దెయ్యం వదిలిస్తానని నమ్మించి మైనర్ బాలికపై మాంత్రికుడి అత్యాచారం.. యూపీలో ఘటన
ఉత్తరప్రదేశ్‌లో మూఢనమ్మకాలను ఆలంబన చేసుకుని ఓ దుండగుడు మైనర్ బాలికపై లైంగికదాడికి పాల్పడ్డాడు. దెయ్యం వదిలిస్తానని బాలిక తల్లిని ఒప్పించి ఆమెను తనతో పాటు నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే రేప్ చేశాడు.

న్యూఢిల్లీ: దెయ్యాన్ని వదిలించే తాంత్రికుడినని నమ్మించి ఓ దుండగుడు మైనర్ బాలిక పై పంజా విసిరాడు. మైనర్ బాలికపై దెయ్యం కూర్చున్నదని, దాన్ని తాను వదిలిస్తానని ఆ కుటుంబాన్ని ఒప్పించాడు. ఆమెను ఒంటరిగా తీసుకెళ్లాలని కూడా ఒప్పించాడు. అనంతరం, ఆ బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి.. అక్కడే లైంగికదాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని కౌశాంబి జిల్లాలో చోటుచేసుకుంది.
కౌశాంబి జిల్లాకు చెందిన 14 ఏళ్ల బాలికకు మూర్ఛ వ్యాధి ఉన్నది. ఈ న్యూరోలాజికల్ సమస్యపై అక్కడ అవగాహన లేదు. సాధారణ హాస్పిటళ్లలో ఆమెను చేర్చారు. కానీ, అక్కడా ప్రభావవంతమైన వైద్యం అందలేదు. ఇక ఇది ఆధునిక వైద్యానికి లొంగే సమస్య కాదని ఆ కుటుంబంలో ఓ సంశయం బయల్దేరింది. ఈ బలహీన పరిస్థితిని ఓ దుండగుడు క్యాచ్ చేసుకున్నాడు. ఆ నిందితుడిని 45 ఏళ్ల అశోక్ కుమార్‌గా పోలీసులు గుర్తించారు.
Also Read: మహిళ రేప్ చేసినట్టు మైనర్ బాలిక ఫిర్యాదు.. ఖంగుతిన్న పోలీసులు.. అసలేం జరిగిందంటే?
మూడు సంవత్సరాలుగా ఆ బాలిక మూర్ఛ వ్యాధితో బాధ పడుతున్నది. అనేక ప్రైవేట్ హాస్పిటల్స్‌లో అడ్మిట్ చేసినా ఆమె ఆరోగ్య పరిస్థితి మెరుగు పడలేదు. ఇలాంటి పరిస్థితిలో డిసెంబర్ 24 వ తేదీన బాలిక తండ్రి ఇంటి నుంచి దూరంగా ఉన్న సమయంలో నిందితుడు వారి ఇంటికి వచ్చాడు. తాను మాంత్రికుడినని, బాలికపై ఉన్న దెయ్యాన్ని వదిలిస్తానని ఆమె తల్లిని నమ్మించాడు. ఆ దెయ్యాన్ని వదిలించడానికి బాలికను తనతో పంపాలని తల్లిని ఒప్పించాడు. అనంతరం, ఆ 14 ఏళ్ల బాలిక ను ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లాడు. అక్కడే రేప్ చేసినట్టు పిప్రి పోలీసు స్టేషన్ ఎస్‌హెచ్‌వో శ్రవణ్ కుమార్ సింగ్ తెలిపారు.
ఈ ఘటనకు సంబంధించి ఎఫ్ఐఆర్ నమోదైంది. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో, ఐపీసీలోని ఇతర సెక్షన్ల కింద నిందితుడిపై కేసు నమోదైంది. నిందితుడిని పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు.