భారతదేశంలో 15 ఏళ్ల తర్వాత జనాభా లెక్కింపు తిరిగి ప్రారంభంకానుంది. కేంద్ర హోంశాఖ ఈ మేరకు అధికారికంగా నోటిఫికేషన్ జారీ చేసింది.
1948 జనాభా లెక్కల చట్టంలోని సెక్షన్ 3 ప్రకారం జన గణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం అధికారాలను వినియోగించుకుంది. ఈ ప్రక్రియను రెండు విడతల్లో నిర్వహించనున్నారు. మొదటి విడతలో హిమాలయ ప్రాంతాలు రెండవ విడతలో మిగతా రాష్ట్రాల్లో నిర్వహించనున్నారు.
జమ్మూ కాశ్మీర్, లడఖ్, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్ ప్రాంతాల్లో జన గణన ప్రక్రియను 2026 అక్టోబర్ 1 నాటికి పూర్తి చేయనున్నారు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో జనాభా లెక్కింపు 2027 మార్చి 1 నాటికి ముగించనున్నారు. ఈసారి జన గణనతో పాటు కులాల వారీగా సమాచారాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం సేకరించనుంది.
స్వతంత్ర భారత చరిత్రలో ఇలా జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం. ఇందులో సేకరించిన సమాచారం ఆధారంగా మహిళల రిజర్వేషన్లు, వెనుకబడిన వర్గాలకు రిజర్వేషన్ మార్పులు, నియోజకవర్గాల పునర్విభజన (Delimitation) వంటి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు.
ఈసారి జనగణన పూర్తిగా డిజిటల్ మాధ్యమంలో జరగనుంది. మొత్తం 34 లక్షల మంది గణకులు, సూపర్వైజర్లు, 1.34 లక్షల కేంద్ర సిబ్బంది ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రజలు తమ వివరాలను స్వయంగా పోర్టల్స్ లేదా మొబైల్ యాప్‌ల ద్వారా నమోదు చేసుకునే సౌలభ్యం కూడా ప్రభుత్వం కల్పించనుంది.
డేటా సేకరణ, స్టోరేజీ, ట్రాన్స్‌ఫర్ వంటి ప్రతి దశలో ఉన్నత స్థాయి భద్రతా ప్రమాణాలు అమలు చేయనుంది కేంద్ర హోంశాఖ. సమాచారం లీక్ కాకుండా, అనధికారిక వినియోగం జరగకుండా పటిష్టమైన వ్యవస్థలు ఏర్పాటు చేయనున్నారు.
ప్రస్తుతం భారత జనాభా సుమారు 140 కోట్లకు పైగా ఉన్నట్లు అంచనా. చైనాకు తర్వాతి స్థానం దక్కించుకున్న భారత్, ఆర్థిక, రాజకీయ రంగాలలో జన గణన ఆధారంగా కీలక విధానాల అమలుకు సిద్ధమవుతోంది. ఇదిలా ఉంటే.. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే కుల గణన ఆధారంగా రిజర్వేషన్లలో మార్పులు చేపట్టిన విషయం తెలిసిందే.