అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ తీరు విస్మ‌యానికి గురి చేస్తోంది. భార‌త్ మిత్ర దేశం అంటూనే సుంకాల‌తో విరుచుకుప‌డుతున్నారు. తాను చెప్పిన‌ట్లు విన‌క‌పోతే ఇంతే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తాజాగా మ‌రో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. 

DID YOU
KNOW
?
ట్రంప్ స‌మ‌స్య ఏంటి.?
భార‌త్‌పై ట్రంప్ సుంకాలు పెంచ‌డానికి ఏకైక కార‌ణం చ‌మురు కొనుగోళ్లు. భార‌త్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేయ‌డాన్ని ట్రంప్ వ్య‌తిరేకిస్తున్నారు.

రష్యా నుంచి చమురు కొనుగోలు చేస్తున్న భారత్‌పై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మళ్లీ విమర్శలు గుప్పించారు. 24 గంటల్లోనే భారత్‌పై అదనపు సుంకాలు విధించనున్నట్లు ఆయన హెచ్చరించారు. భారత్‌ వాణిజ్య భాగస్వామిగా సక్రమంగా వ్యవహరించడం లేదని ట్రంప్ ఆరోపించారు. "వారు మాతో వ్యాపారం చేస్తున్నారు కానీ మేము వారితో చేయడం లేదు. అందుకే సుంకాలను పెంచాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా వారు రష్యా చమురు కొనుగోలు చేసి యుద్ధానికి పరోక్షంగా మద్దతు ఇస్తున్నారు" అని సీఎన్‌బీసీ ఇంటర్వ్యూలో ట్రంప్ అన్నారు.

ఇప్పటికే 25 శాతం సుంకం

గత వారం అమెరికా ప్రభుత్వం భారతీయ వస్తువులపై 25 శాతం సుంకం విధించింది. అయినప్పటికీ ట్రంప్ ఈ చర్యను సరిపడదని పేర్కొంటూ మరింత పెంచుతామ‌ని ప్రకటించారు. భారత్, రష్యాను "మృత ఆర్థిక వ్యవస్థలు" అని అభివర్ణించిన ట్రంప్ వ్యాఖ్యలు రెండు దేశాలపై ఉద్రిక్తతను మరింత పెంచాయి.

స్పందించిన భార‌త్

అమెరికా చేస్తున్న విమర్శలకు భార‌త్‌ గట్టి సమాధానం ఇచ్చింది. రష్యా చమురు కొనుగోలు విషయంలో ప్రత్యేకంగా తమను మాత్రమే ఎందుకు లక్ష్యంగా చేసుకుంటున్నారని అమెరికా, యూరోపియన్ యూనియన్‌ను ప్రశ్నించింది. ఉక్రెయిన్ యుద్ధం కొనసాగుతున్నప్పటికీ పశ్చిమ దేశాలే రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగిస్తున్నాయని భారత్ గుర్తు చేసింది. "రష్యాతో వ్యాపారం చేస్తున్నప్పుడు మేము తప్పు చేస్తున్నట్టు ఎందుకు చూపిస్తున్నారు?" అని భారత ప్రతినిధులు స్పందించారు.

రష్యా భారత్‌కు బలమైన మద్దతు

భారత్‌పై ఒత్తిడి తీసుకువస్తున్న ట్రంప్‌ వ్యాఖ్యలపై రష్యా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. "తమ వాణిజ్య భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ భారత్‌కే ఉంది. అమెరికా ఒత్తిడి చేయడం తగదు" అని రష్యా ప్రభుత్వ ప్రతినిధి డిమిత్రీ పెస్కోవ్ అన్నారు. ఇలాంటి ప్రకటనలు అంతర్జాతీయ చట్టాలకు విరుద్ధమని ఆయన స్పష్టం చేశారు.

అణు ఒప్పందం నుంచి తప్పుకున్న రష్యా

ఉక్రెయిన్ యుద్ధం, అమెరికా ఒత్తిడి, అణు జలాంతర్గాముల మోహరింపుతో రష్యా అసహనం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో 1987లో అమెరికాతో కుదిరిన ‘ఇంటర్మీడియేట్ రేంజ్ న్యూక్లియర్ ఫోర్సెస్ (INF)’ ఒప్పందం నుంచి తప్పుకుంటున్నట్లు రష్యా ప్రకటించింది. పశ్చిమ దేశాల చర్యలు తమ జాతీయ భద్రతకు ముప్పు కలిగిస్తున్నాయని రష్యా విదేశాంగ శాఖ ఆరోపించింది.