Asianet News TeluguAsianet News Telugu

గ్వాటెమాల అడవి అడుగున 2000 ఏళ్ల పురాతన మయా నగరం.. పరిశోధకుల అధ్యయనంలో వెలికి

మధ్య అమెరికా దేశం గ్వాటెమాల అడవుల కింద మయన్ల భారీ నగరాన్ని పరిశోధకులు గుర్తించారు. సుమారు 650 మైళ్ల విస్తీర్ణతతో మయా నాగరికతకు చెందిన నగరం ఇక్కడ విలసిల్లిందని తేల్చారు. బహుశా ఈ నగరం సుమారు 2000 ఏళ్ల కిందిదని పేర్కొన్నారు.
 

2000 year old mayan civilisation city found beneath of guatemala rainforest
Author
First Published Jan 14, 2023, 2:48 PM IST

న్యూఢిల్లీ: మధ్య అమెరికాలో ముఖ్యంగా గ్వాటెమాల కేంద్రంగా మయా నాగరికత విలసిల్లిన సంగతి తెలిసిందే. వేల ఏళ్ల క్రితం మయా నాగరికత ఇక్కడ వర్ధిల్లింది. ఇక్కడ నదులు, సరస్సులు పెద్దగా లేకపోవడం, యేటా నాలుగు నుంచి ఆరు నెలలు వర్షాల పడని ఈ చోట మయన్లు మెదడకు పదును పెట్టుకున్నారు. నీటి కోసం కాల్వలు తవ్వుకున్నారు. నీటిని నిల్వ చేసుకోవడానికి జలాశయాలను నిర్మించుకున్నారు. ఈ జలాశయాల కారణంగానే మయన్లు దీర్ఘకాలం ఇక్కడ మనగలిగారని పరిశోధకులు చెబుతారు. నీటిని శుద్ధపరచడంలో మయన్లు అగ్రశ్రేణిలో ఉన్నారనీ పేర్కొంటారు. ఎన్నో ప్రత్యేకతలు, వారి కాలానికి పురోభివృద్ధిలో ఉన్న మయన్ల గురించి మరో ఆసక్తికర విషయం వెలుగులోకి వచ్చింది. గ్వాటెమాలలోని రెయిన్‌ఫారెస్ట్‌ అడుగున మయన్లు నిర్మించిన భారీ నగరం నిద్రిస్తున్నదని పరిశోధకులు కనుగొన్నట్టు మెట్రో న్యూస్ ఓ కథనం వివరించింది. వారి అధ్యయనానికి సంబంధించిన జర్నల్స్ ఏన్షియెంట్ మీసోఅమెరికాలో ప్రచురితం అయ్యాయి.

ఈ నగరం సుమారు 2,000 ఏళ్ల క్రితం ఉనికిలో ఉండి ఉంటుందని అంచనా వేస్తున్నారు. గ్వాటెమాలకు చెందిన మెక్సిన్ సరిహద్దుకు సమీపంలో సుమారు 650 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఈ నగరం విస్తరించి ఉన్నట్టు గుర్తించారు. ఈ నగరం, దాని చుట్టుపక్కల సుమారు 1,000 సెటిల్‌మెంట్లు లేదా నివాస సముదాయాలు ఉంటాయని తెలుపుతున్నారు. ఈ సముదాయాలను కలుపుతూ 110 మైళ్ల దారులు నిర్మించి ఉన్నాయని పరిశోధకులు వివరిస్తున్నారు. సమీపంలోని సెటిల్‌మెంట్లకు మయన్ నాగరిక ప్రజలు సులువుగా వెళ్లడానికి ఈ మార్గాలు నిర్మించుకుని ఉంటారని పేర్కొంటున్నారు.

Also Read: 3500 ఏళ్ల కిందటి మమ్మీ.. ఇప్పటికీ చెక్కుచెదరని పళ్ల వరస.. గదవ.. ఆ మమ్మీ చరిత్ర ఇదే!

అంతేకాదు, కొన్ని నివాస సముదాయాల దగ్గర పెద్ద పెద్ద వేదికలు, పిరమిడ్లను గుర్తించారు. బహుశా అవి పని చేసుకునే కేంద్రాలు, లేదా రాజకీయాలు, ఇతర పనుల కోసం వినియోగించి ఉంటారని భావిస్తున్నారు. కొన్ని సెటిల్‌మెంట్లలో బాల్ కోర్టులు ఉన్నట్టు గుర్తించారు. వారి నాగరికతలో ప్రాముఖ్యత గల క్రీడలు బహుశా వాటిలో ఆడుకునేవారని పేర్కొంటున్నారు.

పరిశోధకులు లైడార్ (లైట్ డిటెక్షన్ అండ్ రేంజింగ్) టెక్నాలజీ ఉపయోగించుకుని మయన్ల నగరాన్ని ఆవిష్కరించారు. పలు అమెరికా యూనివర్సిటీలు, ఫ్రాన్స్, గ్వాటెమాల వర్సిటీల పరిశోధకుల బృందం ఈ అధ్యయనం చేపట్టింది. 

ఇంట్రెస్టింగ్ ఇంజినీరింగ్ కథనం ప్రకారం, రాడార్ సిస్టమ్ తరహాలోనే లైడార్ కూడా ఒక డిటెక్షన్ సిస్టమ్ అని, ఇది రేడియో కిరణాలకు బదులు లేజర్ లైట్ ఆధారంగా పని చేస్తుంది. పరిశోధకులు లైడార్‌ టెక్నాలజీ వినియోగించాలని నిర్ణయించుకున్నారు. ఎందుకంటే దుర్బేధ్యమైన ఈ అడవిని దాటుకుని, దాని కింద నిద్రాణమైన నగరాన్ని వెలికి తీయడానికి రాడార్ కంటే లైడార్ ఉపయుక్తమైనదని భావించారు.

Follow Us:
Download App:
  • android
  • ios