40 శాతం ఎంపీలు కళంకితులే.. ఒక్కో ఎంపీ సగటు ఆస్తి రూ. 38 కోట్లు.. ఆ జాబితాలో తెలుగు రాష్ట్రాల ఎంపీలు టాప్..
ADR Report: అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) సంస్థ తన తాజా నివేదికను వెల్లడించింది. కొన్ని ఆసక్తికరమైన, మరికొన్ని వివాదాస్పదమైన అంశాలు తన నివేదికలో వెల్లడించింది. రాజకీయ పార్టీలకు ఎక్కడెక్కడి నుంచి, ఏఏ రూాపాల్లో నిధులు అందుతున్నాయనే విషయంపై కూపీ లాగింది. ప్రాంతీయ పార్టీలపై కూడా ప్రత్యేక నిఘా పెట్టింది ఈ సంస్థ.

ADR Report: పార్లమెంట్ ఉభయ సభల్లోని దాదాపు 40 శాతం మంది సిట్టింగ్ ఎంపీలపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయని, వీటిలో 25 శాతం కేసులు తీవ్రమైన నేరాలకు సంబంధించినవే. ఇందులో హత్య, హత్యాయత్నం, కిడ్నాప్, మహిళలపై నేరాలు వంటి కేసులు ఉన్నాయని ఎన్నికల హక్కుల సంఘం ADR (అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్) నివేదికలో వెల్లడించింది.
ఇక గత ఎన్నికల్లో లేదా ఉప ఎన్నికల్లో దాఖాలైన 776 స్థానాల నుంచి 763 మంది సిట్టింగ్ ఎంపీలు సమర్పించిన స్వీయ-ప్రకటిత అఫిడవిట్‌ల విశ్లేషణ ఆధారంగా ADR , నేషనల్ ఎలక్షన్ వాచ్ ఈ నివేదికను సిద్ధం చేశాయి. జమ్మూ కాశ్మీర్‌లో నాలుగు రాజ్యసభ స్థానాలు ఉన్నాయి. కానీ. అక్కడ అసెంబ్లీ లేకపోవడంతో ఈ స్థానాలు ఖాళీగా ఉన్నాయి. ఒక లోక్‌సభ ఎంపీ, ముగ్గురు రాజ్యసభ ఎంపీల పత్రాలు అందుబాటులో లేనందున వారి అఫిడవిట్‌లను విశ్లేషించలేదు.
763 మంది ఎంపీల్లో 306 శాతం మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిపింది. అలాగే ఇరుసభల్లోని ఎంపీల సగటు ఆదాయం రూ.38.33 కోట్లుగా ఉంది. ఇందులో 53 మంది అంటే 7 శాతం మంది బిలియనీర్లు. ADR నివేదిక ప్రకారం.. కేరళ అత్యంత చెత్త రికార్డును కలిగి ఉంది. అక్కడి ఎంపీలలో 79 శాతం మందిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. ఇందులో లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు కూడా ఉన్నారు. కేరళలోని 29 మంది ఎంపీల్లో 23 మంది కళంకితులేనని పేర్కొంది.
బీహార్‌లో 73 శాతం కళంకితులే..
ADR నివేదిక ప్రకారం.. కేరళ తర్వాత, బీహార్‌లో కళంకిత ఎంపీలు అత్యధికంగా ఉన్నారు. బీహార్‌కు చెందిన 56 మంది ఎంపీల్లో 41 మంది (73 శాతం)పై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్రలోని 65 మంది ఎంపీల్లో 37 మంది (57 శాతం) కళంకితులే. తెలంగాణలో 24 (54 శాతం) ఎంపీల్లో 13 మంది, ఢిల్లీలోని 10 మంది (50 శాతం) ఎంపీల్లో ఐదుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఇక ఉత్తరప్రదేశ్ విషయానికి వస్తే.. 108 మంది ఎంపీలలో 37 మందిపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. బీహార్‌కు చెందిన 28 మంది, తెలంగాణకు చెందిన 9 మంది, కేరళకు చెందిన పది మంది, మహారాష్ట్రకు చెందిన 22 మంది ఎంపీలపై తీవ్రమైన క్రిమినల్ కేసులు నమోదయ్యాయని నివేదిక వెల్లడించింది.
ఆర్జేడీలో అత్యంత కళంకిత ఎంపీ
పార్టీ పరంగా చూస్తే.. బీహార్ అధికార పార్టీ RJD అత్యంత కళంకిత ఎంపీలను కలిగి ఉంది. ఆరుగురిలో ఐదుగురు ఆర్జేడీ ఎంపీలు కళంకితులే. రెండవ సంఖ్య లెఫ్ట్ పార్టీకి చెందినది, దాని ఎనిమిది మంది ఎంపీలలో ఆరుగురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి. 385 మంది బీజేపీ ఎంపీల్లో 139 మంది కళంకితులే. 81 మంది కాంగ్రెస్ ఎంపీల్లో 43 మంది, 36 టీఎంసీల ఎంపీల్లో 14 మంది, ఆప్ ఎంపీల్లో 11 మందిలో ముగ్గురు, వైఎస్సార్ కాంగ్రెస్ ఎంపీల్లో 31 మందిలో 13 మంది, ఎన్సీపీ ఎంపీల్లో ముగ్గురిపై క్రిమినల్ కేసులు నమోదయ్యాయి.
ఎంపీలందరూ కోటీశ్వరులే..
పార్లమెంటు ఉభయ సభల్లోని ప్రతి సభ్యుడు అంటే లోక్‌సభ, రాజ్యసభలో సగటున రూ.38.33 కోట్ల ఆస్తులు ఉన్నాయి. ఈ విధంగా మన దేశంలోని ప్రతి ఎంపీ కోటీశ్వరులే. 53 మంది ఎంపీలు బిలియనీర్లు, ఇది మొత్తం ఎంపీలలో 7 శాతం. తెలంగాణ ఎంపీలు అత్యంత ధనవంతులు.
నివేదిక ప్రకారం 24 మంది తెలంగాణ ఎంపీల సగటు ఆస్తులు రూ.262.26 కోట్లు. దీని తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎంపీల సగటు సంపద రూ.150.76 కోట్లు కాగా, పంజాబ్ ఎంపీల సగటు సంపద రూ.88.94 కోట్లు. అందరి కంటే తక్కువగా లక్షద్వీప్ ఎంపీ రూ.9.38 లక్షలతో చివరి స్థానంలో ఉన్నారు. ఆ తర్వాత త్రిపుర ముగ్గురు ఎంపీల సగటు ఆస్తి రూ.1.09 కోట్లు, మణిపూర్ నుంచి ముగ్గురి సగటు ఆస్తి రూ.1.12 కోట్లుగా ఉంది.
బీజేపీ ఎంపీల సగటు ఆస్తి రూ.18.31 కోట్లు, కాంగ్రెస్ ఎంపీల సగటు ఆస్తి రూ.39.12 కోట్లు, టీఎంసీ ఎంపీల సగటు ఆస్తి రూ.8.72 కోట్లు, వైసీపీ ఎంపీల సగటు ఆస్తి రూ.153.76 కోట్లు, టీఆర్ఎస్ ఎంపీల సగటు ఆస్తి రూ.383.51 కోట్లు, ఎన్సీపీ ఎంపీల సగటు ఆస్తి రూ.30.11 కోట్లు, ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీల సగటు ఆస్తి రూ.119.84 కోట్లుగా ఉంది.
ఈ 53 మంది బిలియనీర్ ఎంపీలలో తెలంగాణలో 7 గురు, ఆంధ్రప్రదేశ్ లో 9 మంది, ఢిల్లీలో ఇద్దరు, పంజాబ్ లో నలుగురు, ఉత్తరాఖండ్ లో ఒకరు, మహారాష్ట్రలో ఆరుగురు, కర్ణాటక లో ముగ్గురు బిలియనీర్ ఉన్నారు. వీరంతా రూ.100 కోట్లకు పైగా ఆస్తిని కలిగి ఉన్నారు.