Asianet News TeluguAsianet News Telugu

శృంగారానికి మైనర్ బాలిక సమ్మతించినా... అది అత్యాచారమే: ఢిల్లీ హైకోర్టు

మైనర్ బాలిక ఆమోదంతోనే లైంగిక ప్రక్రియ కొనసాగించినప్పటికీ, చట్ట ప్రకారం అది అత్యాచారమేనని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పదహారేండ్ల బాలిక రేప్ కేసు విషయంలో నిందితుడి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంలో ఢిల్లీ హైకోర్టు ఈ సంచలన వ్యాఖ్యలు చేసింది.

Delhi High Court says Consent of a minor is not consent in the eyes of law
Author
First Published Dec 6, 2022, 1:19 PM IST

శృంగారం విషయంలో మైనర్ బాలిక సమ్మతిపై ఢిల్లీ హైకోర్టు సంచలన వ్యాఖ్యలు చేసింది. మైనారిటీ తీరని బాలిక పూర్తి సమ్మతంతో శృంగారానికి అంగీకరించినా.. అది చట్ట ప్రకారం నేరమేననీ, అది అత్యాచారం కిందకే వస్తుందని ఢిల్లీ హైకోర్టు స్పష్టంచేసింది. మైనర్ బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. మైనర్ సమ్మతి చట్టం దృష్టిలో సమ్మతి కాదనీ..  మైనర్‌కు కీలక నిర్ణయాలు తీసుకునే మానసిక పరిపక్యత ఉండదని పేర్కొంది.అందుకే.. మైనర్ బాలిక తన ఇష్టప్రకారం.. శృంగారానికి అనుమతించినప్పటికీ .. అది అత్యాచారం కిందికే వస్తుందని జస్టిస్ జస్మీస్ సింగ్ వెల్లడించారు.16 ఏళ్ల బాలికపై అత్యాచారం కేసులో నిందితుడికి బెయిల్ నిరాకరించింది.

అదే సమయంలో ఆ బాలిక ఆధార్ కార్డులో పుట్టిన తేదీని కూడా మార్చినట్లు ఢిల్లీ హైకోర్టు గమనించింది. ఆధార్ కార్డ్‌లో అమ్మాయి పుట్టిన తేదీని మార్చడంలో వ్యక్తి ప్రవర్తన “తీవ్రమైన నేరం” అని హైకోర్టు పేర్కొంది. దరఖాస్తుదారుడు (పురుషుడు) ఆధార్ కార్డులో పుట్టిన తేదీని మార్చడం ద్వారా ప్రయోజనం పొందాలని కోరుకున్నట్లు తెలుస్తోందనీ, తద్వారా దరఖాస్తుదారు ఫిర్యాదుదారుతో శారీరక సంబంధం ఏర్పరుచుకున్నప్పుడు ఆమె మైనర్ కాదని నిరూపించాలని భావించడాని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఇంతకీ ఏం జరిగిందంటే..? 

ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన 16 సంవత్సరాల అమ్మాయి 2019లో ఇంటి నుంచి  వెళ్లిపోయి 23 యేళ్ల యువకుడితో కలిసి ఉంది. సుమారు ఒకటిన్నర నెల పాటు అతనితోనే సహవాసం చేసింది. అయితే.. ఆ యువకుడికి అప్పటికే పెళ్లైంది. కానీ, ఆ విషయాన్ని ఆ బాలికకు తెలియకుండా జాగ్రత పడ్డాడు. ఈ నేపథ్యంలో తన కుమార్తె కనిపించడం లేదంటూ.. బాలిక తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు 2019లో కేసు నమోదు చేసుకున్నారు.

పోలీసులు అనంతరం ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లా బాలికతో పాటు యువకుడుని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. బాలిక మైనర్ కావడంతో ఆ యువకుడిపై కిడ్నాప్, అత్యాచారం ఆరోపణల కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆ యువకుడు జైల్లోనే ఉంటున్నాడు. ఈ మధ్య కాలంలో నిందితుడు బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసుకున్నాడు. దీన్ని విచారణకు స్వీకరించిన ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆ వ్యక్తి తన అంగీకారంతో శారీరక సంబంధాలు ఏర్పరచుకున్నాడని, అతనితో కలిసి ఉండాలనుకుంటున్నానని ఆమె హైకోర్టుకు చెప్పింది.  

అయితే.. మైనర్ బాలిక సమ్మతి ఆమోదయోగ్యం కాదంటూ జడ్జి వ్యాఖ్యానించారు. సంఘటన జరిగిన తేదీ నాటికి అమ్మాయికి కేవలం 16 సంవత్సరాలు మాత్రమేనని భావిస్తున్నని న్యాయమూర్తి తెలిపారు. దరఖాస్తుదారుడి వయస్సు 23 సంవత్సరాలు, అప్పటికే వివాహితుడు.పైగా బాలిక ఆధార్ కార్డులో పుట్టిన తేదీ మార్చి ఆ బాలిక మైనర్ కాదని చూపించేందుకు నిందితుడు ప్రయత్నించాడని న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. కావాలని మార్పులు చేయడం తీవ్రమైన నేరమని, అందువల్ల నిందితుడికి బెయిల్ ఇవ్వలేమని స్పష్టం చేస్తూ పిటిషన్‌ను కొట్టివేశారు.

Follow Us:
Download App:
  • android
  • ios