ప్రేమ పేరిట దగ్గరయ్యాడు... పెళ్లి చేసుకుంటానని నమ్మించాడు. శారీరకంగా దగ్గరయ్యాడు. తీరా యువతి పెళ్లి అసేసరికి తప్పించుకు తిరుగడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని బాధపడిన యువతి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది.

దీంతో... పోలీసులు యువకుడిని వెతికి తీసుకువచ్చి మరీ... ఐసీయూలోనే పెళ్లి చేశారు. కానీ.... తాళికట్టినట్లే కట్టి... అక్కడి నుంచి పరారయ్యాడు. ఈ సంఘటన మహారాష్ట్రలోని పూణే లో చోటుచేసుకుంది.

పూర్తి వివరాల్లోకి వెళితే.... సూరజ్‌ నలవాడే అనే యువకుడు ఓ యువతిని గత కొంతకాలం నుంచి ప్రేమిస్తున్నాడు. పెళ్లి చేసుకుంటానని నమ్మించి ఆమెకు శారీరకంగా దగ్గరయ్యాడు యువకుడు. అయితే పెళ్లి చేసుకుందాం అని యువతి అడిగేసరికి అతను ముఖం చాటేశాడు.

దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన బాధితురాలు నవంబర్‌ 27న పురుగుల మందు సేవించి ఆత్మహత్యయత్నం చేసింది. అప్రమత్తమైన కుటుంబ సభ్యులు ఆమెను చికిత్స నిమిత్తం ఆస్పత్రిలో చేర్పించారు. తనది తక్కువ కులం కావడంతోనే పెళ్లికి అంగీకరించలేదని బాధితురాలు వాపోయింది.

ఈ ఘటనపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టి.. ఆ యువకుడిని యువతి చికిత్స పొందుతున్న ఆస్పత్రికి నిన్న తీసుకువచ్చారు. ఐసీయూలోనే యువతితో బలవంతంగా యువకుడికి పెళ్లి జరిపించారు.

పోలీసుల సమక్షంలోనే ప్రేమికులు దండలు మార్చుకున్నారు. అయితే పెళ్లి అయిన కొద్దిసేపటికే యువకుడు ఆస్పత్రి నుంచి పారిపోయాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. యువకుడి ఆచూకీ కోసం గాలిస్తున్నారు.