కొందరు వ్యక్తులు బస చేయడానికి త్రీస్టార్ హోటల్ కి వచ్చారు. అక్కడికి రావడం రావడమే.. రుబాబు చేయడం మొదలుపెట్టారు. తమకు సెక్స్ వర్కర్లు కావాలంటూ హోటల్ సిబ్బందిని డిమాండ్ చేశారు. వారి దగ్గర నుంచి సమాధానం రాకముందే బలవంతంగా ఇద్దరు హోటల్ సిబ్బందిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ సంఘటన రాజస్థాన్ లో చోటుచేసుకోగా..  పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

రాజస్థాన్ లోని నీమ్రాన్ ప్రాంతంలోని ఓ త్రీస్టార్ హోటల్ కి కొందరు దుండగులు వచ్చారు. ఓ వ్యాపారవేత్తను హత్య  చేసేందుకు వారు హోటల్ లోదిగారు. కాగా.. హోటల్‌లో దిగిన నిందితులు తమ కోసం సెక్స్ వర్కర్లను ఏర్పాటు చేయాలని హోటల్ మేనేజర్‌ను కోరారు. ఆ తర్వాత కాసేపటికే మహిళా ఉద్యోగులు నిద్రిస్తున్న గదిలోకి బలవంతంగా చొరబడి ఇద్దరు మహిళలను తుపాకితో బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. 

మిగతా ముగ్గురు నిందితులు వారికి కాపలాగా ఉన్నారు. అప్పటికే వారి తీరును అనుమానించిన మేనేజర్ సమీపంలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తమ హోటల్‌లో దిగిన వారి వద్ద  మారణాయుధాలు ఉన్నాయని ఫిర్యాదు చేశాడు. విషయం తెలిసి అప్రమత్తమైన భివాడి ఎస్పీ రామ్మూర్తి జోషి పోలీసులు బృందాలను ఏర్పాటు చేసి హోటల్‌లో కార్డన్ సెర్చ్ నిర్వహించాలని ఆదేశించారు. దీంతో హోటల్‌లో తనిఖీలు నిర్వహించిన పోలీసులు  మహిళలను రక్షించి నిందితులు ఐదుగురినీ అరెస్ట్ చేశారు. 

 

అనంతరం పోలీసులు జరిపిన దర్యాప్తులో విస్తుపోయే విషయాలు వెలుగు చూశాయి. హౌసింగ్ సొసైటీ చైర్మన్‌గా పనిచేస్తున్న నరేశ్ జాట్ నుంచి రూ. 20 లక్షలు డిమాండ్ చేసిన నిందితులు.. ఆయన కనుక ఆ మొత్తాన్ని ఇవ్వకుంటే హత్య చేయాలని పథకం పన్నారని పోలీసులు తెలిపారు. నరేశ్ గుజ్జర్‌పై ఇప్పటికే ఓ హత్య కేసు నమోదై ఉన్నట్టు పోలీసులు పేర్కొన్నారు. నిందితుల నుంచి రెండు తుపాకులు, లైవ్ కాట్రిడ్జ్‌లు స్వాధీనం చేసుకున్నారు.