవింద్ నామినేషన్ పత్రాలలో ఒక దాని నాయుడు సంతకం కూడా చేశారు.

 

బయట పరిస్థితి ఇలా ఉంటే, పశ్చిమగోదావరి జిల్లా గరగపర్రులో పరిస్థితి తలకిందులయింది. ఆ వూరి  కూడలిలో అంబేద్కర్ విగ్రహం పెట్టేందుకు దళితులు చేసిన ప్రయత్నం ఫలించలేదు. అంతేకాదు, ఆ ప్రయత్నం చేసిన వారందరిని వూర్లోని ఇతర కులాల వారంతా సాంఘిక బహిష్కరణకు గురిచేస్తున్నారు. గత రెనెళ్లుగా ఈ వూరికి చెందిన దళిత కాలనీ వాసులకు గ్రామంనుంచి ఎలాంటి సేవలందడం లేదు. ఈ వూరి మధ్యలో అంబేద్కర్ విగ్రహం పెట్టడానికి  క్షత్రియులనుంచి తీవ్రవ్యతిరేకత వచ్చింది.దానిని దళితులెవరు ఎదుర్కొనే స్థితిలో లేరు.

 

కోవింద్ రాష్ట్రపతి అయితే, గరగపర్రు పరిస్థితి మారుతుందా అనేది ఇక్కడి దళితులు ప్రశ్న. అందుకే కోవింద్ నామినేషన్ వేసినా వారెవరూ సంబరపడేలా లేదు వూర్లో పరిస్థితి.

 

గరగపర్రుకు దూరంగా పాతపేట, కొత్త పేట అనే కాలనీలో దళితలుంటారు.  రెండు కాలనీల మధ్య ఒక కాలువ వుంటుంది. రెండింటిని కలుపుతూ ఒక వంతెన ఉంటుంది. వూరంతా పెద్ద కులాల పెద్దిళ్లతో ఉంటుంది. పక్కనే ఒక పెద్ద చెరువు. గట్టుమీద సర్ అర్థర్ కాటన్, అల్లూరి సీతారామరాజు, తాండ్ర పాపరాయుడుల విగ్రహాలున్నాయి.

 

అయితే, కొంతమంది దళిత యువకులు ఈ మధ్య వూర్లో అంబేద్కర్ విగ్రహం నిలబెట్టాలనుకున్నారు. వారు సర్పంచు ఉన్నబట్ల ఎలిజబెత్, ఎంపిటిసి సిరింగుల వెంకటరత్నం లకు ఈ విషయం విజ్ఞప్తి చేశారు. వారిరువురు దళితులే. టిడిపి నుంచి ఈ పదవులకు ఎంపికయ్యారు. సర్పంచు, ఎంపిటిసి వూరి దళితుల విజ్ఞప్తి ని పెద్దలముందుపెట్టారు. వీరంతా అధికార పార్టీకే చెందిన ఇతర కులాల వారు.  అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టకు నో అన్నారు. 

 

దీనితో అసంతృప్తి చెందిన దళితులు ఎప్రిల్ 24న అర్థరాత్రి అంబేద్కర్ విగ్రహాన్ని చెరువుకట్ట నిలబెట్టారు. అయితే, ఆ మరుసటి రోజే ఎవరో ఈ విగ్రహాన్ని తొలగించారు. గొడవ లేకుండా అంబేద్కర్ విగ్రహాన్ని ఎస్ సికాలనీ సమీపంలో ప్రతిష్టించండని అగ్రకులాల వారు పరిష్కారం చూపారు.   తమ దేవుడి విగ్రహాన్ని తొలగించినందుకు దళితులు ఒక రోజంతా భీమవరం- తాడేపల్లి గూడెం రోడ్డు మీద రాస్తా రోకో కూడా నిర్వహించారు. ‘ది హన్స్ ఇండియా’ రిపోర్టు ప్రకారం ఈ గొడవకు ఒక పరిష్కారం కనుగొనేందుకు సబ్ కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ వచ్చాడు. అయితే, ప్రభుత్వ భూమిని అంబేద్కర్ కోసం కబ్జా చేశారని విగ్రహం తీసేయడాన్ని ఆయన సమర్థించారు.

 

కాని, ఇదే వాదన ప్రకారం చెరువు కట్ట మీద ఉన్న విగ్రహాలను కూడా తీసేయాలని, వాటికొక రూలు,అంబేద్కర్ కొకరూలా అని దళితులునిలదీసేసరికి సబ్ కలెక్టర్ జారుకున్నారని మాల ఐక్య వేదిక కు చెందిన పిర్రే రవి దేవ ‘హన్స్’ కు చెప్పారు.

 

అంబేద్కర్ విగ్రహం విషయంలో దాదాపు 800 మంది దళితులు సాంఘిక బహిష్కరణకు గురి అవుతున్నా జిల్లా కలెక్టర్ గాని, పోలీసు సూపరింటెండెంటు గాని పట్టించుకోనక పోవడం పట్ల గుమ్మపు సూర్యవర ప్రసాద్ (ఎపి మాల మహానాడు) ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సాంఘిక బహిష్కరణ అరోపణలో రాజకీయాలున్నాయని, దళితల ఆరోపణను రుజువు చేయడం కష్టమని పశ్చిమగోదావరి కలెక్టర్ భాస్కర్ కాటమనేని ‘హన్స్’ ప్రతినిధికి చెప్పారు. దళితులు ఫిర్యాదు మీద విచారణ సాగిస్తున్నట్లు ఆయన చెప్పారు.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios