నరేంద్ర మోదీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసి నేటితో 11 ఏళ్లు పూర్తవుతోంది. ఈ నేపథ్యంలో ఈ 11 ఏళ్ల పాలనలో జరిగిన మార్పులపై నాయకులు స్పందిస్తున్నారు. ఇందులో భాగంగానే కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు.
ఎన్డీఏ ప్రభుత్వ పాలనకు 11 సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా, కేరళ బీజేపీ అధ్యక్షుడు రాజీవ్ చంద్రశేఖర్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీలో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ, గత 78 సంవత్సరాల భారత స్వాతంత్రంలో ఈ 11 ఏళ్లు అత్యంత గణనీయమైన మార్పులు తెచ్చిన కాలంగా నిలిచాయి అని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ప్రభుత్వం దేశాన్ని “నకిలీ హామీల నుంచి వాస్తవ అభివృద్ధి వైపు” నడిపించిందని ఆయన తెలిపారు. మోదీ పాలన ముందు దేశ రాజకీయాల్లో వాగ్దానాలే ఉండేవని, వాటిని అమలు చేయడంలో అలసత్వం ఉండేవని అన్నారు. అయితే ఇప్పుడు "పర్ఫార్మెన్స్ పాలిటిక్స్" కొత్త ప్రమాణంగా మారిందన్నారు.
కేంద్రం ప్రభుత్వం పారదర్శకతకు అధిక ప్రాధాన్యత ఇచ్చిందని, అవినీతిని నిరోధించేందుకు గణనీయమైన చర్యలు తీసుకుందని ఆయన అన్నారు. డిజిటల్ ఇండియా, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ (DBT) వంటి పథకాల ద్వారా ప్రజల అభివృద్ధికి ప్రత్యక్ష మద్దతు అందించారని అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ.. 2014 తర్వాత మోదీ ప్రభుత్వం దేశానికి స్పష్టమైన దిశ, దృఢమైన నాయకత్వం అందించిందన్నారు. ఈ కాలంలో దేశ ప్రజల ఆశలూ, అంచనాలూ పెరిగాయని అన్నారు. మోదీ ప్రభుత్వం చెప్పిందే చేస్తోంది, చేసి చూపుతోందని అన్నారు. "ఇది నవరాజకీయ శకానికి ఆరంభం. ప్రజలు ఇప్పుడు హామీలను కాదు, ఫలితాలను చూస్తున్నారు," అని ఆయన అన్నారు.


