సాహితీ స్ట్రష్ట.. కలంతో జనాల్ని కదిలించి.. రగిలించిన కరుణానిధి

karunanidhi as a script writer
Highlights

రాజకీయాలు, సినిమాలతోపాటు తమిళ సాహిత్య రంగంలోనే కరుణానిధి తనదైన ముద్ర వేశారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే కరుణానిధి నాటకాలు, కవితలు, సాహిత్యం అంటే ఎక్కువ మక్కువ చూపేవారు

రాజకీయాలు, సినిమాలతోపాటు తమిళ సాహిత్య రంగంలోనే కరుణానిధి తనదైన ముద్ర వేశారు. పాఠశాల విద్యార్థిగా ఉన్నప్పుడే కరుణానిధి నాటకాలు, కవితలు, సాహిత్యం అంటే ఎక్కువ మక్కువ చూపేవారు. అదే ఆయనను తమిళ సినీ పరిశ్రమ అడుగు పెట్టేలా చేసింది. అలా తమిళ సినీ పరిశ్రమలో అడుగు పెట్టిన కరుణానిధి స్క్రీన్ రచయితగా కెరీర్ ప్రారంభించారు. సహజసిద్ధంగా ఆయనకు గల తెలివితేటలు, వ్యాఖ్యాన నైపుణ్యం.. ఆయన ప్రజాదరణ గల నాయకుడిగా శరవేగంగా ఎదిగేందుకు దోహదపడ్డాయి.

ద్రవిడ ఉద్యమంలో భాగస్వామిగా, హేతువాద, సామ్యవాద సిద్ధాంతాల పట్ల ఆకర్షితులైన కరుణానిధి తన రచనల్లో ఆ భావాలకు ప్రాధాన్యం ఇచ్చే వారు. చారిత్రక, సామాజిక సంస్కరణలను ప్రోత్సహిస్తూ ఆయన రచనలు సాగాయి. 14వ ఏటనే నాటకాలు వేయడం, కవిత్వం రాయడం ప్రారంభించారు. అయితే స్క్రిప్ట్ రాయడంతో పాటు నాటకాల్లో కూడా నటించాలని.. ద్రావిడ నడిగర్ కళగం వారు షరతు పెట్టడంతో తప్పనిసరి పరిస్థితుల్లో నాటకాల్లో నటించారు.

ఆయన ప్రదర్శనలను ద్రవిడ దిగ్గజాలు పెరియార్ రామస్వామి, అన్నాదురైలు కూడా చూసేవారు. ఈ సమయంలో ఆయన రాసిన వ్యాసాలు కొన్ని పార్టీల అభిమానులకు రుచించేది కాదు.. ‘‘తొజిలాలర్ మిత్రన్’’ అనే పత్రికకు రాసిన వ్యాసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు ఆగ్రహం తెప్పించడంతో.... వారి చేతిలో దాడికి గురయ్యారు కరుణ. అనంతరం కోయంబత్తూరులో ప్రసిద్ధి చెందిన జుపిటర్ పిక్చర్స్ సంస్థ కరుణానిధి ప్రతిభను గుర్తించి స్క్రిప్ట్ రైటర్‌గా కొత్త జీవితాన్ని ప్రారంభించారు.

1947లో రాజకుమారి అనే చిత్రానికి సంభాషణలు రాశారు.. ఈ సినిమా ద్వారా ఎంజీఆర్ సినీరంగ ప్రవేశం చేశారు. అలా మొత్తం తన కెరీర్‌లో 39 సినిమాలకు స్క్రిప్ట్‌ను అందించారు. 2011లో ప్రశాంత్ హీరోగా నటించిన ‘‘ పొన్నార్ శంకర్’’ చిత్రానికి చివరిసారిగా కథ అందించారు. సినీ, సాహిత్య రంగాలకు ఆయన చేసిన కృషికి ఎన్నో అవార్డులు ఆయన్ను వరించాయి.

తంజావూరు విశ్వవిద్యాలయం నుంచి రాజరాజన్ పురస్కారం.. 1971లో అన్నామలై విశ్వవిద్యాలయం నుంచి డాక్టరేట్, కౌన్సిల్ ఆఫ్ డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ నుంచి ‘‘తమిళవేల్’’ పురస్కారాన్ని అందించింది. పరాశక్తి స్ఫూర్తితో అదే సందేశంతో పణం, థాంగరత్నం అనే సినిమాలకు కరుణానిధి స్క్రిప్టు రాశారు. తర్వాతీ కాలంలో వితంతు వివాహాలు, ఆదర్శ వివాహాలను ప్రోత్సహిస్తూ, జమిందారీ, అంటరానితనం, మత మూడత్వాన్ని రద్దు చేయాలన్న సందేశాలతో ఆయన స్క్రిప్టు రచనలు సాగాయి.

ఆయన రాసిన కథలతో నిర్మించిన సినిమాలు సామాజిక సందేశాలను బలంగా వినిపించేవి. టీఆర్ సుందరం స్థాపించిన మోడ్రన్ థియేటర్స్ స్టూడియో స్క్రిప్టు రచయితగా కరుణానిధికి పేరు ప్రఖ్యాతులు తెచ్చి పెట్టింది. మోడ్రన్ థియేటర్స్ స్టూడియో అధినేతగా టీఆర్ సుందరం.. కరుణానిధి, ఎంజీఆర్, జయలలితలను వెలుగులోకి తెచ్చారంటే అతి శయోక్తి కాదు

loader