జోద్ పూర్: తెలంగాణ వెటర్నరీ డాక్టర్ దిశ రేప్, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఎ బోబ్డే సంచలన వ్యాఖ్యలు చేశారు. న్యాయం ప్రతీకార రూపం తీసుకుంటే న్యాయం దాని లక్షణాన్నే కోల్పోతుంది ఆయన వ్యాఖ్యానించారు. 

న్యాయం తక్షణమే జరగడమనేది ఎప్పుడూ సాధ్యం కాదని తాను భావిస్తున్నట్లు బోబ్డే తెలిపారు. న్యాయం చేయడమనేది ప్రతీకార రూపం తీసుకుంటే న్యాయం దాని లక్షణాన్నే కోల్పోతుందని ఆయన అన్నారు. గత నెలలో బోబ్డె సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా బాధ్యతలు స్వీకరించారు. రాజస్థాన్ హైకోర్టు కొత్త భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆయన ప్రసంగించారు. 

Also Read: రేప్ కేసులపై రవిశంకర్ ప్రసాద్ వినతి: విభేదించిన సుప్రీం ప్రధాన న్యాయమూర్తి

దేశ న్యాయవ్యవస్థలో కొన్ని లొసుగులు ఉన్న మాట వాస్తవమేనని ఆయన అంగీకరిస్తూ వాటిని వెంటనే సరిదిద్దాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. క్రిమినల్ కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని సరిదిద్దడానికి క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ను తిరిగి పరిశీలించాల్సిన అవసరం ఉందని అన్నారు. 

సాంకేతిక పరిజ్ఞానాన్ని అన్వయించడం ద్వారా, ప్రత్యామ్నాయ వివాదా పరిష్కారాల విధానాలను శక్తివంతం చేయడం ద్వారా కేసుల పరిష్కారంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించవచ్చునని ఆయన అన్నారు. 

దిశ రేప్, హత్య కేసులో నిందితులను ఎన్ కౌంటర్ చేయడంపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. నిందితులను ఎన్ కౌంటర్ చేయడాన్ని కొందరు సమర్థిస్తుండగా, కోర్టులో వారి వాదనలు వినిపించుకునే అవకాశం లేకుండా చేయడం సరి కాదని మరికొంత మంది వాదిస్తున్నారు. 

Also Read: దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తంటా: ఆ రెండు సంఘటనలపై ఆందోళనలు

ఉన్నావో అత్యాచార బాధితురాలిని సజీవ దహనం చేసిన ఘటనలో బాధితురాలి తండ్రి మాట్లాడుతూ నిందితులను వారంలోగా ఉరి తీయాలని లేదా కాల్చి చంపాలని డిమాండ్ చేశారు. హజీపూర్ నిందితుడు శ్రీనివాస్ రెడ్డిని, టేకు లక్ష్మి అత్యాచార, హత్య ఘటన నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేయాలని తెలంగాణలో ఆందోళనలు జరుగుతున్నాయి.