అహ్మదాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి లండన్ వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా విమానం (AI 171) గురువారం మధ్యాహ్నం బయలుదేరిన కొద్ది క్షణాలకే మేఘనీనగర్ ప్రాంతంలో కుప్పకూలిన విష‌యం తెలిసిందే. ఈ ఘోర ప్ర‌మాదం యావ‌త్ దేశాన్ని ఉలిక్కిప‌డేలా చేసింది. 

ఈ విమానంలో మొత్తం 242 మంది ప్రయాణికులు, సిబ్బంది ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ప్ర‌మాదంలో అనేక‌ మంది మృతి చెందినట్టు వార్త‌లు వ‌స్తున్నాయి. అలాగే గాయ‌ప‌డిన వారి సంఖ్య కూడా ఎక్కువే ఉంటుంద‌ని అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలో ఈ ప్ర‌మాదంలో గాయ‌ప‌డిన వారికి, మృతి చెందిన వారికి ప‌రిహారం ఎవ‌రు చెల్లిస్తారు.? లాంటి వివ‌రాలు ఇప్పుడు తెలుసుకుందాం.

విమాన ప్రమాదంలో ప్రయాణికులు గాయపడితే లేదా మరణిస్తే, ఎయిర్‌లైన్స్ చట్టపరంగా నష్ట పరిహారం చెల్లించాల్సి ఉంటుంది. మాంట్రియాల్ కన్వెన్షన్-1999 ప్రకారం (ఇది భారత్ అనుసరిస్తున్న అంతర్జాతీయ ఒప్పందం): ఒక్కో ప్రయాణికుడికి సుమారు రూ. 1.4 కోట్ల వరకు పరిహారం చెల్లించాలి. విమాన సంస్థ తప్పుడు నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు నిరూపితమైతే, అదనపు పరిహారం కూడా చెల్లించాల్సి ఉంటుంది.

ఇది అంతర్జాతీయ ప్రయాణాలపై వర్తిస్తుంది. అయితే దేశీయ విమానయాన సంస్థలు కూడా డీజీసీఏ మార్గదర్శకాలను అనుసరించి ఇలాంటి పరిహారాలు చెల్లిస్తాయి. ట్రావెల్ ఇన్షూరెన్స్ ఉన్నవారికి అదనపు భరోసా

ఎవరైనా ప్రయాణానికి ముందు ట్రావెల్ ఇన్షూరెన్స్ తీసుకుంటే, వారు క్రిందివిధంగా అదనపు లాభాలు పొందగలుగుతారు:

* ప్ర‌యాణికుడు మ‌ర‌ణిస్తే రూ. 25 ల‌క్ష‌ల నుంచి రూ. కోటి వ‌ర‌కు ప‌రిహారం అందిస్తారు.

* శాశ్వత వైకల్యానికి రూ. 5 నుంచి రూ. 10 లక్షల వరకూ

* బ్యాగేజ్ పోవడం, ఫ్లైట్ రద్దు, ఆలస్యం వంటి ఇబ్బందులకు పరిహారం చెల్లిస్తారు.

కానీ ఈ లాభాలు అనుమతి పొందిన ట్రావెల్ ఇన్షూరెన్స్ ప్లాన్ కొనుగోలు చేసినవారికి మాత్రమే వర్తిస్తాయి. దేశీయ ప్రయాణాలకు చాలామంది భారతీయులు ఈ ప్లాన్ తీసుకోవడం మర్చిపోతున్నారు. అయితే ఒకవేళ మీరు ట్రావెల్ ఇన్షూరెన్స్ తీసుకోకపోయినా, ఈ క్రింద లాభాలు అందే అవకాశం ఉంది:

  • ఎయిర్‌లైన్ నుంచి చట్టపరంగా ఇచ్చే పరిహారం
  • ప్రభుత్వం ప్రకటించే ఎక్స్‌గ్రేషియా (కొన్ని సందర్భాల్లో మాత్రమే)
  • ఉద్యోగ ప్రయాణమైతే కంపెనీ ఇన్షూరెన్స్
  • కొన్ని ర‌కాల‌ క్రెడిట్ కార్డుల ద్వారా యాత్ర బీమా సౌకర్యం కూడా ఉంటుంది.
  • టూర్ కంపెనీలు లేదా ఆఫీస్ గ్రూప్ ట్రిప్‌లలో పొందే గ్రూప్ బీమా.

అయ‌తే విమాన ప్రమాదాల అనంతరం కొన్నిసార్లు పరిహారం పొందడం వెంటనే జరగదు. దుర్ఘటనపై దర్యాప్తు పూర్తికాకపోవడం. బాధ్యత ఎవరిదో స్పష్టంగా నిర్ధారించలేకపోవడం, ప్రయాణికుడికి బీమా లేకపోవడం లేదా నామినీ వివరాలు నమోదు చేయకపోవడం ఇలాంటి సంద‌ర్భాల్లో ప‌రిహారం ఆల‌స్య‌మ‌వుతుండొచ్చు.

విమానాల్లో ప్ర‌యాణించే వారు గుర్తుంచుకోవాల్సిన విష‌యాలు:

* ప్రయాణానికి ముందు తప్పకుండా ట్రావెల్ ఇన్షూరెన్స్ తీసుకోవాలి.

* బీమా పాలసీలో నామినీ వివరాలు స్పష్టంగా నమోదు చేసుకోవాలి.

* ప్రింటె, డ్ మరియు డిజిటల్ బీమా కాపీలు భద్రపరచండి

* బీమా ప్లాన్ ఎంపిక చేసేటప్పుడు మరణంతో పాటు వైద్య ఖర్చులు ఉండేలా చూసుకోండి