Asianet News TeluguAsianet News Telugu

బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ.. తీర్పు పున:సమీక్షకు నిరాకరణ

బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద గుజరాత్ ప్రభుత్వం విడుదల చేయడానికి సంబంధించి ఆమె సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు వేశారు. అందులో సుప్రీంకోర్టు గత తీర్పు రివ్యూ కోసం చేసిన విజ్ఞప్తిని తాజాగా సుప్రీంకోర్టు తిరస్కరించింది.
 

bilkis bano request to review decision quashed by supreme court
Author
First Published Dec 17, 2022, 1:14 PM IST

న్యూఢిల్లీ: బిల్కిస్ బానోకు సుప్రీంకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గ్యాంగ్ రేప్ కేసులో 11 మంది దోషులను సత్ప్రవర్తన కింద విడుదల చేయడానికి సంబంధించి తన తీర్పును పున:సమీక్ష చేయాలని ఆమె విజ్ఞప్తి చేసింది. ఈ విజ్ఞప్తిని సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. 2002లో గుజరాత్ అల్లర్ల సమయంలో బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం జరిగింది. ఆమె కుటుంబంలోని ఏడుగురిని చంపేశారు. 

ఈ కేసులో 11 మంది దోషులను గుజరాత్ ప్రభుత్వం ఆగస్టు 15వ తేదీన సత్ప్రవర్తన కింద విడుదల చేసింది. వీరి విడుదలను సవాల్ చేస్తూ బిల్కిస్ బానో సుప్రీంకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేసింది. 11 మంది దోషుల్లో ఒకరు సుప్రీంకోర్టును ఆశ్రయించి 1992లో అమల్లోకి వచ్చిన రిమిషన్ పాలసీ ప్రకారమే తమ దరఖాస్తులు పరిగణించాలని కోరారు. ఆ మేరకు గుజరాత్ ప్రభుత్వాన్ని ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. ఎందుకంటే.. తమను దోషులుగా నిర్దారించినప్పుడు ఆ రిమిషన్ పాలసీనే అమల్లో ఉన్నదని వివరించారు. ఆ దోషి పిటిషన్‌తో సుప్రీంకోర్టు ఏకీభవించి గుజరాత్ ప్రభుత్వానికి ఆదేశాలు చేసింది. వారి దరఖాస్తులను 1992 రిమిషన్ పాలసీ కింద పరిగణించాలని చెప్పింది. ఈ తీర్పు వెలువరించిన మూడు నెలల తర్వాత ఆగస్టు 15న గుజరాత్ ప్రభుత్వం 11 మంది దోషులను గోద్రా జైలు నుంచి విడుదల చేసింది. 

గుజరాత్ ప్రభుత్వానికి సూచన చేస్తూ వెలువరించిన తీర్పును రివ్యూ చేయాలని తాజాగా బిల్కిస్ బానో విజ్ఞప్తి చేసింది. దీనికితోడు మరో పిటిషన్ కూడా వేసింది. అది వారి విడుదలకు సంబంధించిన కారణాలను సవాల్ చేసింది. సుప్రీంకోర్టు తాజా నిర్ణయం ఈ రెండో పిటిషన్‌పై ప్రభావం వేయదని న్యాయనిపుణులు అభిప్రాయపడుతున్నారు.

1992 రిమిషన్ పాలసీ కింద ఏ కేసులోని దోషులనైనా విడుదల చేయడానికి ఆస్కారం ఉన్నది. కానీ, తాజా రిమిషన్ పాలసీ ప్రకారం, గ్యాంగ్ రేప్, మర్డర్ దోషులను ముందుగా విడుదల చేయడానికి అవకాశం లేదు. కాబట్టి, ఈ కేసులోని దోషి ఒకరు తమ పిటిషన్లను 1992 పాలసీ కిందనే పరిగణించాలని కోరారు.

Also Read: సుప్రీం కోర్టులో బిల్కిస్ బానో పిటిషన్‌.. విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ బేల ఎం త్రివేది..

కాగా, బిల్కిస్ బానో ఈ తీర్పును సవాల్ చేస్తూ పిటిషన్ వేశారు. అసలు వారిని ముందస్తు విడుదల చేసే అధికారం గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి లేదని వాదించింది. తమ కేసులో విచారణ పొరుగున ఉన్న మహారాష్ట్రలో జరిగిందని, కాబట్టి, మహారాష్ట్రలోని రిమిషన్ పాలసీ ప్రకారం వారి దరఖాస్తులను పరిగణనలోకి తీసుకోవడం సముచితంగా ఉంటుందని తెలిపింది. 2004 తర్వాత ఈ కేసు విచారణ మహారాష్ట్రలో జరిగింది. గుజరాత్‌లో తనకు విచారణ పారదర్శకంగా ఉంటుందని తాను అనుకోవడం లేదని బిల్కిస్ బానో న్యాయస్థానాన్ని ఆశ్రయించిన తర్వాత ఈ విచారణ పొరుగు రాష్ట్రానికి వెళ్లింది.

Follow Us:
Download App:
  • android
  • ios