hijab protests: ఇరాన్‌లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు తీవ్రం కావడంతో ఇంటర్నెట్ సర్వీసులు నిలిపివేశారు. పెద్ద ఎత్తున చెలరేగుతున్న ఆందోళనల్లో ఇప్పటివరకు 31 మంది ప్రాణాలు కోల్పోయారని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. 

Anti-hijab protests rage in Iran: ఇరాన్ లో హిజాబ్ వ్యతిరేక ఆందోళనలు క్రమంగా పెరుగుతూనే ఉన్నాయి. పోలీసు కస్టడీలో మహ్సా అమినీ మరణంపై ఇరాన్‌లోని 30 నగరాల్లో హిజాబ్ వ్యతిరేక నిరసనలు చెలరేగాయి. ఈ క్రమంలోనే పోలీసుల అణిచివేతలో 31 మంది మరణించారు. పోలీసు అణచితేత చర్యలు కొనసాగుతున్నప్పటికీ మహిళలు, యువతులు వెనక్కి తగ్గడం లేదు. పోలీసులు తీరును ఖండిస్తూ.. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. మోరాలిటీ పోలీసులచే లాఠీతో కొట్టబడిన 22 ఏళ్ల మహ్సా అమిని మరణం పట్ల కోపంతో రగిలిపోతున్న ఇరాన్ మహిళలు, యువతులు పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. ఇస్లామిక్ రిపబ్లిక్‌కు వ్యతిరేకంగా మహిళలు తమ హిజాబ్‌లను తగలబెట్టడం.. బహిరంగంగా జుట్టు కత్తిరించుకోవడం వంటి పద్దతులతో తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. కఠినమైన దుస్తుల కోడ్, దానిని అమలు చేస్తున్న పరిపాలన ఇరాన్ యంత్రాంగంపై విమర్శలు గుప్పిస్తున్నారు. 

హిజాబ్ వ్యతిరేక నిరసనలు ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ భద్రతా దళాల అణిచివేతలో కనీసం 31 మంది పౌరులు మరణించారు. 30కి పైగా పట్టణాలు, నగరాల్లో నిరసనకారులపై పోలీసులు హింసాకాండను కొనసాగించారు. దీంతో దాదాపు 31 మంది పౌరులు మరణించారని ఓస్లోకు చెందిన ప్రభుత్వేతర సమూహం ఇరాన్ హ్యూమన్ రైట్స్ తెలిపింది. "తమ ప్రాథమిక హక్కులు, మానవ గౌరవాన్ని సాధించడానికి" ఇరానియన్లు కలిసి ర్యాలీకి వచ్చినందున ఇది జరిగింది అంతర్జాతీయ నివేదికలు పేర్కొంటున్నాయి. 

ఇరాన్ హిజాబ్ వ్యతిరేక నిరసనల తాజా వివరాలు ఇలా ఉన్నాయి...

  • టెహ్రాన్‌ సందర్శించేందుకు మహ్సా అమిని(22) అనే యువ‌తి తన కుటుంబంతో కలిసి వెళ్లగా.. ఆ సమయంలో హిజాబ్ ధరించలేదనే కారణంతో పోలీసులు ఆ యువ‌తిని క‌స్ట‌డీలోకి తీసుకున్నారు. ఈ క్ర‌మంలో యువ‌తిని చిత్ర‌హింస‌లు పెట్ట‌డంతో మరుసటి రోజే మ‌ర‌ణించింది. దీంతో పెద్దఎత్తున నిరసనలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. 
  • పోలీసు కస్టడీలో మహ్సా అమిని మరణంపై నిరసనలు ఇరాన్‌లోని 30 నగరాలకు వ్యాపించాయి. అయితే, పోలీసు అణచివేతలో ఇప్పటివరకు 31 మంది మరణించారు.
  • శాంతియుత నిరసనలపై ప్రభుత్వం బుల్లెట్లతో స్పందిస్తోందని ఇరాన్ మానవ హక్కుల (ఐహెచ్‌ఆర్) డైరెక్టర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. నిరసనకారులు, ప్రజా సంఘాల కార్యకర్తలను సామూహిక అరెస్టులు చేసినట్లు నివేదికలు ఉన్నాయి.
  • దేశానికి భావ ప్రకటనా స్వేచ్ఛ ఉందనీ, అయితే హిజాబ్ వ్యతిరేక నిరసనలను ఖండిస్తున్నట్లు ఇరాన్ అధ్యక్షుడు ఇబ్రహీం రైసీ అన్నారు. రైసీ నిరసనలను ఆమోదయోగ్యం కాని గందరగోళ చర్యగా అభివర్ణించారని రాయిటర్స్ నివేదించింది.
  • ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ (UNGA) సందర్భంగా మీడియాతో ప్రసంగిస్తూ "హక్కుల సమస్యలను ప్రపంచవ్యాప్తంగా ఒకే ప్రమాణంతో పరిగణించాలి. ఇరాన్‌లో భావప్రకటనా స్వేచ్ఛ ఉంది.. కానీ గందరగోళ చర్యలు ఆమోదయోగ్యం కాదు అని ఆయన అన్నారు. 
  • ఇరాన్ ప్రెసిడెంట్ ఇబ్రహీం రైసీ కూడా మహ్సా అమిని మరణంపై దర్యాప్తు జరుపుతామని చెప్పారు. అయితే ఆందోళనలు లేవనెత్తినందుకు పాశ్చాత్య శక్తులు కపటత్వంతో ఉన్నాయని ఆరోపించారు. "పార్టీ తప్పు చేసినట్లయితే, అది ఖచ్చితంగా దర్యాప్తు చేయబడాలి. నేను మొదటి అవకాశంలో మరణించిన వారి కుటుంబాన్ని సంప్రదించాను. ఈ సంఘటనపై దర్యాప్తు చేయడానికి మేము దృఢంగా కొనసాగుతామని నేను వ్యక్తిగతంగా వారికి హామీ ఇచ్చాను" అని పేర్కొన్నారు. 
  • నిరసనల నేపథ్యంలో అక్కడి ప్రభుత్వం ఇంటర్నెట్ సర్వీసులపై ఆంక్షలు విధించింది. నిరసనలు కొనసాగుతున్న ప్రాంతాల్లో ఇంటర్నెట్ సేవలు నిలిపివేశారు. అనేక సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ల సేవలు సైతం నిలిచిపోయినట్టు సమాచారం.