బెంగళూరు: బెంగళూరు డ్రగ్స్ కేసు విచారణను సీసీబీ అధికారులు ముమ్మరం చేశారు. డ్రగ్స్ వాడకం, రవాణా ఆరోపణలు ఎదుర్కుంటున్న సినీ తారలు రాగిణి ద్వివేదిని, సంజన గల్రానీని సీసీబీ పోలీసులు శుక్రవారం సుదీర్ఘంగా విచారించారు. పార్టీలకు ఎవరెవరు వచ్చేవారు, ఎప్పటి నుంచి పార్టీలు జరుపుతున్నారనే వివరాలను బెంగళూరు జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ సేకరించారు.

కొందరు రాజకీయ నాయకులు కుమారులు మాదకద్రవ్యాలు తీసుకునేవారని సంజన, రాగిణి వెల్లడించినట్లు తెలుస్తోంది. వారికి సీసీబీ అధికారులు నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది. మంగళూరుకు చెందిన ప్రతీక్ శెట్టి డ్రగ్స్ పెడ్లర్ గా పేరుంది. అతన్ని సీసీబీ అధికారులు శుక్రవారం అరెస్టు చేసి చామరాజుపేటలోని తమ కార్యాలయంలో విచారించారు. 

Also Read: రక్తపరీక్షలపై సర్దార్ గబ్బర్ సిగ్ నటి సంజన గొడవ: మరొకరి అరెస్టు

పరారీలో ఉన్న షేక్ ఫైజల్, ఆదిత్య ఆళ్వల కోసం గాలిస్తున్నారు. డ్రగ్స్ కేసులో నిందితుడైన నిశాన్ తో ప్రతీక్ శెట్టికి మంచి సంబంధాలున్నాయి. ఫైజల్ ఇంటిపై దాడి చేసిన అతని తమ్ముడిని విచారించిన సమయంలో ఆ విషయం తెలిసింది. దీంతో ప్రతీక్ శెట్టిని అరెస్టు చేసి విచారించారు. 

తనకు బెంగళూరులో పది ఫ్లాట్స్ ఉన్నట్లు సంజన శుక్రవారంనాటి విచారణలో అంగీకరించారు. ఫ్లాట్స్ కు ఎవరెవరు వచ్చి వెళ్తుండేవారనే విషయంపై సీసీబీ అధికారులు దృష్టి పెట్టారు. 

Also Read: డ్రగ్స్ కేసు: సర్దార్ గబ్బర్ సింగ్ నటి సంజన గల్రానీ వివాహం గుట్టు రట్టు

బెయిల్ కోసం రాగిణి ద్వివేది సీసీహెచ్ కోర్టులో దాఖలు చేసుకున్న పిటిషన్ మీద విచారణ ఈ నెల 14వ తేదీకి వాయిదా పడింది. రాగిణఇ పోలీసు కస్టడీ గడువు శుక్రవారంతో ముగిసింది. దాంతో ఆమెను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా న్యాయమూర్తి ముందు హాజరు పరిచారు. సంజనను శుక్రవారం కోర్టు ముందు హాజరు పరిచి తమ కస్టడీలోకి తీసుకున్నారు.