జలౌన్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని జలౌన్ లో అత్యంత దారుణమైన సంఘటన చోటు చేసుకుంది. 14 ఏళ్ల బాలికను చంపేసి, ఆమె కనుగుడ్లు పీకేశారు. అపహరణ, హత్య ఆరోపణల కింద బాలిక ఇంటి పక్క వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. బాలికపై అత్యాచారం జరిగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. 

బాలికపై అత్యాచారం జరిగిందా, లేదా అనే విషయం పోస్టుమార్టం నివేదికలో తేలనుంది. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో జలౌన్ జిల్లా ఆటా ప్రాంతంలో జరిగింది. పని మీద బయటికి వెళ్లిన బాలిక శనివారం సాయంత్రం వరకు కూడా తిరిగి రాలేదు. దాంతో బాలిక తల్లిదండ్రులు అదే రాత్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాలిక మృతదేహాన్ని ఆదివారం సాయంత్రం నిర్మానుష్యమైన ప్రదేశంలో గుర్తించారు. ఆమె దుస్తులు చిరికిపోయి ఉన్నాయి. ఆమె కనుగుడ్లు పీకేసి ఉన్నాయి. దాన్నిబట్టి అత్యాచారం చేసి ఆమెను చంపేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. 

ఝాన్సీ జోన్ డీఐజీ సుభాష్ సింగ్ బఘేలు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఈ సంఘటనలో రంజిత్ అహిర్ వార్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. అతనిపై ఇప్పటికే ఓ కేసు ఉంది. అహిర్ వార్ ను పోలీసులు విచారిస్తున్నారు.