సారాంశం
బిడ్డకు పేరు పెట్టడంలో తల్లిదండ్రులకు ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో కేరళ హైకోర్టు ముందడుగు వేసి పాపకు పేరు పెట్టే నిర్ణయం తీసుకుంది.
తిరువనంతపురం: కేరళ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఓ మూడేళ్ల బిడ్డకు పేరు పెట్టాలని నిర్ణయించుకుంది. ఆ బిడ్డ తల్లిదండ్రులు ఇద్దరూ వేరుగా నివసిస్తున్నారు. బిడ్డ తల్లితోనే ఉంటున్నది. బిడ్డకు పేరు పెట్టే విషయమై తల్లి హైకోర్టును ఆశ్రయించింది. తల్లి సూచించిన పేరు తండ్రికి, తండ్రి చెప్పిన పేరు తల్లికి రుచించడం లేదు. దీంతో కేరళ హైకోర్టు ముందడుగు వేసి బిడ్డకు పేరు పెట్టింది.
ఆ దంపతులకు 2020 ఫిబ్రవరి 12వ తేదీన పండంటి బిడ్డ జన్మించింది. కానీ, వారి మధ్య విభేదాలు మొదలయ్యాయి. దీంతో వేరుపడి జీవిస్తున్నారు. ఆ పాప తల్లితోనే ఉంటున్నది. అయితే, మూడేళ్లు గడిచినా పాపకు పేరు పెట్టలేదు. పేరు పెట్టనిదే బర్త్ సర్టిఫికేట్ పొందలేం. కాబట్టి, తల్లి తన కూతురు పేరును రిజిస్టర్ చేయించాలని అనుకుంది.
కానీ, రిజిస్ట్రార్ మాత్రం తల్లీ తండ్రి ఇద్దరూ హాజరైతేనే పేరు రిజిస్టర్ చేస్తానని స్పష్టం చేశాడు. కానీ, వారిద్దరూ పేరు పెట్టడంలో ఏకాభిప్రాయానికి రాలేదు. దీంతో చివరకు ఆ తల్లి కేరళ హైకోర్టును ఆశ్రయించింది. తల్లి సూచించిన పేరున పరిగణనలోకి తీసుకోవాలని, అలాగే తండ్రి సూచించిన పేరునూ పరిశీలించాలని హైకోర్టు పేర్కొంది. ఇద్దరి అభిప్రాయాలకు ప్రాధాన్యత ఇచ్చుకుంటూ పేరు పెట్టాలని జస్టిస్ బెచు కురియన్ థామస్ గత నెల ఆదేశాలు వెలువరించింది.
దీంతో సెప్టెంబర్ 5వ తేదీన కోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. తల్లిదండ్రుల హక్కుల కంటే కూడా ఆ పాప సంక్షేమం ప్రాధాన్య విషయం అని కోర్టు పేర్కొంది. పేరు ఎంపిక చేసుకునేటప్పుడు పాప సంక్షేమం, సాంస్కృతిక, తల్లిదండ్రుల, సామాజిక కట్టుబాట్లను పరిగణణలోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. అన్నింటికంటే ముఖ్యమైన అంశం ఇక్కడ బిడ్డ సంక్షేమం అని, కాబట్టి, పైన ప్రస్తావించిన విషయాలను దృష్టిలో పెట్టుకుని పేరు పెట్టే నిర్ణయం తీసుకోవలని నిర్ణయం తీసుకుందని వివరించింది.
పేరెన్స్ పేట్రియా అనేది ఒక చట్టబద్ధమైన నిబంధన. పౌరులపై ఒక ప్రొటెక్టివ్ రోల్‌ను ప్రభుత్వం లేదా కోర్టు పోషించే అవకాశాన్ని ఈ నిబంధన కల్పిస్తుంది.