ఆర్యన్ ఖాన్ కేసులో మరో మలుపు.. ఢిల్లీకి ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే.. అలాంటిది ఏం లేదని వెల్లడి..
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును (Aryan Khan Case) విచారిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై (Sameer Wankhede) సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఢిల్లీ చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది.
Aryan Khan Case: ఢిల్లీకి ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడే.. అలాంటిది ఏం లేదని వెల్లడి..
బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసును (Aryan Khan Case) విచారిస్తున్న నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారి సమీర్ వాంఖడేపై (Sameer Wankhede) సంచలన ఆరోపణలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ నుంచి ఆయన డబ్బులు డిమాండ్ చేశారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సోమవారం సాయంత్రం ఢిల్లీకి చేరుకోవడం చర్చనీయాంశంగా మారింది. అయితే ఈ సందర్భంగా ఎయిర్‌పోర్ట్‌లో మీడియా అడిగిన ప్రశ్నలకు సమధానమిచ్చిన సమీర్ వాంఖడే.. తనకు ఏ దర్యాప్తు సంస్థ నుంచి సమన్లు అందలేదని తెలిపారు. కొంచెం పని మీద తాను ఢిల్లీకి వచ్చినట్టుగా చెప్పారు. నేను కేసు దర్యాప్తుకు 100 శాతం కట్టుబడి ఉన్నానని వెల్లడించారు.
ఆర్యన్ ఖాన్ ప్రయాణిస్తున్న క్రూజ్ షిప్‌లో డ్రగ్స్ లభించాయన్న పంచనామా పత్రంలో సాక్షిగా ఉన్న ఓ ప్రైవేటు డిటెక్టర్ కేపీ గోసావి బాడీగార్డ్ ప్రభాకర్ సాయిల్ సంచలన ఆరోపణలు ఇప్పుడు కేసు ఫోకస్ అంతా సమీర్ వాంఖేడ్‌పైకి మారేలా చేశాయి. ఆర్యన్ ఖాన్ విడుదలకు రూ. 25 కోట్ల లంచం డిమాండ్ చేశారని ఆయన చేసిన ఆరోపణలు సంచలనమయ్యాయి. ఈ నేపథ్యంలో సమీర్ వాంఖడేపై విచారణ ప్రారంభిస్తున్నట్టుగా ఎన్‌సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్ సింగ్ తెలిపారు. విచారణకు ఆదేశించామని.. అయితే సమీర్ వాంఖడే ఆ పదవిలో కొనసాగుతురో..? లేదో..? చెప్పడం తొందరపాటే అవుతుందని అన్నారు.
Also read: మానసిక స్థితి బాగోలేని వ్యక్తిని పాము కాటుతో చంపేశారు.. ఇన్సురెన్స్ డబ్బుల కోసం ఇంత నీచమా..?
మరోవైపు సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి, ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ సంచలన ఆరోపణలు చేశారు. క్రూయిజ్ షిప్ నుంచి డ్రగ్స్ రికవరీకి సంబంధించిన కేసు నకిలీది అని ఆరోపించారు. బీజేపీ, ఎన్సీబీ ముంబైలో ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేస్తున్నాయని ఆరోపించారు. వాంఖడే పుట్టుకకు సంబంధించిన పత్రానికి సంబంధించిన ఓ ఫొటోను ట్వీట్ చేసిన నవాబ్ మాలిక్.. ‘ఫోర్జరీ ఇక్కడి నుంచే ప్రారంభమైంది’ అని పేర్కొన్నారు. అయితే నవాబ్ మాలిక్ ఆరోపణలపై సమీర్ వాంఖడే ఘాటుగా స్పందించారు.
"నా వ్యక్తిగత పత్రాలను ప్రచురించడం ద్వారా పరువు నష్టం కలిగిస్తున్నారు. నా కుటుంబ గోప్యతపై అనవసరమైన దాడి చేస్తున్నారు. ఇది నన్ను, నా కుటుంబాన్ని, నా తండ్రిని నా దివంగత తల్లిని కించపరచడానికి ఉద్దేశించబడింది" అని సమీర్ వాంఖడే ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి నవాబ్ మాలిక్ చర్యలు.. విపరీతమైన మానసిక ఒత్తిడికి గురిచేశాయని అన్నారు. అంతేకాకుండా తనను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకున్నారని క్రూయిజ్ డ్రగ్స్ కేసును విచారిస్తున్న ప్రత్యేక కోర్టుకు ఆయన అఫిడవిట్ సమర్పించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సమీర్ వాంఖడే ఢిల్లీ పర్యటన చర్చనీయాంశంగా మారింది.