రేప్ చేశాడన్న ఆరోపణలతో అరెస్టు.. జైలులోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న యువకుడు
ముంబయిలోని తలోజా జైలులో ఓ విచారణ ఖైదీ సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. రేప్ అభియోగాలతో జైలుకు వచ్చిన అతడు మంగళవారం తెల్లవారుజామున ప్రాణాలొదిలాడు. పోక్సో సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద ఆ 19 ఏళ్ల యువకుడిపై కేసు నమోదైంది.

ముంబయి: మహారాష్ట్రలోని తలోజా జైలులో 19 ఏళ్ల విచారణ ఖైదీ ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మైనర్ బాలికపై అత్యాచారం ఆరోపణలతో జైలుకు వెళ్లిన ఆ యువకుడు మంగళవారం తెల్లవారుజామున సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని ప్రాణాలు వదిలాడు. తోటి ఖైదీలు అధికారులకు తెలియజేయడంతో వారు వెంటనే హాస్పిటల్‌కు తీసుకెళ్లారు. కానీ, ఆ నిందితుడు అప్పటికే మరణించాడని వైద్యులు స్పష్టం చేశారు.
పోలీసుల వివరాల ప్రకారం, కరణ్ ప్రమోద్ సేరియన్ ముంబ్రా నివాసి. 16 ఏళ్ల బాలికతో ఆయన సంబంధం పెట్టుకున్నాడు. సోషల్ మీడియాలో కలిసిన ఆమెతో కలిసి లేచి పోయారు. పెళ్లి చేసుకుంటా అని మాట ఇచ్చి ఆమెను తీసుకెళ్లాడు. ముంబ్రాలో ఇద్దరూ ఉన్నారు. ఆ సమయంలో బాలికతో అతను శారీరక సంబంధం పెట్టుకున్నట్టు అధికారులు తెలిపారు.
బాలిక తల్లిదండ్రులు కామోతే పోలీసులకు ఫిర్యాదు చేశారు. కరణ్ ప్రమోద్ సేరియన్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ తర్వాత అతడిని సెప్టెంబర్ 22న అరెస్టు చేశారు. 26వ తేదీన జైలుకు పంపారు. పోక్సో సహా ఐపీసీలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదైంది.
Also Read: వృద్ధుడి కోసం నీళ్లు అడిగినందుకు దళితుడిపై దాడి.. పోలీసులకు ఫిర్యాదు.. మనస్థాపంతో యువకుడు ఆత్మహత్య
అతనిపై రేప్ కేసు నమోదు కావడంపై సేరియన్ కలత చెంది ఉండొచ్చని భావిస్తున్నారు. అతను ఉంటున్న బ్యారక్‌లోనే సీలింగ్ ఫ్యాన్‌కు తన పైజామాతో ఉరేసుకుని మరణించాడు. నవి ముంబయిలోని తలోజా సెంట్రల్ జైలులో ఈ ఘటన జరిగినట్టు పోలీసులు వివరించారు.