బళ్లారి: నెలల తరబడి ఐదుగురు కామాంధులు ఓ బాలికపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన వెలుగు చూసింది. కర్ణాటకలోని బళ్లారి జిల్లా సిరుగప్పులో ఈ సంఘటన చోటు చేసుకుంది. కామాంధుల అత్యాచారం కారణంగా బాలిక గర్భం దాల్చింది. 

విషయాన్ని ఆలస్యంగా గుర్తించిన బాధితురాలి తండ్రి సిరిగుప్ప పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. దాంతో ఐదుగురు కామాంధులను పోలీసులు అరెస్టు చేశారు. వారికి సహకరించిన మహిళ పరారీలో ఉంది. దేశనూరు గ్రామంలో జరిగిన ఈ సంఘటనలో ఆరుగురిపై పోలీసులు ఫోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. 

బాలికకు తల్లి లేదు. తండ్రి కూలీకీ వెళ్లేవాడు. ఇంట్లో బాలిక ఒక్కతే ఉండేది. దాంతో అదే గ్రామానికి చెందిన నిర్మల అనే మహిళ ఆమెతో స్నేహం చేసింది. ఆటో అంజి, సిరుగుప్ప మల్లి అలియాస్ మల్లేష్, హనుమేష్, రాజు రాఘవేంద్రలకు బాలికను నిర్మల పరిచయం చేసింది. 

మాయమాటలు చెప్పి ఆ ఐదుగురు బాలికను వశపరుచుకున్నారు. ఈ ఏడాది సెప్టెంబర్ 10వ తేదీ నుంచి ఈ నెల 20వ తేదీ వరకు బాలికపై అత్యాచారం చేస్తూ వచ్చారు. దేశనూరు రోడ్డులోని దర్గా వెనక ప్రతి రాత్రి బాలికపై అఘాయిత్యానికి పాల్పడుతూ వచ్చారు. దాంతో బాలిక గర్భం దాల్చింది. 

బాలిక గర్భం దాల్చిన విషయాన్ని ఆరోగ్య కార్యకర్త ఆదోని లక్ష్మి గుర్తించి ఆమె తండ్రికి తెలిపింది. సోమవారం బాలికను మహిళా ఆశ్రయ కేంద్రానికితరలించారు. ఆ తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేశారు. వైద్య చికిత్స కోసం బాలికను బళ్లారిలోని విమ్స్ కు తరలించారు. పరారీలో ఉన్న నిర్మల కోసం పోలీసులు గాలిస్తున్నారు.