ఢిల్లీ మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్  తన భర్తతో విడాకులు తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ హర్యానా కన్వీనర్ నవీన్ జైహింద్ ను పెళ్లాడిన ఆమె.. చట్టబద్దంగా విడిపోయారు. కాగా... భర్తతో విడిపోయిన సందర్భంగా ఆమె పెట్టిన ఎమెషనల్ పోస్టు ప్రస్తుతం వైరల్ గా మారింది.

దేశంలోనే అత్యంత పిన్నవయసులో మహిళా కమిషనర్ గా బాధ్యతలు  చేపట్టి రికార్డు నెలకొల్పిన ఆమె.. ప్రస్తుతం భర్తతో విడిపోయి మరోసారి వార్తల్లోకి ఎక్కారు. తన భర్తతో అధికారికంగా విడాకులు వచ్చాయంటూ ఆమె సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు. విడాకుల విషయాన్ని తెలియజేస్తూ... ఆమె చేసిన ట్వీట్ అందరినీ కదిలిస్తోంది.

Also Read రేపిస్టులు పారిపోతుంటే...చూస్తూ ఉరుకోవాలా..? స్వాతి మలివాల్.

''మన జీవితంలో రంగుల కలలు ముగిసిపోవడం కంటే బాధాకరమైన విషయం ఇంకోటి ఉండదు. నా కల కూడా చెదిరిపోయింది. నేను, నవీన్ వేరుపడ్డాం. నిజానికి.. మంచి మనసులు కలిగినవారు కూడా ఒక్కోసారి కలిసి ఉండలేరు. నాదీ అదే పరిస్థితి. అయితే నా జీవితాంతం తనను మిస్ అవుతాను. నాలాగా కలలు చెదిరిపోయిన ప్రతి ఒక్కరికీ బాధను తట్టుకునే శక్తినివ్వాలని ఆ భగవంతుణ్ని వేడుకుంటున్నా..'' అంటూ ఆమె తన విడాకుల గురించి ప్రస్తావించారు.

నవీన్ ని ఆమె ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఇద్దరూ ఆమ్ ఆద్మీ పార్టీలో చేరిపోయారు. నవీన్  ఆప్ హర్యానా విభాగానికి కన్వీనర్  అవ్వగా... ఢిల్లీలోని ఎమ్మెల్యే టికెట్ మిస్ కావడంతో స్వాతి మహిళా కమిషన్ ఛైర్ పర్సన్ పదవి దక్కించుకున్నారు. ఆ పదవి చేపట్టిన నాటి నుంచి మహిళల రక్షణ కోసం ఆమె చాలా కృషి చేశారు.

చిన్నారులపై అత్యాచారాలు చేసేవాళ్లకు కఠినంగా శిక్షలు విధించేలా పోక్సో చట్టం రావడంలో ఆమె కృషి కూడా ఉంది. అత్యాచారాలకు వ్యతిరేకంగా ఇటీవలే నిరాహార దీక్ష కూడా చేపట్టారామె. కాగా, మీటూ ఉద్యమం సమయంలో స్వాతి భర్త నవీన్‌.. మహిళలను కించపరుస్తూ చేసిన కామెంట్స్.. వారి మధ్య దూరానికి కారణమైంది. ఆ కామెంట్స్ తో మొదలైన దూరం... విడాకులు తీసుకునేదాకా వచ్చింది.