ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్లమెంటరీ పార్టీ కీలక భేటీ మంగ‌ళ‌వారం ఉద‌యం మొదలైంది. ప్రధాని నరేంద్ర మోదీ ఈ సమావేశానికి హాజరై సభ్యులకు దిశానిర్దేశం చేస్తున్నారు. 

ఆపరేషన్ సిందూర్ విజయానికి ప్రధానికి సన్మానం

పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాలపై భారత దళాలు నిర్వహించిన ఆపరేషన్ సిందూర్ విజయవంతం కావడంతో, సమావేశానికి ముందు ఎన్డీఏ నేతలు ప్రధాని మోదీని అభినందించారు. ఈ ఆపరేషన్ భారత్ భద్రతా వ్యూహంలో కీలక ఘట్టంగా నిలిచింది.

Scroll to load tweet…

ప్రధాని–హోంమంత్రి భేటీపై ఊహాగానాలు

ఇటీవ‌ల ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా రాష్ట్రపతి ద్రౌపదీ ముర్మును వేర్వేరుగా రాష్ట్రపతి భవన్‌లో కలిసిన విషయం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ భేటీలపై అధికారిక ప్రకటన లేకపోయినా, జమ్మూ కశ్మీర్‌కు రాష్ట్రహోదా పునరుద్ధరణపై చర్చ జరిగి ఉండవచ్చని రాజకీయ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ఆర్టికల్ 370 రద్దు చేసి ఆరు సంవత్సరాలు పూర్తి అవుతున్న వేళ, ఈ చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి.

జమ్మూ కశ్మీర్ రాష్ట్రహోదాపై ఒమర్ అబ్దుల్లా స్పందన

జమ్మూ కశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ పరిణామాలపై స్పందించారు. “ఎన్డీఏ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో రాష్ట్రహోదా చర్చకు వచ్చే అవకాశం లేదనుకుంటున్నాను. అయితే పార్లమెంట్ వర్షాకాల సమావేశాల ముగింపు నాటికి సానుకూల నిర్ణయం వచ్చే అవకాశం ఉంది” అని ఆయన పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై తాను ఇంకా ఆశ‌తో ఎదురుచూస్తున్నానని చెప్పారు.

ముఖ్య నిర్ణయాలపై ఎదురుచూపులు

ఈ సమావేశంలో పార్లమెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలతో పాటు, కేంద్ర ప్రభుత్వం కొత్త నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉన్నట్లు వర్గాలు చెబుతున్నాయి. జమ్మూ కశ్మీర్ అంశం, ప్రతిపక్ష విమర్శలకు ప్రతిస్పందన, రాబోయే శాసన కార్యక్రమాలపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.