Tiger chases dog falls into pit both: ఇడుక్కిలో పులి, కుక్క ఒకే గుంతలో పడిపోయిన అరుదైన ఘటన వైరల్ గా మారింది. అసలు ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం.

tiger dog incident: కేరళ-తమిళనాడు సరిహద్దులోని ఇడుక్కి జిల్లాలో అరుదైన సంఘటన చోటు చేసుకుంది. మయిలాడుమ్పారై వద్ద ఓ ప్రైవేట్ రబ్బరు తోటలో ఆదివారం తెల్లవారుఝామున ఒక పులి, ఒక కుక్క తొమ్మిది అడుగుల లోతైన గుంతలో పడిపోయాయి. పులి కుక్కను తరుముతూ రావడంతో గమనించకుండా గుంతలోకి దూకినట్లుగా అటవీశాఖ ప్రాథమికంగా అంచనా వేసింది. 

ఈ గుంత తోట యజమాని సన్నీ భద్రతా చర్యలకోసం తవ్వించాడు. ఉదయం కుక్క భయంగా మొరిగిన శబ్దం విని ఆయన అక్కడకు వెళ్లగా గుంతలో పులి ఉన్నట్టుగా గుర్తించి వెంటనే అటవీశాఖకు సమాచారం ఇచ్చారు. అటవీ అధికారులు సంఘటన స్థలానికి వెంటనే చేరుకుని రక్షణ చర్యలు ప్రారంభించారు.

పులికి మత్తు ఇంజెక్షన్ వేసినప్పుడు కుక్క భయంతో ఎగబాకి మొరిగింది. పులి నిద్రలోకి వెళ్లకపోవడంతో, కుక్కకు కూడా మత్తు ఔషధం ఇచ్చారు. పులి, కుక్క రెండు మత్తులోకి జారుకున్న తర్వాత వల ఉపయోగించి బయటకు తీసారు.

పులిని ప్రత్యేక కేజ్‌లో వేసి, పక్కనే ఉన్నపెరియార్ టైగర్ రిజర్వ్‌కు తరలించారు. కుక్కను కూడా సురక్షితంగా బయటకు తీసి తాత్కాలిక పునరావాస కేంద్రానికి తరలించారు. వన్యప్రాణి వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించగా, పులికీ కుక్కకూ గాయాలు లేవని నిర్ధారించారు.

అయితే పులి కుక్కతో కొంతకాలం గడిపినందున రేబీస్ వ్యాధి అవకాశాన్ని కూడా పరిగణలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షలు పూర్తయ్యాక పులిని తిరిగి అడవిలోకి విడిచే అవకాశముందని అధికారులు తెలిపారు. ఈ సంఘటన జరిగిన ప్రాంతంలో సాధారణంగా పులులు కనిపించవు. 

వన్యప్రాణుల తీరు, ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇది కేరళలో అరుదుగా నమోదైన ఘటనగా నిలిచింది. అటవీశాఖ సమయోచిత చర్యలతో ప్రాణులకు హాని లేకుండా ముగిసిన ఈ సంఘటన స్థానిక ప్రజల్లో అద్భుతం, ఆశ్చర్యం కలిగించింది. ఎందుకంటే గుంతలో పడ్డ తర్వాత ఆకలితో ఉన్న పులి కుక్కపై దాడి చేయలేదు. రెండూ కూడా ప్రాణాలు కాపాడుకోవడం కోసం ఎదురుచూశాయి. నిజంగానే ఇది ఒక అద్భుతం.