ఔను.. సమీర్ వాంఖడే బ్లాంక్ పేపర్స్‌పై నా సంతకాలూ తీసుకున్నాడు.. మరో సాక్షి ఆరోపణలు

ఆర్యన్ ఖాన్ కేసు చుట్టూ హై వోల్టేజ్ రాజకీయాలు తిరుగుతున్నాయి. ఆ కేసు దర్యాప్తు చేస్తున్న ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపైనే తీవ్ర ఆరోపణలు వస్తున్నాయి. క్రూజ్ డ్రగ్ కేసు పంచనామా పత్రంలో సంతకం చేసిన సాక్షి ప్రభాకర్ సాయిల్ యూ టర్న్ తీసుకోగా.. తాజాగా మరో సాక్షి కూడా వాంఖడే తనతో బ్లాంక్ పేపర్స్‌పై సంతకాలు పెట్టించుకున్నారని ఆరోపణలు చేశారు.
 

another witness says sameer wankhede made him to sign blank papers

ముంబయి: ఎన్‌సీబీ అధికారి సమీర్ వాంఖడేపై మరో సాక్షి సంచలన ఆరోపణలు చేశారు. ముంబయి క్రూజ్‌లో డ్రగ్స్‌కు సంబంధించిన కేసును సమీర్ వాంఖడే దర్యాప్తు చేస్తున్నారు. ఇందులో బాలీవుడ్ స్టార్ షారూఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ నిందితుడుగా ఉన్నారు. ఈ కేసులో అనూహ్య మలుపులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు ఆర్యన్ ఖాన్‌పై నుంచి ఫోకస్ అంతా సమీర్ వాంఖడేపైకి మారింది. క్రూజ్ డ్రగ్స్‌ కేసుకు సంబంధించిన పంచనామా పత్రంలో సాక్షిగా సంతకం పెట్టిన ప్రభాకర్ సాయిల్ సంచలన ఆరోపణలతో సమీర్ వాంఖడే సమస్యల్లో చిక్కుకున్నారు. పంచనామా కోసం తొమ్మిది నుంచి పది తెల్ల కాగితాలపై తన సంతకం తీసుకున్నారని ఆరోపించారు. తాజాగా, ఇలాంటి ఆరోపణలే మరో సాక్షి కూడా చేశారు.

ఎన్‌సీబీ ముంబయి జోనల్ డైరెక్టర్ సమీర్ వాంఖడే తనతో పది నుంచి పన్నెండు బ్లాంక్ పేపర్‌లపై సంతకాలు చేయించుకున్నారని శేఖర్ కాంబ్లే అనే వ్యక్తి ఆరోపణలు చేశారు. తర్వాత అవే పత్రాలను ముంబయి ఖార్‌గర్ నుంచి నైజీరియన్ అరెస్టు కేసులో పంచనామాగా వాడారని అన్నారు. వాంఖడే తనతో బ్లాంక్ పేపర్స్‌పై సంతకాలు పెట్టించుకున్నారని, ఆ సంతకాలతో ఏ సమస్యా రాదని భరోసానిచ్చినట్టు వివరించారు. అంతేకాదు, ఆయన దగ్గర దీనికి సంబంధించిన కాల్ రికార్డులూ ఉన్నాయని తెలిపారు.

Also Read: ఆర్యన్ ఖాన్ కేసులో అనూహ్య ట్విస్ట్.. సాక్షి సంచలన ఆరోపణలు.. 18 కోట్ల డీల్.. నాకు ప్రాణ హాని

తాను నిన్న ఓ టీవీ చానెల్‌లో ఖార్‌గర్ నుంచి నైజీరియన్ కేసు గురించిన ప్రస్తావన విన్నారని శేఖర్ కాంబ్లే అన్నారు. అది విని తాను భయాందోళనలకు గురయ్యారని చెప్పారు. తర్వాత ఎన్‌సీబీ అధికారి అనిల్ మానే నుంచి తనకు ఓ ఫోన్ వచ్చిందని తెలిపారు. ఏమీ కాదని, దీని గురించి ఎవరితోనూ మాట్లాడవద్దని సూచించినట్టు పేర్కొన్నారు. ఆ కేసును ఆశిశ్ రంజన్ అనే ఎన్‌సీబీ అధికారి హ్యాండిల్ చేస్తున్నట్టు తెలిపారు.

పంచనామా కోసం బ్లాంక్ పేపర్‌లపై తన సంతకాలు తీసుకున్నట్టు ప్రభాకర్ సాయిల్ కూడా ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. అసలు ముంబయి తీరంలో క్రూజ్ షిప్ నుంచి డ్రగ్స్ స్వాధీనం చేసుకున్నారా? లేదా? అనే విషయం కూడా తనకు తెలియదని అన్నారు.

ఈ నేపథ్యంలోనే సమీర్ వాంఖడేపై మహారాష్ట్ర మంత్రి నవాబ్ మాలిక్ తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ఇప్పుడు నవాబ్ మాలిక్ వర్సెస్ సమీర్ వాంఖడేపై పరిస్థితులు మారాయి.

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios