కస్టడీలో నుంచి రేపిస్టులు పారిపోతుంటే.. పోలీసులు మాత్రం చూస్తూ ఉరుకోవాలా అంటూ దిశ కేసు ఎన్ కౌంటర్ పై ఢిల్లీ కమిషన్ ఫర్ ఉమన్ ఛైర్ పర్సన్ స్వాతి మలివాల్ అభిప్రాయపడ్డారు.

హైదరాబాద్ లో దిశను అత్యంత కిరాతకంగా హత్య చేసిన నిందితులు పారిపోవడానికి ప్రయత్నిస్తుండగా ... పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన సంగతి తెలిసిందే. దీనిపై స్వాతి మలివాల్ మాట్లాడారు. దిశ హత్య కేసులో నిందితులకు శిక్ష విధించాలంటూ  ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టారు. నేటికి ఆమె నిరాహార దీక్ష చేపట్టి నాలుగు రోజులు అయ్యింది.

ఈ రోజు నిందితులకు శిక్ష పడటంతో ఆమె మీడియాతో మాట్లాడారు. రేపిస్టులు పారిపోతుంటే పోలీసులు చూస్తూ ఉరుకోవాలా అని ఆమె ప్రశ్నించారు. బలమైన వ్యవస్థలు ఉన్నప్పుడే మహిళలపై ఇలాంటి దారుణాలు జరగకుండా ఉంటాయని చెప్పారు. వ్యవస్థలు బలంగా లేకపోతే, ఇలాంటి దారుణాలు జరుగుతూనే ఉంటాయన్నారు. కనీసం ఈ నిందితులైనా ఎక్కువ రోజులు భూమి మీద లేరని అందుకు సంతోషంగా ఉందన్నారు. నిర్భయ ఘటనలో నిందితులు మాత్రం ఇంకా ట్యాక్స్ పేయర్స్ మీద ఆధారపడి బతికేస్తున్నారని అన్నారు. అంటే.. జైల్లో ఉండి ప్రజల సొమ్ము తింటున్నారని ఆమె అభిప్రాయపడ్డారు.