లక్నో: ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలో  మరో దారుణం చోటు చేసుకొంది. 18 ఏళ్ల యువతిపై అత్యాచారం చేసి ఆమెపై నిప్పు పెట్టారు దుండగులు. బాధితురాలి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు  కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. 

ఉత్తర్‌ప్రదేశ్ రాష్ట్రంలోని  ఫతేఫూర్‌ జిల్లాలో  ఈ ఘటన శనివారం నాడు చోటు చేసుకొంది.బాధితురాలిపై కిరోసిన్ పోసి నిప్పంటిచిన నిందితుడు పారిపోతుంటే పోలీసులు అరెస్ట్ చేశారు. 

బాధితురాలు కాన్పూర్‌కు తరలించారు. ఆమె చావు బతుకుల మధ్య కొట్టుమిట్టాడుతోంది. తొలుత   బాధితురాలు ఆత్మహత్యాయత్యానికి ప్రయత్నించినట్టుగా పోలీసులు భావించారు. కానీ, మేజిస్ట్రేట్ ముందు బాధితురాలు మరణ వాంగ్మూలం ఇచ్చింది.

అత్యాచారం చేసిన తర్వాత తనపై కిరోసిన్‌ పోసి దగ్ధం చేసినట్టుగా బాధితురాలు మేజిస్ట్రేట్‌ ముందు వాంగ్మూలం ఇచ్చింది. బాధితురాలిని కిరోసిన్ పోసిన నిందితుడు తమ ఇంటి పక్కన ఉండే వ్యక్తేనని ఆమె చెప్పింది. అతను తమ దూరపు బంధువు అంటూ కూడ ఆమె చెప్పింది.

రెండేళ్లుగా తన సోదరిని నిందితుడు వేధింపులకు గురి చేస్తున్నాడని బాధితురాలి సోదరుడు చెప్పాడు. శనివారం మధ్యాహ్నం తనతో పాటు తన తల్లి ఇంట్లో లేని సమయంలో  నిందితుడు తన సోదరిని ఇంట్లోకి లాక్కెళ్లి అత్యాచారం చేసినట్టుగా చెప్పారు. అంతేకాదు ఆమెపై కిరోసిన్ పోశాడని తెలిపారు.

నిందితుడిని తాము ప్రశ్నిస్తున్నట్టుగా సర్కిల్ ఆఫీసర్ కపిల్ డియో మిశ్రా చెప్పారు. బాధితురాలి కుటుంబం నుండి కూడ పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నామని ఆయన చెప్పారు.

వీరిద్దరి మధ్య కొంత కాలంగా సంబంధం ఉన్న విషయాన్ని కనుగొన్నట్టుగా జిల్లా మేజిస్ట్రేట్ సంజీవ్ సింగ్ చెప్పారు.  అయితే శనివారం నాడు ఉదయం గ్రామ పెద్దలు నిర్వహించి ఇద్దరూ దూరంగా ఉండాలని తీర్పు చెప్పారు. అయితే ఈ విషయంలో మనోవేదనకు గురైన బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసినట్టుగా భావిస్తున్నామని ఆయన తెలిపారు.