అహ్మదాబాద్ లో కుప్పకూలిన విమానంలో గుజరాత్ మాజీ సీఎం విజయ్ రూపానితో పాటు మరికొందరు ప్రముఖులు ఉన్నట్లు సమాచారం.
Air India : గుజరాత్ లో ఘోర విమాన ప్రమాదం జరిగింది. అహ్మదాబాద్ విమానాశ్రయం నుండి లండన్ కు బయలుదేరిని ఎయిరిండియా విమానం టేకాఫ్ అయ్యే సమయంలో కుప్పకూలింది. ఎయిర్ పోర్ట్ కు సమీపంలోనే ఈ విమానం కుప్పకూలి ఒక్కసారిగా పేలిపోయింది... ఈ దుర్ఘటనతో ఎయిర్ పోర్ట్ వద్ద దట్టమైన పొగలు కమ్ముకున్నాయి. ప్రమాద సమయంలో విమానంలో 242 మంది ప్రయాణికులతో పాటు 12 మంది సిబ్బంది ఉన్నారు.
ప్రమాదానికి గురయిన విమానంలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాదు పలువురు రాజకీయ, వ్యాపార ప్రముఖులు కూడా ఉన్నట్లు సమాచారం. ఈ విమాన ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై సమాచారం అందినవెంటనే కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు, హోమంత్రి అమిత్ షా విమానయాన శాఖ అధికారులతో మాట్లాడారు. ఈ ప్రమాదానికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. రామ్మోహన్ నాయుడు వెంటనే అహ్మదాబాద్ కు బయలుదేరారు.
కేంద్ర హోంమంత్రి అమిత్ షా గుజరాత్ సీఎంకు ఫోన్ చేసి మాట్లాడారు. ప్రమాద వివరాలు, ప్రయాణికుల పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రధానమంత్రి కార్యాలయం కూడా ఈ విమాన ప్రమాదంపై ఆరా తీసి ప్రధాని మోదీకి సమాచారం ఇచ్చినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ప్రమాదస్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
