అహ్మదాబాద్‌లో జరిగిన ప్రమాదం తర్వాత ఎయిర్ ఇండియా విమానం ప్రతీ రోజూ వార్తల్లో నిలుస్తోంది. తాజాగా మరోసారి ఎయిర్ ఇండియా వార్తల్లోకి ఎక్కింది.
తూర్పు ఇండోనేసియాలోని లెవోటోబి లకి-లకి అగ్నిపర్వతం మంగళవారం భారీగా బద్దలవడంతో.. సమీప ప్రాంతాలపై బూడిద భారీగా వ్యాపించింది. ఈ పరిణామంతో బాలికి వెళ్లే ఎయిరిండియా విమానం ప్రయాణ దారుల భద్రత దృష్టిలో పెట్టుకొని వెనక్కి మళ్లించారు. తిరిగి బుధవారం దిల్లీకి సురక్షితంగా చేరిందని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
అంతర్జాతీయ విమానాల రద్దు
ఈ విస్ఫోటనం ప్రభావంతో భారత్, సింగపూర్, ఆస్ట్రేలియా వంటి దేశాల నుంచి బాలికి వెళ్లే పలు అంతర్జాతీయ విమానాలు రద్దయ్యాయి. తూర్పు నుసా టెంగారా ప్రావిన్స్‌లోని కొన్ని విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేశారని ఇండోనేషియా అధికారులు తెలిపారు. ప్రయాణికుల ప్రాణభద్రతే ప్రధాన్యంగా తీసుకున్నామని పేర్కొన్నారు.
వోల్కనాలజీ అండ్ జియోలాజికల్ హజార్డ్ మిటిగేషన్ ఏజెన్సీ (PVMBG) ప్రకారం, మంగళవారం లెవోటోబి లకి-లకి పర్వతం నుంచి బూడిద దాదాపు 11 కిలోమీటర్ల ఎత్తు వరకు ఎగసిపడింది. బుధవారం మరోసారి పేలుడు సంభవించగా, ఈసారి 1 కిలోమీటర్ ఎత్తులో బూడిద వర్షంలా కురిసింది.
ప్రజల తరలింపు
విస్ఫోటనం ప్రాంతానికి సమీపంగా ఉన్న గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని స్థానిక విపత్తు నిర్వహణ అధికారి అవీ హల్లన్ తెలిపారు. ప్రజలు మాస్కులు ధరించి, బయటకు రావద్దని హెచ్చరికలు జారీ చేశారు. ఈ పర్వతం గతంలోనూ పలుమార్లు పేలిపోయినట్టు ఆయన చెప్పుకొచ్చారు.
వాతావరణ ప్రభావంతో మరో విమాన రద్దు
ఇక దిల్లీలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా మంగళవారం ముంబయి నుంచి లఖ్‌నవూకు వెళ్లే ఎయిరిండియా విమానం రద్దు అయింది. ప్రయాణికుల బసకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు సంస్థ వెల్లడించింది. బుధవారం వారిని గమ్యస్థానాలకు చేర్చే విధంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
