Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ కు కుంకీ ఏనుగులు.. పవన్ కళ్యాణ్ ఆసక్తికర కామెంట్స్
Pawan Kalyan: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో ఏనుగుల సమస్యల నివారణకు కర్ణాటక ప్రభుత్వం 6 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అప్పగించింది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కర్నాటక నుంచి కుంకీ ఎనుగులను స్వీకరించారు.
- FB
- TW
- Linkdin
Follow Us
)
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్‌లో పెరుగుతున్న అడవి ఏనుగుల దాడులు, పంట ధ్వంసం, ప్రాణ నష్టం వంటి సమస్యల నివారణకు చర్యల్లో భాగంగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కృషి ఫలించింది. కర్ణాటక ప్రభుత్వం ఏపీకి ఆరు కుంకీ ఎనుగులను అందించింది. బెంగళూరులోని విధాన సౌధలో బుధవారం నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఆ రాష్ట్రం నుంచి 6 కుంకీ ఏనుగులను ఆంధ్రప్రదేశ్‌కు అధికారికంగా అప్పగించారు.
కర్ణాటక సీఎం సిద్ధరామయ్య చేతుల మీదుగా కుంకీ ఏనుగు ఒప్పంద పత్రాలు అందుకున్న పవన్
ఈ కార్యక్రమంలో కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, అటవీ శాఖ మంత్రి ఈశ్వర్ ఖండ్రే, ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.
ఈ కుంకీ ఏనుగులలో నాలుగు కొడుగు జిల్లాలోని దుబారే శిబిరం నుంచి, మరో రెండు అభిమన్యు, కృష్ణలను శివమొగ్గలోని సక్రేబైలులోని శిబిరం నుంచి తీసుకువచ్చారు.
ఏపీలో ఏనుగుల గుంపు దాడుల నుంచి ప్రజలకు ఉపశమనం
ఈ బదిలీ 2024 సెప్టెంబరులో కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ రాష్ట్రాల మధ్య అడవి ఏనుగుల నిర్వహణకు సంబంధించిన ఉత్తమ పద్ధతుల మార్పిడి కోసం కుదిరిన అవగాహన ఒప్పందానికి (MoU) అనుసంధానంగా జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య, పార్వతీపురం మణ్యం జిల్లాల్లో గత ఏడాది కాలంలో ఏనుగుల దాడులతో దాదాపు ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. పెద్దఎత్తున పంట నష్టం జరిగింది.
పలమనేరు శిబిరంలోకి కుంకీ ఏనుగులు
ఈ నేపథ్యంలో, ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ శిబిరాలను సిద్ధం చేసింది. ప్రత్యేకంగా చిత్తూరు జిల్లా పలమనేరులో ఏర్పాటైన ఏనుగుల శిబిరంలో ఈ కుంకీ ఏనుగులను ఉంచనున్నారు. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ అటవీ సిబ్బందిని గత ఆరు నెలలుగా శిక్షణ కూడా ఇచ్చారు.
ఏపీకి సక్రేబైలు శిబిర సిబ్బంది
147 కిలోమీటర్ల ప్రయాణాన్ని కర్ణాటక ప్రభుత్వం సమర్థవంతంగా నిర్వహించింది. ఈ ఏనుగుల అన్వయానికి సహాయంగా సక్రేబైలు శిబిర సిబ్బంది ఒక నెల పాటు ఆంధ్రప్రదేశ్‌లో ఉంటారు. ఈ కుంకీ ఏనుగులు అడవి ఏనుగులను నివారించడంలో కీలకపాత్ర పోషించనున్నట్లు అధికారులు తెలిపారు.
పవన్ కళ్యాణ్ చొరవతో ఏపీకి కుంకీ ఏనుగులు
కొన్ని నెలల క్రితం పవన్ కళ్యాణ్ బెంగళూరును సందర్శించి, కర్ణాటక ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రులతో సమావేశమై రాష్ట్రానికి ఎదురవుతున్న ఏనుగుల బెడదను వివరించారు. స్పందనగా, కర్ణాటక ప్రభుత్వం తమ రాష్ట్ర అటవీ శాఖ ద్వారా ఆరు కుంకీ ఏనుగులను అందించేందుకు అంగీకరించింది.
పవన్ ను సన్మానించిన కర్నాటక సర్కారు
బుధవారం అధికారికంగా వాటిని అప్పగించిన కార్యక్రమం సందర్భంగా నేతల మధ్య సౌహార్దపూర్వక సంబంధాలు ప్రతిఫలించాయి. కుంకీ ఏనుగుల బదిలీ అనంతరం, వీటి శిక్షణ, పరిరక్షణ, మరియు వినియోగం తదితర అంశాలపై రెండు రాష్ట్రాల అధికారులు పరస్పరం సమన్వయం చేసుకునే దిశగా ముందడుగు వేశారు.
ఈ క్రమంలోనే కర్నాటక సర్కారు పవన్ ను సన్మానించింది.
కుంకీ ఏనుగుల సంరక్షణను తానే స్వయంగా చూసుకుంటానన్న పవన్
కుంకీ ఏనుగుల అధికారిక అప్పగింత కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. "ఈ కుంకీ ఏనుగులను అత్యంత జాగ్రత్తగా సంరక్షిస్తామని మాట ఇస్తున్నాను. వాటి సంరక్షణను నేనే స్వయంగా పర్యవేక్షిస్తాను" అని అన్నారు.
ఏపీలో ఎనుగుల గుంపు దాడులను పవన్ కళ్యాన్ గుర్తు చేస్తూ.. “ప్రాణ నష్టం, ఆస్తుల ధ్వంసం బాధాకరం. ఈ రోజు మనకు అందిన కుంకీ ఏనుగుల వల్ల భవిష్యత్తులో ఇటువంటి దురదృష్టకర ఘటనలు జరగకుండా కాపాడగలుగుతాం” అన్నారు.
కర్నాటక సర్కారుపై పవన్ కళ్యాణ్ ప్రశంసలు
అటవీ పరిరక్షణలో పరస్పర సహకారం అవసరమని పేర్కొన్న పవన్ కళ్యాన్.. అటవీ సంపద పరిరక్షణలో ఆంధ్రప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాలు కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో వేర్వేరు రాజకీయ కూటములు అధికారంలో ఉన్నా, పర్యావరణ పరిరక్షణ అంశంలో కర్ణాటక ప్రభుత్వం ముందడుగు వేసిన విధానాన్ని అభినందించారు.
ఇటీవల ఏపీలో ఏనుగుల గుంపు దాడులతో పలువురు ప్రాణాలు కోల్పోయారు
కుంకీ ఏనుగులకు సంబంధించిన ధృవీకరణ పత్రాలు, సంరక్షణ సమాచార డాక్యుమెంట్లు కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య చేతుల మీదుగా పవన్ కళ్యాణ్ అందుకున్నారు. ఏపీలో ఏనుగుల గుంపుల కారణంగా పంట పొలాలు ధ్వంసం, కొన్ని సందర్భాల్లో మనుషులు ప్రాణాలు కోల్పోవడం జరుగుతోంది. ఈ సమస్యల నివారణకు కుంకీ ఏనుగులు అవసరం.