Asianet News TeluguAsianet News Telugu

ప‌రీక్ష స‌మ‌యాల్లో ఇంటర్‌ నెట్ సేవలపై నిషేధం.. ప్ర‌భుత్వానికి 'సుప్రీం' ఆదేశాలు..  గ‌డువులోగా వివ‌ర‌ణ 

పరీక్షల్లో మోసాలను నిరోధించేందుకు ఇంటర్నెట్ సదుపాయాన్ని విచక్షణా రహితంగా నిలిపివేస్తున్నారని ఆరోపిస్తూ దాఖలైన పిటిషన్ ను సుప్రీం కోర్టు  శుక్ర‌వారం విచారించింది. ఈ విష‌యంలో స్ప‌ష్ట‌మైన వివర‌ణ ఇవ్వాలంటూ.. సుప్రీంకోర్టు కేంద్ర కమ్యూనికేషన్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖను ఆదేశించింది.

Supreme Court seeks Centre response on plea against internet shutdown during exams
Author
First Published Sep 9, 2022, 2:45 PM IST

పరీక్షల్లో మోసాలకు పాల్పడకుండా నివారించేందుకు ప‌రీక్ష కేంద్రాల ప‌రిధిలో ఇంటర్‌ నెట్ సేవలపై నిషేధం విధించడాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖ‌లైంది. రాజస్థాన్‌, అరుణాచల్‌ప్రదేశ్‌తో సహా పలు రాష్ట్రాల్లో కాపీయింగ్‌ను నిరోధించేందుకు ఇంటర్నెట్‌పై నిషేధం విధించడాన్నిసాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్ సంస్థ‌  సుప్రీంకోర్టులో సవాలు చేసింది. ఆ సంస్థ పిల్‌ను శుక్రవారం సుప్రీం కోర్టు భారత ప్రధాన న్యాయమూర్తి  యూ. యూ లలిత్ నేతృత్వంలోని త్రిసభ్య ధర్మాసనం విచారించింది. 

సాఫ్ట్‌వేర్ ఫ్రీడమ్ లా సెంటర్‌కు చెందిన న్యాయవాదులు వృందా గ్రోవర్, ప్రసన్న ఎస్. మాట్లాడుతూ..  ఇంటర్నెట్ షట్‌డౌన్ ఆదేశాలు గోప్యత ముసుగులో జారీ చేయబడ్డాయని, సాధారణంగా ఇటువంటి ఉత్తర్వులు ఇండియన్ టెలిగ్రాఫ్ చట్టం కింద జారీ చేయబడతాయని తెలిపారు. ఈ పిటిషన్‌లో కేంద్ర ప్రభుత్వ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖను పార్టీగా చేర్చాలని పిటిషనర్ సుప్రీంకోర్టును కోరారు. ఇంటర్నెట్ షట్‌డౌన్‌కు సంబంధించిన ప్రామాణిక ప్రోటోకాల్‌పై అఫిడవిట్ దాఖలు చేయాలని మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం ఇంటర్నెట్‌ను నిలిపివేయడం ద్వారా ప్రజల ప్రాథమిక హక్కులను కాలరాస్తోందని సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

ఇంటర్నెట్ షట్ డౌన్ అనేది పబ్లిక్ ఎమర్జెన్సీ ఒక చర్యగా పేర్కొన్నారు. రిటైల్ షాపింగ్ నుండి NREGA వేతనాల వరకు ప్రాథమిక సౌకర్యాలు, సంక్షేమ చర్యలకు కూడా ఆన్‌లైన్‌లో లింక్ చేయబడినప్పుడు.. పరీక్షలలో మోసం జరగకుండా నిరోధించడానికి' ఇంటర్నెట్‌ను మూసివేయడం అనేది స‌రైన‌ది కాద‌నీ, ప‌రీక్ష నిర్వ‌హ‌క సంస్థ‌లు జామర్‌లపై ఆధారపడవచ్చున‌నీ, దానికి బదులుగా ఫ్రిస్కింగ్ చేయవచ్చని  పిటిష‌నర్ త‌రుపు న్యాయ‌వాది గ్రోవర్ పేర్కొన్నారు. 

ఈ సందర్భంగా ప్రతి పరీక్షా కేంద్రంలో జామర్‌లను ఉపయోగించడం వల్ల ఖర్చుతో కూడుకున్నది కాదని ధర్మాసనం పేర్కొంది. ఈ కేసులో ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్, పశ్చిమ బెంగాల్, అరుణాచల్ ప్రదేశ్‌లు పిటిషన్లు దాఖలు చేశాయి. అయితే, ఈ కేసులో కేంద్ర కమ్యూనికేషన్, సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖను ప్రతివాదిగా చేసినా.. కోర్టు ప్రస్తుతానికి ఆ శాఖకు మాత్రమే నోటీసు జారీ చేసింది. వ్యక్తిగతంగా షట్ డౌన్ అయిన సందర్భాల్లో ఆయా రాష్ట్రాల హైకోర్టులను ఆశ్రయించాలని పిటిషనర్‌ను తొలుత కోర్టు కోరింది.సుప్రీం కోర్టు నుండి సాధారణ డిక్లరేటరీ ఉత్తర్వు సహాయం చేయకపోవచ్చని బెంచ్ పేర్కొంది.

అలాగే.. సుప్రీంకోర్టు ఎలక్ట్రానిక్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖకు నోటీసు జారీ చేసింది. మూడు వారాల్లోగా  ఏదైనా ప్రామాణిక ప్రోటోకాల్ ఉందా? లేదా?  వివ‌రించాల‌నీ, పబ్లిక్ పరీక్షల సమయంలో ఇంట‌ర్ నెట్ నిలిపివేత పాటించే స్థాయి, పద్ధతిపై సమాధానం ఇవ్వాలని మంత్రిత్వ శాఖను సుప్రీంకోర్టు కోరింది.

గ‌త నెల‌ల్లో అసోంలో రెండుసార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగ నియామకాల కోసం నిర్వహించే పరీక్షల్లో అవకతవకలను నిరోధించేందుకు ఆగస్టులోనే రెండుసార్లు ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. ఆగస్టు 28వ తేదీన 27 జిల్లాల్లో నాలుగు గంటల పాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. పరీక్ష పూర్తయిన తర్వాత, ఉత్తీర్ణత సాధించని అభ్యర్థుల ఫీజులను వారి బ్యాంకు ఖాతాలకు పంపుతామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి హేమంత్ విశ్వ శర్మ తెలిపారు.

 అంతకుముందు, పరీక్ష సమయంలో ఇంటర్నెట్ సేవను నిలిపివేయాలన్న ఉత్తర్వుపై దాఖలైన రిట్ పిటిషన్‌ను గౌహతి హైకోర్టు కొట్టివేసింది, ఆ తర్వాత అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటు పరీక్ష నిర్వహించిన 27 జిల్లాల్లో 144 సెక్షన్ విధించినట్లు ఓ సీనియర్ అధికారి తెలిపారు. అలాగే..  అస్సాంలో గ్రూప్ IV పరీక్ష నేప‌థ్యంలో ఆగస్టు 21న, గ్రూప్ III పరీక్ష నేప‌థ్యంలో సెప్టెంబర్ 11న ఇంట‌ర్ నెట్ షెడ్ డౌన్ చేశారు. 

Follow Us:
Download App:
  • android
  • ios