సారాంశం

New IT Bill: కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025లోని నిబంధనలు వివాదాస్పదంగా మారాయి. వారెంట్ లేకుండానే వ్యక్తుల డిజిటల్, ఆర్థిక సమాచారాన్ని పొందే అధికారాన్ని పన్ను అధికారులకు ఈ బిల్లు కల్పిస్తుంది. ఇంతకీ ఈ చట్టం ఏం చెబుతోందో ఇప్పుడు తెలుసుకుందాం.. 

కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 13న ప్రవేశపెట్టిన కొత్త ఆదాయపు పన్ను బిల్లు 2025లోని నిబంధనలు దుమారం రేపుతున్నాయి. వారెంట్ లేకుండానే వ్యక్తుల డిజిటల్, ఆర్థిక సమాచారాన్ని పొందే అధికారాన్ని అధికారులకు ఈ బిల్లు కల్పిస్తుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 

కేవలం అనుమానం ఆధారంగానే ఈమెయిల్స్, సోషల్ మీడియా ఖాతాలు, బ్యాంక్ వివరాలు, ట్రేడింగ్ లావాదేవీలను చూడొచ్చు. ఇది నిఘా అధికారాల దుర్వినియోగానికి దారితీస్తుందని కొందరు కేంద్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. 

నిర్మలా సీతారామన్ సవరించిన ఆదాయపు పన్ను బిల్లు 2025ను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. ఇది ఆరు దశాబ్దాల పాత పన్ను చట్టానికి సమూల మార్పు అని ఆమె అన్నారు. అయితే, ఇది చట్టంగా మారే ముందు ఒక ప్రత్యేక కమిటీ దీన్ని సమీక్షిస్తుంది. ప్రస్తుతం ఉన్న నిబంధనలకు మించి పన్ను సోదాల పరిధిని విస్తృతం చేస్తూ 'వర్చువల్ డిజిటల్ స్పేస్‌ల'ను చేర్చడం ప్రధాన ఆందోళన కలిగిస్తోంది.

ప్రస్తుతం, పన్ను అధికారులు ల్యాప్‌టాప్‌లు, హార్డ్ డ్రైవ్‌లు, ఈమెయిల్‌లను చూడటానికి అడగవచ్చు. కానీ ప్రస్తుత పన్ను చట్టంలో డిజిటల్ రికార్డుల గురించి స్పష్టంగా చెప్పకపోవడంతో, ఇలాంటి డిమాండ్లను తరచుగా కోర్టులో సవాలు చేస్తున్నారు. అయితే, కొత్త బిల్లులో మాత్రం పన్ను అధికారులు డిజిటల్ ఆస్తులను చూడటానికి అడగవచ్చని స్పష్టం చేశారు. ఒకవేళ పన్ను చెల్లింపుదారు దీనికి నిరాకరిస్తే, వారు పాస్‌వర్డ్‌లను క్రాక్ చేయడం, భద్రతా సెట్టింగ్‌లను మార్చవచ్చు, ఫైల్‌లను అన్‌లాక్ చేసే హక్కులను కలిగి ఉంటారు. 

కొత్త ఆదాయపు పన్ను బిల్లులోని క్లాజ్ 247 ప్రకారం, భారతదేశంలోని నియమిత ఆదాయపు పన్ను అధికారులు ఏప్రిల్ 1, 2026 నుంచి కొన్ని సందర్భాల్లో మీ ఈమెయిల్‌లు, సోషల్ మీడియా, బ్యాంక్ వివరాలు, పెట్టుబడి ఖాతాలను చూడవచ్చు. పన్ను ఎగవేత లేదా పన్ను చెల్లించని ఆస్తులను దాచినట్లు అనుమానం ఉంటే ఈ చర్యలు తీసుకుంటారు.

‘‘క్లాజ్ (i) ద్వారా సంక్రమించిన అధికారాలను వినియోగించడానికి ఏదైనా లాకర్, సేఫ్, బీరువా వంటివి వాటిని పగలగొట్టే హక్కు కూడా ఉంటుంది. ఏదైనా భవనం, స్థలం మొదలైన వాటిలోకి ప్రవేశించి సోదా చేయవచ్చు. అక్కడ తాళాలు అందుబాటులో లేకపోతే లేదా ఏదైనా కంప్యూటర్ సిస్టమ్ లేదా వర్చువల్ డిజిటల్ స్పేస్‌కు యాక్సెస్ కోడ్ అందుబాటులో లేకపోతే, యాక్సెస్ కోడ్‌ను క్రాక్ చేసి పరిశీలించవచ్చు'. సింపుల్ గా చెప్పాలంటే.. పన్ను చెల్లింపుదారులకు చెందిన “వర్చువల్ డిజిటల్ స్పేస్‌”లో స్టోర్ చేసిన డేటాపై ప్రభుత్వానికి పూర్తి అధికారం ఉంటుంది. 

గోప్యతకు భంగం: కొత్త ఐటీ బిల్లుపై విమర్శలు

కొత్త ఐటీ బిల్లుకు తీవ్ర వ్యతిరేకత వస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, పౌర హక్కుల సంఘాలతో సహా విమర్శకులు ఇలాంటి అధికారాలు వ్యక్తిగత గోప్యతకు భంగం కలిగిస్తాయని భయపడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ, దాని సోషల్ మీడియా విభాగం అధిపతి సుప్రియా శ్రీనతే ఈ బిల్లును ప్రభుత్వ దురాక్రమణకు ఒక సాధనంగా అభివర్ణించారు. ఇది కేంద్ర వ్యతిరేక గళాలను అణచివేయడానికి, ప్రతిపక్ష స్వరాలను నియంత్రించడానికి ఉపయోగపడుతుందన్నారు. పన్ను అమలు పేరుతో అధికారాన్ని దుర్వినియోగం చేసే అవకాశం ఉందని ఆరోపిస్తున్నారు. 

ఆదాయం లేదా ఆస్తులను దాచిపెట్టారని అనుమానం వస్తే ఎలాంటి వాటినైనా పరిశీలించే హక్కు అధికారులకు ఉంటుందని ఈ బిల్లులో ఉంది. ఈ అధికారాలను దుర్వినియోగం జరగకుండా నిరోధించడానికి తగిన రక్షణలతో సమతుల్యం చేయాల్సిన అవసరం ఉందని  న్యాయ నిపుణులు అంటున్నారు. 

బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడు బైజయంత పాండా అధ్యక్షతన 31 మంది సభ్యుల సెలెక్ట్ కమిటీ ఈ బిల్లు గోప్యతపై చూపే ప్రభావం, ప్రస్తుత చట్టపరమైన నిబంధనలతో దాని అనుగుణ్యతను సమీక్షిస్తోంది. కమిటీ పరిశీలనలు, సిఫార్సులు ఈ ఆందోళనలను సమగ్రంగా పరిష్కరిస్తాయని భావిస్తున్నారు. అంతేకాకుండా, ఈ బిల్లు ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 132లో ఇంతకు ముందు పేర్కొన్న అధికారాల విస్తరణను క్లాజ్ 247లో నిర్దేశిస్తుంది. మాజీ ఇన్ఫోసిస్ CFO మోహన్‌దాస్ పాయ్ ఈ చర్యను వ్యక్తిగత హక్కులపై దాడి అని అభివర్ణించారు.