Asianet News TeluguAsianet News Telugu

'జన్‌ధన్‌' పథకం పై వ్యంగ్యాస్త్రం : 'భీమదేవరపల్లి బ్రాంచి' రివ్యూ

 అనుకోకుండా తమ ఖాతాలో పెద్ద మొత్తంలో డబ్బులు పడితే, ప్రభుత్వాలు ఇచ్చాయనుకుని.. ఖర్చు చేసేస్తే ఆ తర్వాత తలెత్తిన పర్యవసానాలు ఏమిటన్నది ఈ ‘భీమదేవరపల్లి బ్రాంచి’ సినిమా మెయిన్ పాయింట్. 

Ramesh Cheppala Bheemadevarapally Branch Movie Review
Author
First Published Jun 23, 2023, 3:33 PM IST


'బలగం' తర్వాత తెలంగాణా పల్లెను రిప్రజెంట్ చేస్తూ వచ్చిన  సినిమా 'భీమదేవరపల్లి బ్రాంచి'. తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన సినిమా కావడం, ట్రైలర్ చూడగానే మంచి విషయముంది అనిపించడం సినీ ప్రియుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ సినిమా ఎలా ఉంది? మరో 'బలగం' అవుతుందా?...లేదా చూద్దాం.

స్టోరీ లైన్

తెలంగాణాలో భీమదేవరపల్లి అనే చిన్న ఊరు. అక్కడ జంపన్న (అంజి) తన తల్లి ,పెళ్లాంతో ప్రశాంతంగా తనదైన జీవితాన్ని జీవిస్తూంటాడు. కొద్దిగా అప్పులు..మరికొద్ది ఊరి పెద్దల పెత్తందారీతనం ఉన్నా అవి పెద్దగా బాధపెట్టవు. తన తల్లి సమ్మక్క(రాజవ్వ)కు ఓ రోజు బ్యాంక్ ఎక్కౌంట్ లో 15 లక్షలు పడతాయి. అయితే హఠాత్తుగా అంత డబ్బు పడటంతో ఎక్కడివి ఆలోచనలో ఉండగా ఆ ఊరువాళ్లో చదువుకున్న ఒకడు..కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్‌ పథకం వల్లే నీకు పడ్డాయంటాడు. అక్కడ నుంచి జంపన్న జీవితం మారిపోతుంది. మొత్తం డబ్బు డ్రా చేసి ఖర్చు పెట్టేస్తాడు. ఊళ్లో అందరి ఎదురుగా బిల్డప్ లు ఇస్తాడు. అప్పులు తీరుస్తాడు. కొత్త వ్యాపారం పెడదామని మిగిలిన డబ్బుని పెట్టుబడిగా పెడతాడు. అయితే ఆ వ్యాపారం పెట్టిస్తానన్న వాడు (నవీన్) ఆ డబ్బు పట్టుకుని మాయమవుతాడు. చేతిలో చిల్లిగవ్వలేదు. ఈ లోగా మరో వార్త..ఆ డబ్బుని ఏ ప్రభుత్వం ..ఏ పథకం పేరు చెప్పి అతని పేర వెయ్యలేదు. బ్యాంక్ ద్వారా జరిగిన పొరపాటు అది. దాంతో ఆ బ్యాంక్ వాళ్లు వచ్చి మొత్తం 15 లక్షలు కక్కమని కూర్చుంటారు. చేతిలో పైసా కూడా మిగలని జంపన్న పరిస్దితి ఏమైంది...చివరకు ఈ కథ ఎలా ముగిసింది అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.

ఎలా ఉంది..

తెలంగాణా నుంచి వరస పెట్టి చిన్న సినిమాలు వచ్చి విజయవంతమవుతున్నాయి. జాతిరత్నాలు నుంచి మొదలెట్టి రీసెంట్ గా బలగం, పరేషాన్ దాకా వరసగా తెలంగాణా పల్లె వాసనను, అక్కడ జనాల జీవితాలను చెప్తూ సినిమాలు వస్తున్నాయి. అయితే కేవలం అవి అన్ని తెలంగాణా నేపధ్యం వల్లే వచ్చి సక్సెస్ అవుతున్నాయంటే ఉత్తిమాటే. బలమైన కథ, కథనం, భావోద్వేగాలు..అక్కడ జనం కనెక్ట్ అయ్యేందుకు దోహదం చేస్తేనే వర్కవుట్ అవుతాయి. ఈ సినిమా... కేంద్రప్రభుత్వం ప్రారంభించిన జన్‌ధన్‌ పథకం ఓ గ్రామంలో ఓ పేదవాడి జీవితాన్ని, ఆ కుటుంబాన్ని ఏ విధంగా విపత్తుల పాలు జేసింది, వారి ప్రశాంతమైన జీవితాలను ఏ విధఃగా అల్లకల్లోలం చేసిందీ అనే పాయింట్ చుట్టూనే తిప్పారు. ఫస్టాఫ్ లో బ్యాంక్ ఎక్కౌంట్ లో డబ్బు పడటం, ఇంటర్వెల్ దగ్గరకు వచ్చేసరికి అసలు విషయం తెలియటం దాకా బాగానే పరుగెట్టింది. అయితే సెకండాఫ్ దగ్గరకు వచ్చేసరికే సినిమా ఆ పరుగు ఆపేసింది. ఎమోషన్స్ వైపు టర్న్ తీసుకుంది. క్లైమాక్స్ అయితే మరీను. అయితే ఇలాంటి సినిమాలకు ఎంతవరకూ కథను ఆసక్తికరంగా చెప్పాం...ఎంత, ఉత్కంఠభరితమైన మలుపులతో కథను పరుగెట్టించాం...ఎమోషనల్‌గా పట్టిందా లేదా అనేదే ముఖ్యం. ఎందుకంటే ఇందులో పెద్దగా తెలుసున్న ఆర్టిస్ట్ లు కనపడరు. కేవలం కథే ప్రధానం. అయితే  హీరోకు తను ఖర్చు పెట్టిన డబ్బు బ్యాంక్ వారిది అని తెలిసిన తర్వాత హీరో ఏం చేయలేని నిశ్సహాయ పరిస్దితి. బాథ పడటం తప్ప ఏమీ చెయ్యలేడు. బ్యాంక్ వాళ్లు చేసిన పొరపాటుకు తను బలి అయ్యిపోతున్నా ప్యాసివ్ గా చూస్తుండి పోతాడు. నిజ జీవితంలో అంతే అయ్యిండవచ్చు. ఏమీ చెయ్యలేకపోవచ్చు. కానీ తెరపై సగటు ప్రేక్షకుడు ఏదో ఒకటి జరగాలని ఆశిస్తాడు.అది అక్కడ జరగదు. అయితే కథ ప్రవాహం , డైలాగులు సహజంగా వెళ్తుండంతో ఇది లోపంగా కనిపించకపోవచ్చు.

 దర్శకత్వం..మిగతా విభాగాలు

 దర్శకుడు రమేష్‌ చెప్పాల సినిమాను సహజత్వానికి దగ్గరగా ఉండేలా  కథ రాసుకున్నాడు. తీసాడు అక్కడ దాకా అభినందనీయం. అందులోనూ తనకున్న పరిమిత బడ్జెట్ లోనే సినిమాని చేసారని అర్దమవుతుంది. ఆ మేరకు మంచి క్వాలిటీ ఇచ్చినట్లే. అలాగే ఆర్టిస్ట్ ల నుంచి ఫెరఫార్మెన్స్ తీసుకున్నారు. ఫన్ సీన్స్ , ఎమోషన్ సీన్స్ బాగా పండించారు. అతనితోని దర్శకుడు సక్సెస్. రైటింగ్ ఇంకాస్త మెరుగ్గా ఉంటే బావుండేది. పీతి బావి వంటి సీన్స్ తగ్గించి ఉంటే బాగుండేది. తెరపై అంతసేపు వాటిపై డైలాగులు ,సీన్స్ చూడటం కష్టమైంది. మిగతా విభాగాల్లో కెమెరా వర్క్ బాగుంది. పల్లెను సహజంగా కెమెరా పట్టుకుంది. పాటలు కూడా సినిమాకు ప్లస్ అయ్యాయి. సినిమా సెకండాఫ్ లో కంటెంట్ లేకున్నా చూడగలిగామంటే అది ఎడిటర్ ప్రతిభే. ఉన్నంతలో షార్ప్ గా చేసి పరుగెట్టించే ప్రయత్నం చేసారు. ప్రొడక్షన్ వాల్యాస్ బిలో యావరేజ్. అతి తక్కువలో తీసినట్లున్నారు.
 
నటీనటుల్లో ...బలగం చిత్రంలో నటించి పాప్యులారిటీ సాధించిన కొందరు నటీనటులు, కొత్తనటులు ఈ సినిమాలో చాలా మంది కనడతారు. ప్రధాన  పాత్ర జంపన్న చేసిన అంజిబాబు బాగా చేసారు. అలాగే కల్లు  పాకలో కనిపించే ఆమె (పేరు తెలియదు) బాగా చేసారు. 

ఫైనల్ థాట్

  ఈ సినిమాకు బలం..ఎమోషన్స్ ..ఫన్..సెకండాఫ్ ఇంకాస్త బలంగా ఉండుంటే మరో బలంగం అయ్యిండేది..అయినా చూడచ్చు.  
---సూర్య ప్రకాష్ జోశ్యుల
Rating:2.5
 


నటీనటులు : సుధాకర్ రెడ్డి,కీర్తి లత, అభి, రూప, అంజి బాబు,రాజవ్వ, శుభోదయం సుబ్బారావు, సి. ఎస్.ఆర్. వివ రెడ్డి, పద్మ, ప్రసన్న,మానుకోట ప్రసాద్,గడ్డం నవీన్, తాటి గీత మల్లికార్జున్, మహి, వల్లి సత్య ప్రకాష్, మహేష్ తదితరులు
కెమెరా: చిట్టి బాబు. 
సంగీతం: చరణ్ అర్జున్, 
సాహిత్యం:సుద్దాల అశోక్ తేజ.
ఎడిటర్: బొంతుల నాగేశ్వర్ రెడ్డి. 
పబ్లిసిటీ డిజైనర్: ధని ఏలే
ఆర్ట్: మోహన్
రచన-దర్శకత్వం: రమేశ్ చెప్పాల.
నిర్మాతలు: బత్తిని కీర్తిలత గౌడ్,రాజా నరేందర్ చెట్లపెల్లి
విడుదల తేదీ:  23, జూన్ 2023

Follow Us:
Download App:
  • android
  • ios