Asianet News TeluguAsianet News Telugu

బాల్యాన్ని తిరిగి అందించిన "అమ్మమ్మ గారి ఊరు" దీర్ఘకవిత

ఎస్.ఆర్. పృధ్వి దీర్ఘకవిత  'అమ్మమ్మ గారి ఊరు'  పైన  విశాఖపట్నం నుండి డా. కె.జి. వేణు రాసిన సమీక్ష ఇక్కడ చదవండి :

Telugu Long Poem Written by SR Prithvi AKP
Author
First Published Aug 20, 2023, 10:26 AM IST

కాలాన్ని వెనక్కి నడిపించటం ఒక్క సాహితీవేత్తకే సాధ్యమని నిరూపించి, పాఠకులకు తిరిగి వాళ్ల బాల్యాన్ని అందించిన దీర్ఘకవిత 'అమ్మమ్మ గారి ఊరు'.  ఎస్. ఆర్. పృధ్వి జగమెరిగిన సాహితీవేత్త, అసంఖ్యాకమైన విలువైన సాహితీ సంపదని అందించిన నేపథ్యం ఆయనిది. బాల్యం అందరికీ అపురూపమైనదే.  ఆ జ్ఞాపకాల్లో మెరుపులా మెరిసే మహామనిషి మన 'అమ్మమ్మ'.  తాతయ్య, అమ్మమ్మ, మామయ్యలుండే ఊరికి ఒక పేరున్నా, పిల్లలు మాత్రం ఆ ఊరును  'అమ్మమ్మ గారి ఊరు' అంటారు.  బాల్యానికి స్వర్గం అక్కడే వుంటుంది. వరాలిచ్చే దేవతలందరూ ఒకే రూపంలోకి మారిపోతే, ఆ రూపమే అమ్మమ్మ. అందుకే బాల్యంలో మనమంతా వరాలకోసం అమ్మమ్మ ముందు అల్లరి తపస్సులు చేసిన వాళ్లమే.  ఎస్. ఆర్. పృధ్వి అందించిన దీర్ఘకవిత తన జోడెడ్ల బండిలో బాల్యాన్ని తిరిగి పొందటానికి పాఠకులందర్ని సాదరంగా, ప్రేమ పూర్వకంగా అమ్మమ్మ గారి ఊరికి తీసికెళ్లుతోంది. మరి ఆలస్యం దేనికి? రండి! ఆ ప్రయాణంలో మనమూ భాగస్వాములవుదాం.

బండి దిగి అడుగు పెట్టగానే ఎదురుగా గోదావరి తల్లి, దగ్గరికి వెళ్లితే వేదంలా ఆ నది ఘోషిస్తోంది. సమయం సాయం సంధ్య, ఆకాశంలో ఎర్రటి సూర్యబింబం తన  కిరణాలతో కరచాలనం చేస్తూ తన ప్రయాణాన్ని, పడమటివైపుకు సాగిస్తోంది. రెండు తీరాలను కలుపుతూ 'హేవలాక్' వృద్ధ వంతెన. దాన్ని చూడగానే దాని వొంటిమీద తెల్లదొరల గుర్తులున్నాయి.  అప్పుడప్పుడు గోదావరి స్టేషనుకు వచ్చే పాసింజరు రైలు బండిని ఈ దీర్ఘకవితలో మనం చూస్తున్నాం. ఎక్కడో కొండలు పగులుతున్న శబ్దం... కాదు, కాదు అది ఈ రైలు కూతని ఆ వెంటనే తెలిసింది.  బాల్యానికి రైలుబండి కంటే తీరాన్ని చేర్చే లాంచీ అంటేనే ఇష్టం. నీళ్లు వెనక్కి, పడవ ముందుకు వెళ్లే దృశ్యం‌.  ఏ చిత్రకారుడు గీయలేని ఓ అపురూప రంగుల చిత్రం. అందులోకి తొంగిచూస్తున్న పిల్లల నేత్రాలు మాత్రం పోటీపడి ఆ చిత్రాలను కనురెప్పల మధ్య సొంతం చేసుకుంటూ వుంటాయి. నీటిలో వెళ్తున్న లాంచీని చూస్తూవుంటే సరదాగా ప్రయాణించే సొరచేప గుర్తుకొస్తుంది. నిజమే పడవ రూపంలో ఉన్న ఆ సొరచేప వీపుమీద చేసే ప్రయాణం అంతరిక్ష ప్రయాణం కంటే గొప్పదని గోదావరి జలాలు సైతం సాక్ష్యం చెబుతున్నాయి.

అనుకున్న ఊరు చేరాలంటే ఇంకా ఆరు కిలోమీటర్లు వెళ్లాలి. మూడు చక్రాలతో రిక్షా మౌనంగానే ఆహ్వానం పలికింది. దారి దారిద్య్రాన్ని ఎత్తిచూపుతూ అడుగులోతు గుంతలు, మేమున్నామంటూ అడుగడుగునా పలకరించే కంకరరాళ్లు, రోడ్డు ప్రయాణంలో కూర్చున్న వాళ్లను గాల్లోకి ఎగరేస్తూ ఆడుకున్న సరదాలు, వొళ్లు నొప్పులను కానుకల్లా అవి అందించినా, ఆ అనుభూతులు మాత్రం జీవితం తాళపత్రాల మీద తప్పకుండా లిఖించతగినవే.  దిగండి. దిగండి... అమ్మమ్మ గారి ఊరు వచ్చేసింది.  ఈ ఊరు పుట్టినప్పుడు పెట్టిన పేరు 'కుమారదేవం'. ఏ పేరు పెడితే మనకెందుకు? మనకు మాత్రం ఇది 'అమ్మమ్మ గారి ఊరు' అంతే. నాలుగడుగుల్లో అమ్మమ్మ ఇల్లు వచ్చేసింది.

పేడతో అలికి, ముగ్గుపెట్టిన ఆ నేలమీద కాలుపెట్టే భాగ్యానికి ఈ జన్మ ఎన్ని తపస్సులు చేసుకుందో. దాహం  కోసం నీళ్లు త్రాగితే, గోదావరి నీళ్లు గొంతును కాదు, ఆప్యాయంగా గుండెను తడుముతున్నాయి.  భోజనం వేళయిందని అల్యూమినియం పోతకంచం చేయిలాగి మరీ కూర్చోపెట్టింది. తాత గారిది నేత కుటుంబం. అమ్మమ్మ, తాతయ్య ప్రక్క ప్రక్కనే కూర్చున్నారు. వాళ్ల అరచేతుల్లోని గీతలను చూస్తే వాళ్ల పేర్లు మల్లన్న, భ్రమరాంబలని తెలిసి మనసు చప్పట్లకు సిద్ధమయింది. ఇంట్లో మూడు మగ్గాలు, యోధుల్లా బట్టలు నేయటానికి సిద్ధంగా వున్నాయి. గుమ్మం ముందు ముసి, ముసి నవ్వులతో పడుగులు. నూలు దారాలకు జీవం పోస్తే 'తెల్లటి పంచెలు పురుడు పోసుకుంటున్నాయి. ముట్టుకుంటే మల్లెపువ్వుల్లా వున్నాయి. పడుగు పేకల్ని సంధించే 'కండి' చూపించే నైపుణ్యం ముందు,  ప్రపంచంలోని కళాత్మక విలువలన్నీ సాష్టాంగ సమస్కారాలు చేయవలసిందే. ఆ దృశ్యాలన్నీ అనుభూతి కావ్యానికి నేరుగా రంగాన్ని సిద్ధం చేసుకుంటున్నాయి.

మామయ్య సైకిల్ స్వారీలో  వెనక సీట్లో కూర్చుని వెళ్లటమంటే, బంగారు రథంలో వీధుల్లో ఊరేగినట్లే. కాఫీ హోటల్ దగ్గర చిన్న మజిలీ. అల్లం, జీలకర్ర అదనంగా దట్టించిన పెసరట్లు ఆరగించటం, బాల్యం చేసుకునే ఓ భాగ్యం.  పెరట్లో బంతి, సీమబంతి మొక్కల్ని చూసినప్పుడు, ఇంట్లో బంగారం మొలకెత్తిందా? అన్నట్లు వుండేది. నూతినీళ్లు తోడినప్పుడల్లా మీదపడ్డ ఆ చల్లదనం, వెంటనున్న బాల్యానికి స్నేహ హస్తం అందించేది. అమ్మమ్మ కాచిన చోడిపిండి జావ త్రాగినప్పుడల్లా లెక్కల్లో మరో రెండు వసంతాలు అదనంగా ఆయువు ఖాతాలో చేరిపోయేవి. గోళీకాయలు, గూటీబిళ్ళ, త్రిప్పితే గిర గిరా తిరిగే బొంగరం... ఈ ఆటలు ఆడుకోవటానికే కాదు, భవిష్యత్తులో మనం వృద్ధాప్యంతో ఒంటరిగా మిగిలిపోతే  మనతో జతకట్టేందుకు తాము సిద్ధమంటూ హామీపత్రాలు రాసి ఇస్తున్నాయి. మిరపతోటలో పరిగెత్తటమంటే, పరుగుపందెంలో విజేత పతకాన్ని పొంది పరిగెత్తినట్లే.  కుమ్మరికొలిమి అధినేత ఎవరో తెలుసా? మరెవరు నారాయణ తాత. ఆయన చేతుల్లో మట్టి బంగారమవుతుంది. తాత పుట్టుకతోనే అంచనాలకు మించిన కళాకారుడు.

రాత్రి భోజనాల తంతు ముగిసింది. కానీ అల్లరి రీల్స్ ఇంకా తిరుగుతూనే వున్నాయి. ఇంతలో ప్రొద్దుపోయింది పడుకోమని పిలుపులు. కథలు వింటూ మైమరచిన బాల్యం గాఢ నిద్రలో, ప్రేమతో అమ్మమ్మ తాకిన ఆ చేతి స్పర్శకు ఉల్లిక్కిపడి తెరిచిన తన కళ్ళకు అమ్మమ్మ చిరునవ్వు...తనను ఉయ్యాలలో ఊపినట్లుగా వుంది. ఊర్లో ఏ వీధుల్లోకెళ్లినా ప్రశాంతతే. పచ్చదనానికి ఆ ఊరినేల అంకితమైనట్లు వుంటుంది. ఉదయాన్నే కోకిలమ్మల పాటకచేరీ విరామం లేకుండా సాగుతూనే వుంటుంది. చిత్రంగా అమ్మమ్మ గారి ఊరి చెరువు చేపలు, పిల్లలకు ఈతలో మెలుకువ పాఠాలు బోధిస్తూ వుంటాయి. ఊరి అవసరాలు తీర్చే కిరాణా దుకాణాలు, పాకలో నడిచే చిన్న హోటలు, గ్రామ సావిడి... ఇవన్నీ మనుషుల మధ్య మానవసంబంధాలకు తివాసీలు పరుస్తూ వుంటాయి. దేవుడి గుడిలో గంట మ్రోగినప్పుడల్లా ఆధ్యాత్మిక నాదం, దేవుడి తిలకంలా అందరి నుదుట మెరుస్తూ వుంటుంది. ఉత్సవాలు, ఊరేగింపులతో  భక్తితత్వ పరిమళాలు ఇంటింటికి పంచబడతాయి.

కాలం చెల్లిన మనుషుల నిష్క్రమణతో, వాళ్ల జ్ఞాపకాలు మాత్రమే గుర్తుల్లా మిగిలిపోయాయి.  ఐదు దశాబ్దాల తరువాత ఊరు 'కుమారదేవం' తన దేహంనిండా చాలా మార్పులతో వింతగా కనిపిస్తోంది. ఊరి ముఖచిత్రం నిండా అభివృద్ధి చిత్రపటాలే. గోదావరి అప్పటిలాగే ప్రహిస్తూ వుంది. త్రాగేందుకు నీళ్లు చేతుల్లోకి తీసుకుంటే బాగున్నావా! అంటూ అమ్మమ్మ పలకరించినట్లుగా వుంది. ఆ ప్రక్కన అప్పటి మర్రిచెట్టు తన ఊడలతో తాతగారిలా కనపడుతోంది. అమ్మమ్మ గారి ఊరు, మన ఆత్మీయ పొరల్లో సజీవంగా ప్రవహించే ఓ సెలయేరు. అందులోకి తొంగి చూసినప్పుడల్లా గడిచిపోయిన బాల్యం మనకోసమే తాను ఉన్నట్లు చేతులు సాచి ఆహ్వానిస్తూ వుంటుంది. కవి ఎస్.ఆర్. పృధ్వి కలం అందించిన 'అమ్మమ్మ గారి ఊరు' దీర్ఘకవిత, అద్భుతమైన అనుభూతులను అందించే ఓ సాహిత్య భాండాగారం. సుదీర్ఘకాలం తెలుగు సాహిత్యంలో ఈ దీర్ఘకవిత తన ప్రస్థానాన్ని కొనసాగిస్తూ మరెన్నో దీర్ఘకవితల సృజనానికి ప్రేరణగా నిలుస్తుందని ఆశిద్దాం. ఈ సందర్భంగా కవి ఎస్.ఆర్. పృధ్వికి సాహితీలోకం తరుపున హృదయపూర్వక అభినందనలు.

ప్రచురణ: ఏఫ్రిల్, 2023
పేజీలు : 32
వెల : 20/-
ప్రతులకోసం :
శ్రీమతి పి. ఉషారాణి , 104-6-140, ఎం.జి. స్ట్రీట్ ,
రామకృష్ణ నగర్ , రాజమహేంద్రవరం- 533 101
సెల్ : 94927 04750.

Follow Us:
Download App:
  • android
  • ios