బిహార్ లో పెళ్లి బృందంతో వెళుతున్న కారు ప్రమాదానికి గురయ్యింది. ఈ దుర్ఘటనలో ఎనిమిదిమంది చనిపోగా మరికొందరు ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్ల ో చికిత్స పొందుతున్నారు. ఈ దుర్ఘటనకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
Bihar Road Accident : బీహార్‌లో తెల్లవారుజామున ఘోర రోడ్డుప్రమాదం చోటుచేసుకుంది. అర్ధరాత్రి కటిహార్ జిల్లాలోని జాతీయ రహదారిపై వేగంగా వెళుతున్న కారు ట్రాక్టర్ ను ఢీకొట్టింది. దీంతో కారులోని 8 మంది అక్కడికక్కడే మరణించగా, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.
కటిహార్ జిల్లాలోని సమేలి బ్లాక్ ఆఫీస్ దగ్గర ఈ ఘోర ప్రమాదం జరిగింది. పెళ్లి బృందం ప్రయాణిస్తున్న వాహనం ఎదురుగా వస్తున్న ట్రాక్టర్‌ను ఢీకొట్టింది. రెండు వాహనాల వేగం ఎక్కువగా ఉండటంతో SUV నుజ్జునుజ్జయింది. కారులోని చాలామంది అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.
ప్రమాదంపై సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.తీవ్రంగా గాయపడినవారిని ముందుగా హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను కూడా అక్కడినుండి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
స్థానిక ఎస్పీ వైభవ్ శర్మ మాట్లాడుతూ... ఈ రోడ్డుప్రమాదంలో మృతులంతా పురుషులే, సుపాల్ జిల్లా వాసులేనని తెలిపారు. చనిపోయిన వారి వివరాల గుర్తింపు ప్రక్రియ కొనసాగుతోందని అన్నారు. .
గాయపడిన ఇద్దరిని సమీప ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వారి పరిస్థితి కూడా విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. చికిత్స కొనసాగుతోందని.. ప్రాణాలు కాపాడేందుకు మెరుగైన చికిత్స అందిస్తున్నామని వైద్యులు చెబుతున్నారు.
ట్రాక్టర్ డ్రైవర్ పరారీ
ఈ రోడ్డుప్రమాదం తర్వాత ట్రాక్టర్ డ్రైవర్ పరారయ్యాడు. పోలీసులు అతని కోసం గాలిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు ఫోరెన్సిక్ పరీక్షలు చేపట్టారు. డ్రైవర్ల నిద్రమత్తు, అతివేగమే ఈ ప్రమాదానికి కారణమై ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు.
కారులో ప్రయాణిస్తున్న వారంతా పెళ్లి నుంచి వస్తున్నారు. కుటుంబంలో సంతోషం నెలకొని ఉన్న సమయంలో ఈ ప్రమాదం అందరినీ శోకసంద్రంలో ముంచెత్తింది. గ్రామంలో, బంధువుల ఇళ్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
ఈ ఘోర ప్రమాదం జరిగిన NH-31పై వేగంగా వాహనాలు నడుపుతున్నారని... ట్రాఫిక్ నియంత్రణ లేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. రోడ్డు భద్రతపై చర్యలు తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని కోరుతున్నారు.


