ఆమె యూపిఎస్సి ఆలిండియా టాపర్… అంతేకాదు ఇప్పుడు ఓ జిల్లాకు కలెక్టర్. ఇంతటి పెద్ద హోదాలో ఉన్నాకూడా ఆమె చీపురుపట్టి రోడ్డు ఊడ్చారు. ఇంతకూ ఆ కలెక్టరమ్మ ఎవరు? ఎందుకిలా రోడ్డు ఊడ్చారు? అనేది తెలుసుకుందాం.
Tina Dabi IAS : Navo Barmer (నవో బార్మర్)… ప్రధానమంత్రి ‘స్వచ్చ భారత్' స్పూర్తితో రాజస్థాన్ ప్రభుత్వం చేపట్టిన స్వచ్చతా కార్యక్రమం. రాజస్థాన్ లోని బార్మర్ పట్టణాన్ని పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని స్థానిక పాలకులు, అధికారులు ఈ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. ఇందులో భాగంగానేే యూపిఎస్సి టాపర్ గా మనందరికి తెలిసిన టీనా దాబి చీపురుపట్టారు. ఎందుకంటే ఆమె ప్రస్తుతం ఈ బార్మర్ జిల్లా కలెక్టర్.
ఇవాళ(శనివారం) ఉదయం కలెక్టర్ టీనా దాబి అధికారులతో కలిసి బార్మర్ పట్టణంలో చేపట్టిన స్వచ్చ కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టణంలో శుభ్రతను పరిశీలించిన కలెక్టర్ స్వయంగా చీపురు పట్టారు. సామాజిక కార్యకర్తలు, ఎన్సిసి క్యాడెట్‌లు ఈ శుభ్రతా కార్యక్రమంలో పాల్గొన్నారు… వారిలో స్పూర్తిని నింపేందుకు కలెక్టర్ టీనా స్వయంగా నగరాన్ని శుభ్రం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ… రోడ్లపై చెత్త వేయరాదని పట్టణ ప్రజలకు సూచించారు. పట్టణంలో చెత్త సేకరణకు అనువుగా చెత్తకుండీలు ఏర్పాటు చేసామని… అందులోనే వేయాలని సూచించారు. వ్యాపారులు తమ దుకాణాల ముందు చెత్త వేయవద్దని… ఎప్పుడూ శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని కోరారు. ప్రతి దుకాణం ముందు చెత్తబుట్ట ఉంచాలని ఆమె ఆదేశించారు.
పట్టణ శుభ్రత కేవలం మున్సిపాలిటీ అధికారులు, పారిశుద్ద్య కార్మికుల బాధ్యత కాదు… ప్రతి ఒక్కరి బాధ్యత అని ఈ టీనా దాబి అన్నారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటే మనకే మంచిదని… ఆహ్లాదకరమైన వాతావరణంతో పాటు ఆరోగ్యం బాగుంటుందన్నారు. స్వయంగా కలెక్టరమ్మ చీపురు పట్టడంతో కొంతమంది దుకాణదారులు కూడా కదిలారు..తమ దుకాణాల ముందు శుభ్రం చేసుకున్నారు.
దుకాణాల ముందు చెత్త వేస్తే తోపుడు బండ్లను తొలగిస్తామని కలెక్టర్ హెచ్చరించారు. కాబట్టి తోపుడు బండ్లపై వ్యాపారాలు చేసేవారు కూడా స్వచ్చత విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. క్లీనింగ్ విషయంలో బాధ్యతారహితంగా వ్యవహరించే దుకాణదారులపై చర్యలు తీసుకుంటామని కలెక్టరమ్మ హెచ్చరించారు.
'నవో బార్మర్' కార్యక్రమంలో భాగంగా పట్టణ శుభ్రతను మెరుగుపరచడానికి ప్రతిరోజూ తనిఖీలు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రతి వార్డులో ప్రజల భాగస్వామ్యంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహిస్తామని కూడా తెలిపారు.
