జమ్మూ కాశ్మీర్‌లోని రంబన్ జిల్లాలో ఆదివారం ఘోర ప్రమాదం జరిగింది. ఆర్మీ జవాన్లు ప్రయాణిస్తున్న వాహనం లోయలో పడిపోయింది. దీంతో ముగ్గురు జవాన్లు అక్కడిక్కడే ప్రాణాలు వదిలారు.
జమ్మూ కాశ్మీర్ లో ప్రస్తుతం భారత ఆర్మీ హైఅలర్ట్ గా ఉంది. పహల్గాం ఉగ్రదాడి తర్వాత భారత సైన్యం పాక్ కు గట్టి జవాబు ఇచ్చేందుకు సిద్దమవుతోంది. ఇలాంటి సమయంలో జమ్మూ కాశ్మీర్ లో జరిగిన ఓ రోడ్డుప్రమాదం ముగ్గురు జవాన్లను బలితీసుకోవడం విషాదకరం.
జమ్మూ నుండి శ్రీనగర్ కు ఆర్మీ జవాన్లతో వెళుతున్న వాహనం రంబన్ జిల్లాలో ప్రమాదానికి గురయ్యింది. ఘాట్ రోడ్డుపై వెళుతుండగా వాహనం అదుపుతప్పి లోతైన లోయలో పడిపోయింది. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు... మరికొందరు తీవ్ర గాయాలపాలయ్యారు.
నేషనల్ హైవే 44 పై ఈ ప్రమాదం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే స్థానిక పోలీసులతో పాటు ఎస్డిఆర్ఎఫ్ బలగాలు, ఆర్మీ సిబ్బంది, స్థానికులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ముందుగా గాయపడిన సైనికులను లోయలోంచి బయటకు తీసి దగ్గర్లోని హాస్పిటల్ కు తరలించారు. అనంతరం మృతదేహాలను తీసి పోస్టుమార్టం నిమిత్తం సైనిక హాస్పిటల్ కు తరలించారు. మృతులను అమిత్ కుమార్, సుజిత్ కుమార్, మాన్ బహదూర్ గా గుర్తించారు.


