పలనా దేశంలో ఒకరి కోసం రైళ్లు, విమానాలు నడిచాయని మనం వార్తల్లో చూశాం. అచ్చం అలాంటి ఘటనే ఒకటి భారతదేశంలోనూ జరిగింది. వివరాల్లోకి వెళితే.. కరోనా నేపథ్యంలో గత ఐదు నెలల పాటు రైల్వే వ్యవస్థ స్థంభించిపోయింది. అయితే ఆదివారం నుంచి తిరిగి తమ సేవలను ప్రారంభించాయి.

ఈ క్రమంలో తొలి రోజు కాల్కా- సిమ్లా హెరిటేజ్ లైనులో కేవలం ఇద్దరు ప్రయాణికులు మాత్రమే ప్రయాణించారు. ఇద్దరు విద్యార్ధులు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) పరీక్షలకు హాజరవుతున్న నేపథ్యంలో వారి కోసం రైలుు నడిపారు.

సోలన్ నుంచి వీరిద్దరిని ఆ రైలు సిమ్లాకు చేర్చింది. దీనిపై కల్కా - సిమ్లా రైల్వే అధికారి ఒకరు మాట్లాడుతూ.. ఎన్డీఏ పరీక్షకు హాజరయ్యే అభ్యర్ధుల కోసం కరోనా మహమ్మారి మధ్య ప్రత్యేక రైలు నడిపామని వెల్లడించారు.

47 కిలోమీటర్ల ఈ మార్గంలో ఇద్దరు మాత్రమే ప్రయాణించారు. అదే రైలు సాయంత్రం తిరిగి వెళ్తుందని.. ఈ రైలుకు 248 మంది ప్రయాణికుల సామర్ధ్యం వుందని ఆయన చెప్పారు.

కాగా నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ), ఇండియన్ నావల్ అకాడమీ (ఐఎన్ఏ) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్ధుల సౌకర్యం కోసం 23 ప్రత్యేక రైళ్లను నడిపినట్లు కేంద్ర రైల్వేశాఖ మంత్రి పియూష్ గోయల్ తెలిపారు.

దేశవ్యాప్తంగా ఎంట్రన్స్ ఎగ్జామ్ (జేఈఈ) ప్రారంభమైన కొన్ని రోజుల తర్వాత యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (యూపీఎస్‌‌సీ), నేషనల్ డిఫెన్స్ అకాడమీ (ఎన్‌డీఏ) ప్రవేశ పరీక్షలను నిర్వహిస్తున్నాయి.

అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో ఏప్రిల్ 19న జరగాల్సిన పరీక్ష వాయిదా పడింది. కోవిడ్ నిబంధనలను పాటిస్తూ ఎన్‌డీఏ 1, ఎన్‌డీఏ 2 పరీక్షలను ఆదివారం ఒకేరోజు నిర్వహించారు.