Modi threat: జీ7 సదస్సు ముందు ఖలిస్థానీ తీవ్రవాదంపై కెనెడియన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మోచా బెజిర్గాన్ ఆందోళన వ్యక్తం చేశారు. భారత ప్రధాని మోడీ దాడి హెచ్చరికలపై ఖాలిస్తానీ వాదుల తీరును ఎత్తి చూపారు.

Modi threat: కెనడాలో ఖలిస్థానీ తీవ్రవాదం పెరుగుతున్నదనీ, ఇది భారత అధికారులపై తీవ్ర హింసా ముప్పును కలిగిస్తోందని ప్రముఖ కెనెడియన్ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ మోచా బెజిర్గాన్ హెచ్చరించారు. ఈ ప్రకటన జీ7 సదస్సుకు ముందుగా రావడం గమనార్హం. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ఈ సమావేశానికి ఆహ్వానం అందిన నేపథ్యంలో ఈ ఘటనలు జరగడం కలకలం రేపుతున్నాయి. 

కెనడాలోని వాంకూవర్‌లో ఇటీవల నిర్వహించిన ఖలిస్థాన్ మద్దతుదారుల ర్యాలీలో తనపై దాడి జరిగిందని బెజిర్గాన్ తెలిపారు. ఖలిస్థాన్ మద్దతుదారుల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో, ర్యాలీని కవర్ చేస్తున్న ఆయన దాడికి గురైనట్టు వెల్లడించారు. ఈ దాడిని ఖలిస్థానీ వాదాన్ని ప్రశ్నించినందుకు చేసిన ప్రతీకార చర్యగా అభివర్ణించారు.

“ఇది రెండు గంటల క్రితమే జరిగింది. ఇంకా నా ఒళ్లు వణికిపోతోంది” అని ఆయన తెలిపినట్టు ఏఎన్ఐ నివేదికలు పేర్కొన్నాయి. “వారు గూండాల మాదిరి ప్రవర్తించారు. నన్ను చుట్టుముట్టి, నా ఫోన్‌ను లాక్కుని, రికార్డింగ్ ఆపేలా చూశారని” అన్నారు.

ఈ సంఘటన ఆయన స్వతంత్ర పాత్రికేయ ధోరణిపై జరిగిన ప్రత్యక్ష దాడిగా అభివర్ణించారు. “ఇదే మొదటిసారి కాదని” ఆయన పేర్కొన్నారు. మార్చి 2024లో ఎడ్మంటన్‌లో భారత హై కమిషనర్‌కి వ్యతిరేకంగా ఖలిస్థాన్ మద్దతుదారులు కత్తులు, ఖడ్గాలు, బల్లెంలతో వచ్చినట్టు గుర్తుచేశారు.

 

View post on Instagram
 

 

ఖలిస్థాన్ ఉద్యమం ప్రధానంగా సిక్ ఫర్ జస్టిస్ (SFJ) ద్వారా నడుస్తోందనీ, దీనికి వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ (WSO) వంటి రాజకీయ పరిరక్షణా సంస్థలు అండగా ఉన్నాయని తెలిపారు. “కెనడాలోని గురుద్వారాల నుంచి జనసమ్మేళనం కోసం ప్రజలను రప్పిస్తారు, కానీ దీనికి వెనుక రాజకీయ అండ కలిగి ఉంటుంది” అని ఆయన వివరించారు.

కెనడా రాజకీయ నాయకులు ఈ తీవ్రవాద గుంపుల చర్యలను ఖండించడంలో నిర్లక్ష్యంగా ఉన్నారని విమర్శించారు. “పియర్ పోలివ్రే, ఎన్డీపీ, కొన్ని లిబరల్ ఎంపీలు సరికొత్తగా BCలో జరిగిన నగర్ కీర్తన్‌కు హాజరయ్యారు. అక్కడ ఖలిస్థాన్ ప్రభావం స్పష్టంగా కనిపించింది” అని పేర్కొన్నారు.

వారు మోడీపై హింసను బహిరంగంగా ప్రోత్సహిస్తున్నారని బెజిర్గాన్ ఆరోపించారు. “ఇందిరా గాంధీని హత్య చేసిన వాళ్లను వీళ్ళు వీరులుగా పేర్కొంటున్నారని వారి వ్యాఖ్యలను గుర్తుచేశారు. ‘మేమే వాళ్ళ వారసులు’ అంటున్నారు. ఇప్పుడు మోడీ రాజకీయాలను గల్లంతు చేస్తామనీ, మోడీపై దాడి చేస్తామని బహిరంగంగానే చెబుతున్నారు” అని బెజిర్గాన్ అన్నారు.

ఇలాంటి ఘటనలపై మీడియా, రాజకీయ వర్గాలు స్పందించకపోవడాన్ని బెజిర్గాన్ తీవ్రమైన సమస్యగా పేర్కొన్నారు. “ఇలాంటివారిని రాజకీయ నాయకులు తగినదృష్టితో చూడకపోవడం దురదృష్టకరం. వారు చరిత్రలో హింసకు తోడ్పడిన వారే” అని అన్నారు.

ఇదిలాఉండగా, కెనడా కొత్త ప్రధాని మార్క్ కార్నీ ప్రధానమంత్రి మోడీకి జీ7 సదస్సుకు ఆహ్వానం పంపినందుకు వరల్డ్ సిక్ ఆర్గనైజేషన్ తీవ్రంగా విమర్శించింది. ఈ ఆహ్వానం సిక్కు సమాజాన్ని అవమానించే చర్యగా అభివర్ణించారు. కాగా, భారత ప్రధాని మోడీ జూన్ 17న ఆల్బర్టాలో జరిగే జీ7 సమావేశానికి హాజరు కానున్నారు . భారత్-కెనడా సంబంధాల్లోని ఉద్రిక్తతలు కొనసాగుతున్నప్పటికీ, ఈ పిలుపు భవిష్యత్ ద్వైపాక్షిక సంబంధాలపై ప్రభావం చూపే అవకాశం ఉంది.