న్యూఢిల్లీ: పార్లమెంటు సభ్యురాలు జయా బచ్చన్ మీద బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్ విరుచుకుపడ్డారు. "నేను పరిస్థితిలో నీ కూతురు శ్వేత బచ్చన్ ఉంటే నువ్వు అలాగే మాట్లాడుతావా?" అని కంగనా జయబచ్చన్ ను ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యుడు, నటుడు రవి కిషన్ చేసిన వ్యాఖ్యలకు జయాబచ్చన్ పార్లమెంటు సమావేశాల్లో స్పందించారు. సినిమా పరిశ్రమపై రవి కిషన్ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పు పట్టారు. 

సినీ పరిశ్రమకు రక్షణ అవసరమని, పరిశ్రమ ప్రతిష్టను దెబ్బ తీస్తున్నారని జయా బచ్చన్ అన్నారు. సినీ పరిశ్రమలో మాదక ద్రవ్యాల వ్యసనం ఉందని రవి కిషన్ అన్నారు. దానిపై జయా బచ్చన్ ఆ విధంగా అన్నారు. దీనిపై కంగనా రనౌత్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. 

"నేను ఉన్న పరిస్థితిలో నీ కూతురు శ్వేత ఉంటే, ఆమెను అదే విధంగా వేధిస్తే మీరు అలాగే మాట్లాడుతారా" అని కంగనా అడిగారు. "మీ కుమారుడు అభిషేక్ ను అదే విధంగా నిరంతరాయంగా వేధిస్తూ ఉంటే మీరు అలాగే అంటారా" అని కూడా అడిగారు.

 

రవి కిషన్ పేరు ప్రస్తావించకుండా జయా బచ్చన్ ఆయన చేసిన వ్యాఖ్యలపై ప్రతిస్పందించారు. సినీ పరిశ్రమకు చెందిన ఓ సభ్యుడు లోకసభలో పరిశ్రమకు వ్యతిరేకంగా నిన్న మాట్లాడినందుకు సిగ్గుపడుతున్నానని ఆమె అన్నారు. సినీ పరిశ్రమకు చెందిన వ్యక్తులు అలా మాట్లాడకూడదని ప్రభుత్వం చెబుతుందని తాను అనుకుంటున్నట్లు ఆమె తెలిపారు. 

బాలీవుడ్ లో మాదక ద్రవ్యాల వినియోగం ఉందని, 99 శాతం బాలీవుడ్ కు చెందిన వ్యక్తులు వాటిని వాడుతారని కంగనా గతంలో ఓసారి అన్నారు. సుశాంత్ రాజ్ పుత్ మృతి కేసులో మాదక ద్రవ్యాల కోణంపై ఎన్సీబీ దర్యాప్తు చేస్తున్న నేపథ్యంలో అది హాట్ టాపిక్ గా మారింది.