వాస్తు దోషం తొలగిస్తామని మహిళపై పలుమార్లు రేప్.. ఏం చేశారంటే?
మహారాష్ట్రలో కొందరు దుండగులు వాస్తు దోషం తొలగిస్తామని ఆ ఇంటి మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. ఆమె కూడా పూజలో భాగంగా ఉండాలని చెప్పి మత్తు మందు ఇచ్చి పలు చోట్ల పలుమార్లు రేప్ చేశారు.
ముంబయి: మహారాష్ట్రలో కొందరు దుండగులు అహేతుక విశ్వాసాలను ఆధారంగా చేసుకుని మహిళపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడ్డారు. వారి ఇంటికి వాస్తు దోషం ఉన్నదని, దాన్ని తొలగించడానికి పూజలు చేస్తామని నమ్మించారు. డబ్బు, బంగారం తీసుకోవడంతోపాటు పలుమార్లు ఆమెకు మత్తుమందు ఇచ్చి రేప్ చేసిన ఘటన మహారాష్ట్రలోని పాల్‌గడ్‌లో చోటుచేసుకుంది. ఈ మేరకు మహారాష్ట్ర పోలీసులు ఆదివారం వెల్లడించారు.
పోలీసుల వివరాల ప్రకారం, పాల్‌గడ్ జిల్లాలోని తలాసరికి చెందిన దంపతులు తమ ఇంటికి వాస్తు దోషం ఉన్నట్టు అనుకున్నారు. భర్త మిత్రులు దీన్ని పరిష్కరిస్తామని మాయమాటలు చెప్పారు. వాస్తు దోషం, వారిపై ఉన్న శక్తులను తొలగిస్తామని నమ్మబలికారు. తద్వార భర్త ప్రభుత్వ ఉద్యోగం సుస్థిరంగా ఉంటుందని, కుటుంబంలో శాంతి నెలకొంటుందని, సంపద పెరుగుతుందని మాటలతో నమ్మించారు. ఆ దంపతులు వీరు చెప్పేది నిజమేనని భావించారు.
వారి నమ్మకాలను ఆసరాగా చేసుకుని డబ్బు గుంజాలని వారు అనుకున్నారు. ఈ సమస్యలను పరిష్కరించాలంటే ఆ పూజల్లో ఆ మహిళ కూడా భాగంగా ఉండాలని వారిని నమ్మించారు. అందుకు ఆ దంపతులు అంగీకరించారు. 2018 ఏప్రిల్‌లో తరుచూ వారు ఆ ఇంటికి రావడం ప్రారంభించారు.
భర్త ఇంటిలో లేని సమయంలో వారు ఇంటికి వచ్చి పూజలు చేద్దామని మొదలు పెట్టేవారు. పూజలకు సిద్ధమయ్యేటప్పుడు ఆమెకు మత్తు మందు కలిపిన డ్రింక్ ఇచ్చేవారు. దాన్ని పంచామృతమని చెప్పేవారు. నిజమేనని ఆమె తాగి మత్తులోకి జారుకునేది. ఆ తర్వాత ఆమె పై లైంగిక దాడికి పాల్పడేవారు.
Also Read : మూడో కాన్పులోనూ ఆడపిల్లే జన్మించిందని.. కసాయిగా మారిన కన్నతండ్రి.. ఏం చేశాడంటే ?
థానేలోని యూర్ ఫారెస్ట్‌లో 2019లో, ఆ తర్వాత లోనావాలాలోని ఓ రిసార్ట్‌లో ఇలా పలు చోట్ల పలుమార్లు ఆమెను రేప్ చేశారు. అలాగే నగదు రూపంలో సుమారు రూ. 2.10 లక్షలు, బంగారం కూడా తీసుకున్నారు.
ఈ నెల 11వ తేదీన ఆమె తలాసరి పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు రవీంద్ర భాతే, దిలీప్ గైక్వాడ్, గౌరవ్ సాల్వి, మహేంద్ర కుమావత్, గణేశ్ కాదమ్‌లను పోలీసులు అరెస్టు చేశారు. ఈ ఐదుగురు నిందితులు ఇదే విధానంలో ఇంకా వేరే వారినీ కూడా మోసం చేసి ఉన్నారేమో అని దర్యాప్తు చేస్తున్నట్టు తలాసరి పోలీసు స్టేషన్ సీనియర్ ఇన్‌స్పెక్టర్ విజయ్ ముతాదక్ తెలిపారు. వారి పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.