ప్రేమికులు సరదాగా పార్టీలకు, షికార్లకు వెళ్లడం సర్వసాధారణమే. ఓ వ్యక్తి తన ప్రేయసిని డేటింగ్ కి తీసుకొని వెళ్లాలని సరదా పడ్డాడు. అయితే.. సదరు ప్రియురాలు తానొక్కతే వెళ్లకుండా.. తన వెంట 23మంది తన స్నేహితురాళ్లకు కూడా తీసుకువెళ్లింది. ఇంకేముంది వాళ్లందరినీ చూసి అతని గుండె ఆగినంత పని అయ్యింది. వాళ్లందరూ తిన్న బిల్లు చూసి మెల్లగా అక్కడి నుంచి జారుకున్నాడు. ఈ సంఘటన చైనాలో చోటుచేసుకోగా.. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

చైనాలోని జోజియాంగ్  ప్రాంతానికి చెందిన ఇద్దరు యువతీ యువకులు సోషల్ మీడియాలో పరిచయాలు పెంచుకున్నారు. వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. దానిని నెక్ట్స్ లెవల్ కి తీసుకువెళ్లడానికి  ఇద్దరూ కలిసి డేటింగ్ కి వెళదామని అనుకున్నారు. అందుకోసం ఓ రెస్టారెంట్ కి వెళ్లాలని కూడా డిసైడ్ అయ్యారు. 

అక్కడే వారిద్దరూ తొలిసారిగా ముఖాముఖీగా చూసుకోవాలనుకున్నారు. ఆ యువకుడు అనుకున్న సమయానికే రెస్టారెంట్‌కు చేరుకుని, ఆమె రాకకోసం వేయి కళ్లతో ఎదురు చూడసాగాడు. ఇంతలో అతని ప్రేయసి తన ఇరవైమూడు స్నేహితులు, బంధువులను వెంటేసుకుని రెస్టారెంట్‌కు వచ్చింది. అందరూ అనందంగా కలుసుకుని కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ భారీగా విందు లాగించారు. 

ఇంతలో వెయిటర్ బిల్లు తీసుకువచ్చి, ఆ యువకునికి అందజేశాడు. ఆ యువతితో పాటు ఆమె బ్యాచ్ అంతా అంతా తిన్న ఆహారానికి సుమారు 19800 యునాన్లు (మన కరెన్సీలో రూ.2 లక్షల 17 వేలు)  బిల్లు వచ్చింది.దానిని చూసిన ఆ యువకునికి కళ్లు తిరగినంత పనయ్యింది. అంతే చుట్టుపక్కల ఉన్న ఎవరినీ పట్టించుకోకుండా చెంగున దూకుతూ అక్కడి నుంచి పరారయ్యాడు. 

ఈ సందర్భంగా ఆ యువతి మాట్లాడుతూ తాను... తన ప్రియుడు తొలిసారిగా కలుసుకునేందుకు బ్లయిండ్ డేట్‌కు ప్లాన్ చేసుకున్నామని, తాను ఇరవైముగ్గురిని వెంటేసుకుని రెస్టారెంట్‌కు వెళ్లానని, అయితే తామంతా తిన్న ఆహారానికి ఆ యువకుడు బిల్లు కట్టలేక అక్కడి నుంచి పరారయ్యాడని తెలిపింది. ఫలితంగా తామే ఆ బిల్లును చెల్లించి, రెస్టారెంట్ నుంచి ఎలాగోలా బయటపడ్డామని పేర్కొంది. ఈ ఘటన జరిగిన తరువాత ఆ యువతి... ఆ యువకునిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆ యువకుడు చేసేదేమీ లేక తన స్థాయికి తగినట్టు కేవలం రెండు టేబుళ్ల బిల్లు చెల్లించేందుకు ముందుకువచ్చాడు.