జమైకా పరుగుల వీరుడు ఉసేన్ బోల్ట్‌ను మించిన పరుగుతో అందరి దృష్టిని ఆకర్షించిన కర్ణాటక భవన నిర్మాణ కూలీ శ్రీనివాస్ గౌడ భారత క్రీడా అథారిటీ ట్రయల్‌లో పాల్గొనడానికి నిరాకరించాడు.

శ్రీనివాస్ పరుగు పందాన్ని చూసిన కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు.. భారత క్రీడా అథారిటీ ట్రయల్‌లో పాల్గొనాలని అతనికి సలహా ఇచ్చారు. అయితే పరుగు పందెం సందర్భంగా తన పాదాలకు గాయాలు అయ్యాయని, ప్రస్తుతానికి ట్రయల్‌లో పాల్గొనలేనని తేల్చి చెప్పాడు. అలాగే ప్రస్తుతం తన దృష్టి అంతా కూడా కంబళపైనే ఉందని.. పైగా తనకు దున్నలతో పొలాల్లో పరిగెత్తడమే అలవాటని శ్రీనివాస్ తెలిపాడు.

Also Read:ఉసేన్ బోల్ట్ రికార్డును బ్రేక్ చేసిన కన్నడ రైతు

అదే సమయంలో కంబళ అకాడమీ వ్యవస్థాపక కార్యదర్శి ప్రొఫెసర్ గుణపాల కదంబ మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి ఆఫర్‌ను తాము స్వాగతిస్తున్నామని.. దానిని కంబళకు దక్కిన గౌరవంగా చూస్తున్నామని ఆయన పేర్కొన్నాడు. కానీ శ్రీనివాస్ ఇప్పుడు ట్రయల్‌లో పాల్గొనలేడు..  మరో రెండు మూడు రోజులు వరకు తను దానిని చేయలేడని కదంబా తెలిపారు.

కొద్దిరోజుల క్రితం కర్ణాటకలోని మంగళూరు ప్రాంతానికి చెందిన శ్రీనివాస్ గౌడ బురద నీటితో దున్నలతో 142 మీటర్ల దూరాన్ని 13.42 సెకన్లలో దూరాన్ని అందుకుని రికార్డు సృష్టించాడు. ఒలింపిక్ క్రీడల్లో బోల్డ్ 9.58 సెకన్లలో వంద మీటర్ల దూరం చేరుకుని రికార్డు సృష్టించాడు. అయితే వంద మీటర్ల దూరాన్ని గౌడ కేవలం 9.55 సెకన్లలో అందుకున్నాడు.

Also Read:సిరీస్ ఓటములు, పేలవ ఫామ్: డుప్లెసిస్ సంచలన నిర్ణయం

ఇక కంబళ ఆట విషయానికి వస్తే కర్ణాటక తీర ప్రాంతాల్లో నిర్వహించే ఒక సంప్రదాయ క్రీడ.. స్థానిక తులు భాషలో కంబళ అంటే బురద నిండిన వరిపొలాలు అని అర్థం. ఈ క్రీలో పాల్గొనే క్రీడాకారులు 132-142 మీటర్ల పొడవున్న పొలంలో కాడెకు కట్టిన దున్నలతో కలిసి వేగంగా పరుగు తీయాల్సి ఉంటుంది.