Asianet News TeluguAsianet News Telugu

Presidential Election: బీజేపీ ట్రంప్‌ కార్డుగా ద్రౌపది ముర్ము..! ఆ పార్టీలు ఇరుకునపడినట్టేనా..?

రాష్ట్రపతి ఎన్నికలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ద్రౌపది ముర్ముని అభ్యర్థిగా ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రపతి అభ్యర్థి ఎంపికకు సంబంధించి 20 పేర్లపై విస్తృత చర్చ జరిగిందని.. చివరకు గిరిజన మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా  బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు.

What made BJP pick Draupadi Murmu as its choice for presidential candidate
Author
First Published Jun 22, 2022, 11:36 AM IST

రాష్ట్రపతి ఎన్నికలకు బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏ కూటమి ద్రౌపది ముర్ముని అభ్యర్థిగా ప్రకటించింది. మంగళవారం ఢిల్లీలో జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. దాదాపు రెండు గంటలకు పైగా జరిగిన భేటీలో 20 పేర్లపై విస్తృత చర్చ జరిగిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలిపారు. చివరకు గిరిజన మహిళకు అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్టుగా వెల్లడించారు. అయితే ప్రస్తుత పరిణామాలను గమనిస్తే రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ట్రంప్ కార్డుగా మారారనే మాట వినిపిస్తోంది.

ఎన్డీయే కూటమి ద్రౌపది ముర్ము పేరును ప్రకటించిన తర్వాత.. ఆమెకు ప్రధాని నరేంద్ర మోదీ  శుభాకాంక్షలు తెలిపారు. ‘‘ద్రౌపది ముర్ము ఆమె జీవితాన్ని సమాజానికి సేవ చేయడానికి.. పేదలు, అణగారిన, అట్టడుగు వర్గాలకు సాధికారత కల్పించడానికి అంకితం చేశారు. ఆమెకు గొప్ప పరిపాలనా అనుభవం ఉంది. ఆమె మన దేశానికి గొప్ప అధ్యక్షురాలవుతుందన్న నమ్మకం నాకు ఉంది’’ అని మోదీ ట్వీట్ చేశారు. 

అసలు ద్రౌపది ముర్ము ఎవరు..?
ఆదివాసీ సమాజానికి చెందిన ద్రౌపది ముర్ము.. ఒడిశాలోని మయూర్‌భంజ్‌ జిల్లా బైడపోసి గ్రామంలో 1958 జూన్‌ 20న జన్మించారు. ఆమె ఒడిశాలో విద్యాభ్యాసం సాగించారు. రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత ద్రౌపది ముర్ము.. 1997లో రాయ్‌రంగ్‌పూర్‌ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికయ్యారు. 2000 సంవత్సరంలో రాయ్‌రంగ్‌పూర్‌ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆ సమయంలో ఒడిశాలో ఏర్పాటైన బిజూ జనతాదళ్ (బీజేడీ), బీజేపీ కూటమి ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. బీజేపీ ఒడిశా ఎస్టీ మోర్చా అధ్యక్షురాలిగా పనిచేశారు. 

2013లో ద్రౌపది ముర్మును బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యురాలిగా నియమితులయ్యారు. ఇక,  2015 మే 18న జార్ఖండ్‌ గవర్నర్‌గా నియమితులయ్యారు. 2021 జూన్‌ 12 వరకు ఆ పదవిలో కొనసాగారు. ఆ సమయంలో జార్ఖండ్‌లోని అన్నిపార్టీలతో ఆమె సత్సబంధాలను కలిగిఉన్నారు. తాజాగా ఆమెను ఎన్డీయే కూటమి తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా బీజేపీ ప్రకటించింది.  

అయితే ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము పేరును ఖరారు చేయడం.. ప్రతిపక్ష కూటమి ఐక్యతను దెబ్బతీసే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలో చర్చసాగుతుంది. రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాలు.. వారి ఉమ్మడి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాను ఖరారు చేశాయి. ప్రతిపక్షంలో భాగమైన జార్ఖండ్ ముక్తి మోర్చా రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హాకు మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు. యూపీఏ భాగస్వామిగా ఉన్న జార్ఖండ్ ముక్తి మోర్చా ప్రస్తుతం జార్ఖండ్‌లో అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. 

అయితే ఎన్డీయే కూటమి రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్మును ప్రకటించడం.. ఇప్పుడు జేఎంఎం ఇరకాటంలో నెట్టిందనే వార్తలు వినిపిస్తున్నాయి. జార్ఖండ్ గవర్నర్‌గా పనిచేసిన సమయంలో.. జేఎంఎం అధినేత శిబూ సోరెన్‌తోపాటు ప్రస్తుతం ఆ రాష్ట్రంగా సీఎం ఉన్న హేమంత్ సోరెన్‌తో ద్రౌపదికి మంచి అనుబంధం కూడా ఉంది. ఈ నేపథ్యంలో జేఎంఎం.. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలాంటి వైఖరి అనుసరిస్తుందనేది తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇదిలా ఉంటే ఒడిశాకు చెందిన ద్రౌపది ముర్ముకు.. ఆ రాష్ట్ర సీఎం నవీన్ పట్నాయక్ (బీజేడీ) మద్దుతుగా నిలవనున్నారు.  

దీర్ఘకాలిక ప్రయోజనాలు..
బీజేపీ అధిష్టానం ద్రౌపతి ముర్మును ఎన్డీయే తరఫున రాష్ట్రపతి అభ్యర్థిగా ఖరారు చేయడం వెనక దీర్ఘకాలిక రాజకీయ ప్రణాళికలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. దేశవ్యాప్తంగా బీజేపీకి ఆదివాసీల ఓట్ల షేర్ పెరగడమే కాకుండా.. ఒడిశాలో పార్టీకి మద్దతు పెరుగుతుందని బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. రానున్న రెండేళ్లలో.. గుజరాత్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఈ రాష్ట్రాల్లో ఆదివాసీల ఓటు బ్యాంకు కీలకంగా ఉంది. ఆ ఓటు బ్యాంకును తమవైపుకు మళ్లించుకునేందుకు కూడా బీజేపీ తీసుకన్న ఈ నిర్ణయం దోహదం చేసే అవకాశం ఉంది.  

2011 జనాభా లెక్కల ప్రకారం.. గుజరాత్‌లో 14 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉంది. గుజరాత్‌లోని డాంగ్ వంటి జిల్లాలు ఆదివాసీల ఆధిపత్యంలో ఉన్నాయి. మరోవైపు గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న ఈశాన్య ప్రాంతంలో కూడా ఈ నిర్ణయం.. బీజేపీకి భారీ ప్రయోజనాన్ని చేకూర్చే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం.. భారతదేశంలోని మొత్తం గిరిజన జనాభా 8.6 శాతం. అయితే కొన్ని రాష్ట్రాల్లో గిరిజన జనాభా.. ఇతర రాష్ట్రాల కంటే చాలా ఎక్కువగా ఉంది. షెడ్యూల్డ్ తెగలు మొత్తం జనాభాలో గ్రామీణ ప్రాంతాల్లో 11.3 శాతం, పట్టణ ప్రాంతాల్లో 2.8 శాతంగా ఉంది.

దేశంలో గిరిజన జనాభా ఎక్కువగా ఉన్న రాష్ట్రాల జాబితాను పరిశీలిస్తే.. మిజోరంలో 94.4 శాతం, నాగాలాండ్‌లో 86.5 శాతం, మేఘాలయలో 86.1 శాతం, అరుణాచల్ ప్రదేశ్‌లో 68.8 శాతం, మణిపూర్‌లో 35.1 శాతం, సిక్కింలో 33.8 శాతం, త్రిపుర‌లో 31.8 శాతం, ఛత్తీస్‌గఢ్‌లో 30.6 శాతం, జార్ఖండ్‌లో 26.2 శాతం, ఒడిశా‌లో 22.8 శాతం, మధ్యప్రదేశ్‌లో 21.1 శాతం, గుజరాత్‌లో 14.8 శాతం, రాజస్థాన్‌లో 13.5 శాతం గిరిజన జనాభా ఉంది. 

గత అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ పట్టు కోల్పోయిన ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలో ఈ నిర్ణయంతో కొంత పుంజుకోనే అవకాశం ఉంది. 2011 జనాభా లెక్కల ప్రకారం ఛత్తీస్‌గఢ్‌లో 30 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్నందున.. గిరిజన రాష్ట్రపతి అభ్యర్థిని వ్యతిరేకించడం భూపేష్ బాఘేల్ నేతృత్వంలోని అధికార కాంగ్రెస్ పాలనకు నష్టాన్ని కలిగించవచ్చు.  మరోవైపు 20 శాతం కంటే ఎక్కువ గిరిజన జనాభా ఉన్న మధ్యప్రదేశ్‌లో కూడా ఈ చర్య బీజేపీ సహాయపడుతుందని ఆ పార్టీ వర్గాలు భావిస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో మధ్యప్రదేశ్‌లో విజయం సాధించడం బీజేపీకి చాలా కష్టమైంది. జ్యోతిరాదిత్య సింధియా తనకు మద్దతుగా ఉన్న ఎమ్మెల్యేలతో కలిసి కాంగ్రెస్‌పై తిరుగుబాటు చేయడం వల్లనే కమల్ నాథ్ నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టి బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం సాధ్యమైంది.

మొత్తంగా చూస్తే.. రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్మును అభ్యర్థిగా నిలపడం ద్వారా ఎన్డీయే.. ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై పైచేయి సాధించిందనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి.

Follow Us:
Download App:
  • android
  • ios