కర్ణాటక తీర ప్రాంతంలో నిర్వహించే సాంప్రదాయ క్రీడ కంబళలో శ్రీనివాస గౌడ అద్భుతంగా పరిగెత్తి.. ప్రపంచ పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌ను మించిపోయాడు. దీంతో అతని పేరు నాలుగైదు రోజుల నుంచి సోషల్ మీడియాతో పాటు అంతర్జాతీయంగానూ మారుమోగుతోంది.

అయితే ఈ ఘటనను మరిచిపోకముందే శ్రీనివాస్ రికార్డు కాలగర్భంలో కలిసిపోయింది. కంబళ పోటీల్లో శ్రీనివాస్ గౌడ 142.5 మీటర్ల దూరాన్ని 13.62 సెకన్లలో చేరుకుంటే.. తాజాగా నిషాంత్ శెట్టి 143 మీటర్ల దూరాన్ని కేవలం 13.68 సెకన్లలోనే పరిగెత్తాడు.

Also Read:కేంద్రమంత్రి ఆఫర్: కుదరదంటూ తేల్చేసిన కన్నడ పరుగుల వీరుడు

వేగం పరంగా లెక్కిస్తే నిషాంత్ శెట్టి 100 మీటర్ల దూరాన్ని కేవలం 9.51 సెకన్లలో పరిగెత్తినట్లు లెక్క. ఇదే సమయంలో శ్రీనివాస్ 100 మీటర్ల దూరాన్ని 9.55 సెకన్లలో పరిగెత్తాడు. తాజాగా 100 మీటర్ల దూరాన్ని చేరుకోవడానికి నిషాంత్.. ఉసేన్ బోల్ట్, శ్రీనివాస్ గౌడల కంటే 0.03 సెకన్ల తక్కువ సమయం తీసుకున్నాడు.

మరోవైపు శ్రీనివాస గౌడను ప్రశంసిస్తూ కొద్దిరోజుల నుంచి సామాజిక మాధ్యామలలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ప్రముఖ పారిశ్రామిక వేత్త ఆనంద్ మహీంద్రా అయతే అతనికి గోల్డ్ మెడల్ బహూకరించాలని కోరారు.

Aslo Read:ఉసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన కన్నడ రైతు

ఈ నేపథ్యంలో స్పందించిన కేంద్ర క్రీడా శాఖ మంత్రి కిరణ్ రిజిజు అయితే శ్రీనివాస్‌కు ట్రయల్స్ నిర్వహించాల్సిందిగా అధికారులను ఆదేశించారు. తాను ఇప్పుడే ట్రయల్స్‌కు హాజరుకాలేనని.. దానికి కొంత సమయం కావాలని కోరిన సంగతి తెలిసిందే.

శ్రీనివాస గౌడ ప్రదర్శనతో హర్షం వ్యక్తం చేసిన కర్ణాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప అతనిని తన కార్యాలయానికి పిలిపించుకుని అతనికి రూ.3 లక్షల నగదు బహుమతిని అందించారు. మరి ఇప్పుడు శ్రీనివాస్ రికార్డును నిషాంత్ అధిగమించడంతో అంతా షాకయ్యారు.