దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తంటా: ఆ రెండు సంఘటనలపై ఆందోళనలు

దిశ కేసు నిందితుల ఎన్ కౌంటర్ తో తెలంగాణలో ఇంతకు ముందు జరిగిన అత్యాచార, హత్యల సంఘటనలు తెర మీదికి వచ్చాయి. ఈ ఘటనల్లో నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేయాలని ఆందోళనలు జరిగాయి.

Disha case accused encounter: Hajipur villagers stage dharna

హైదరాబాద్: దిశ రేప్, హత్య కేసు నిందితుల ఎన్ కౌంటర్ తెలంగాణ ప్రభుత్వానికి లేదంటే, తెలంగాణ పోలీసులకు తంటా తెచ్చిపెడుతోంది. తెలంగాణలో చోటు చేసుకున్న రెండు తీవ్రమైన నేరాల సంఘటనలు తెర మీదికి వచ్చాయి. దిశ హత్య కేసు నిందితులకు వేసిన శిక్షలే ఆ రెండు కేసుల్లో నిందితులకు వేయాలని ప్రజలు వీధికెక్కారు. 

హజీపూర్ జరిగిన వరుస అత్యాచారాలు, హత్యల కేసుల్లో నిందితుడు మర్రి శ్రీనివాస్ రెడ్డిని కూడా ఎన్ కౌంటర్ చేయాలని గ్రామంలోని బాధిత కుటుంబాలకు చెందినవారు, గ్రామ ప్రజలు డిమాండ్ చేశారు. శ్రీనివాస్ రెడ్డిని ఎన్ కౌంటర్ చేయాలని నినాదాలు చేస్తూ హజీపూర్ లో ఆందోళనకు దిగారు. 

యాదాద్రి భువనగిరి జిల్లా బొమ్మల రామారం మండంలోలని హజీపూర్ లో విద్యార్థినులపై అత్యాచారాలు, హత్యలు చేసి, శవాలను బావుల్లో పూడ్చి పెట్టిన కేసుల్లో శ్రీనివాస్ రెడ్డి నిందితుడు. దిశ సంఘటన జరిగిన తొమ్మిది రోజుల్లోనే నిందితులను ఎన్ కౌంటర్ చేసిన ప్రభుత్వం హజీపూర్ ఘనటను ఎందుకు తీవ్రంగా పరిగణించడం లేదని ఆందోళనకారులు ప్రశ్నించారు. ఈ నిరసనలో గ్రామ ప్రజలతో పాటు బాధిత కుటుంబ సభ్యులు, హజీపూర్ గ్రామ సర్పంచ్ తిరుమల కవిత వెకటేష్ గౌడ్ పాల్గొన్నారు.

మరోవైపు కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లాలో చెంచు మహిళ టేకు లక్ష్మిని రేప్ చేసి, హత్య చేసిన నిందితులను కూడా ఎన్ కౌంటర్ చేయాలని ఆదివాసీ, దళిత, మైనారిటీ, విద్యార్థి సంఘాలు ర్యాలీ నిర్వహించాయి. దీంతో పాటు జైనూర్, లింగాపూర్, సిర్పూర్  యూ ప్రాంతాల్లో బంద్ ను చేపట్టారు. 

టేకు లక్ష్మి ఘటనలోని నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని జైనూర్ లో రాస్తారోకో నిర్వహించారు. వివిధ సంఘాల నాయకులు ర్యాలీ నిర్వహించారు. నిందితులను ఎన్ కౌంటర్ చేయాలని డిమాండ్ చేశారు. జైనూర్ లోని మార్కెట్ లో కూడా బంద్ నిర్వహించారు. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios