పెళ్లైన కొత్త దంపతులు జీవితాన్ని ఆస్వాదించాలని అనుకుంటారు. ఈ క్రమంలో.. కొంత కాలం వరకు పిల్లలు పుట్టకుండా ఉంటే బాగుండని భావిస్తుంటారు. అలా అని శారీరకంగా కలవకుండా ఉండలేరు కదా. ప్రత్యామ్నాయంగా... గర్భనిరోధక మాత్రలను వాడుతుంటారు. అయితే... ఈ మాత్రల వల్ల చాలా సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.

వాటికి బదులు పురుషులు కండోమ్, స్త్రీలు సేఫ్ రిథమ్ ఉపయోగించవచ్చని చెబుతున్నారు. వీటి ద్వారా శృంగార జీవితాన్ని మనసారా ఆస్వాదించే అవకాశం ఉంటుందని వారు చెబుతున్నారు.

బజార్లో ఎన్నో రకాల కండోమ్‌లు దొరుకుతున్నాయి. వాటిలో ఏదో ఒకటి కొని వాడేయకుండా, కొనేముందు వాటి లేబుల్‌ చదవాలి. లేటెక్స్‌తో తయారైన కండోమ్‌లు చిరిగే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పాలీ యుథెరీన్‌తో తయారైన కండోమ్‌లనే ఎంచుకోవాలి.
 
సేఫ్‌ రిథమ్‌: నెలసరి కచ్చితంగా, క్రమం తప్పకుండా 28 నుంచి 30 రోజులకు వచ్చే అమ్మాయిలు సేఫ్‌ రిథమ్‌ పద్ధతిని ప్రయత్నించవచ్చు. దీన్ని పాటించేటప్పుడు ఎలాంటి కుటుంబ నియంత్రణ పద్ధతులూ పాటించాల్సిన అవసరం లేదు. సేఫ్‌ పీరియడ్‌ అంటే.. నెలసరి మొదలయిన తేదీ నుంచి ఎనిమిదో రోజు వరకూ, 18వ రోజు నుంచి తిరిగి నెలసరి కనిపించేవరకూ గర్భధారణకు వీలులేని సమయం. 

ఈ రోజుల్లో సెక్స్‌లో పాల్గొన్నా గర్భం వచ్చే అవకాశాలు చాలా తక్కువ. ఇక మిగతా రోజులైన, నెలసరి వచ్చిన 8వ రోజు నుంచి 18వ రోజు వరకూ ఎప్పుడైనా అండాలు విడుదలయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ రోజుల్లో కండోమ్‌ లేకుండా కలవకూడదు. అయితే, ఈ సేఫ్‌ రిథమ్‌ పద్ధతిని నెలసరి క్రమం తప్పకుండా ఒకే సమయానికి వచ్చే మహిళలే అనుసరించాలి.