మన దేశంలో ఇటీవల కాలంలో గుండెపోటుతో చనిపోతున్న వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ముఖ్యంగా యువత ఎక్కువగా చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది. దీనికి కారణాలు, నివారణ మార్గాలు తెలుసుకోండి. ఆరోగ్యాన్ని కాపాడుకోండి.   

ఇటీవల కాలంలో ముఖ్యంగా యువతలో గుండెపోటు(Heart Attack) మరణాల సంఖ్య ఇండియాలో ఆందోళనకరంగా పెరుగుతోంది. ఇది అనుకోకుండా జరుగుతున్న సంఘటనలు కావు. జన్యుపరమైన కారణాలు, జీవనశైలి, ఆహారపు అలవాట్లు వంటి అంశాలు దీనికి కారణం. మనదేశంలోనే ఎందుకు గుండెపోటుకి ఎక్కువగా గురవుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

గుండెపోటు అంటే ఏమిటి?

గుండె కండరాలకు రక్తం సరఫరా ఆగిపోయినప్పుడు గుండెపోటు వస్తుంది. సాధారణంగా గుండెకు రక్తాన్ని సరఫరా చేసే కరోనరీ ఆర్టరీస్ లో కొవ్వు పేరుకుపోవడం వల్ల ఇది జరుగుతుంది. ఈ అడ్డంకి వల్ల గుండె కండరాలకు ఆక్సిజన్, పోషకాలు సక్రమంగా అందవు. దీంతో గుండె బలహీన పడటం జరుగుతుంది. లేదా మరణం కూడా సంభవిస్తుంది.

జన్యుపరంగా కూడా గుండెపోటు రావచ్చు

మనదేశంలో ఎక్కువమంది గుండెపోటుతో మరణిస్తున్నారు. దీనికి జనెటికల్ ప్రాబ్లమ్స్ కూడా కారణం కావచ్చని డాక్టర్లు చెబుతున్నారు. ఇండియాలోనే కాకుండా దక్షిణాసియాలో ఎక్కువగా గుండె జబ్బులు జన్యుపరంగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనాలు చెబుతున్నాయి. కొలెస్ట్రాల్ జీవక్రియ, ఇన్సులిన్ నిరోధకత, ఇన్ఫ్లమేటరీ రియాక్షన్స్ ని ప్రభావితం చేసే కొన్ని జన్యు రకాలు దీనికి కారణం కావచ్చని పరిశోధకులు చెబుతున్నారు. 

చాలా మంది ఇండియన్స్ లో హోమోసిస్టీన్ అనే అమైనో ఆమ్లం స్థాయిలు ఎక్కువగా ఉంటున్నాయని ఇటీవలి అధ్యయనాలు చెబుతున్నాయి. విటమిన్ బి6, బి9 (ఫోలిక్ యాసిడ్), బి12 లోపం వల్ల ఇది జరగవచ్చు. హోమోసిస్టీన్ స్థాయిలు పెరగడం వల్ల గుండె ఆర్టరీస్ దెబ్బతిని, గుండె జబ్బుల ప్రమాదం పెరుగుతుంది.

మన జీవనశైలే మన శత్రువు

నగరాల్లో ఫాస్ట్ ఫుడ్ కల్చర్, సాంకేతిక పురోగతి పేరుతో కూర్చొని కదలకుండా పనిచేయడం వల్ల చాలా మంది ఇండియన్స్ గుండె సమస్యలు ఎదుర్కొంటున్నారు. శారీరక శ్రమ తక్కువగా ఉండే లైఫ్ స్టైల్ దీనికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అందుకే ఎక్కువ మంది ఊబకాయం, డయాబెటిస్, హై బిపి సమస్యలతో బాధపడుతున్నారు. 

ధూమపానం, పొగాకు వాడకం ఇండియాలో ఎక్కువ. ఇది కూడా రక్తనాళాలను దెబ్బతీసి, రక్తం గడ్డకట్టేలా చేసి, గుండెపోటు ప్రమాదాన్ని పెంచుతుంది.

ఈ సాఫ్ట్ వేర్ కల్చర్, లైఫ్ స్టైల్ వల్ల ఒత్తిడి తప్పనిసరి అయిపోయింది. దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల హై బిపి, ఇన్ఫ్లమేషన్, రక్తంలో కొవ్వు స్థాయిలు పెరిగి గుండెపోటుకి దారితీయవచ్చు.

నిద్ర సరిపోకపోవడం వల్ల శరీర జీవక్రియ దెబ్బతిని, డయాబెటిస్, ఊబకాయం, హై బిపి ప్రమాదం పెరుగుతుంది.

గుండెపోటుకు ఆహారపు అలవాట్లు కూడా కారణమే

మనదేశంలోని ఆహారంలో చక్కెర, శుద్ధి చేసిన కార్బోహైడ్రేట్స్, కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. నూనెలో వేయించినవి, తీపి పదార్థాలు, ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్ల కొలెస్ట్రాల్ స్థాయిలు పెరిగి గుండె ఆరోగ్యానికి హాని కలుగుతుంది.

గుండెపోటును ఎలా నివారించాలి?

పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, లీన్ ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, సమతుల్య ఆహారం తీసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెర, ఉప్పు, కొవ్వు పదార్థాలు తగ్గించండి.

రోజుకి కనీసం 30 నిమిషాలు మితమైన వ్యాయామం చేయండి.

పొగాకు వాడకాన్ని పూర్తిగా మానేయడం గుండె ఆరోగ్యానికి చాలా ముఖ్యం.

మద్యం తాగడం కూడా కొంతమందికి హానికరం. కాబట్టి వీలైనంత వరకు తగ్గించండి లేదా మానేయండి.

యోగా, ధ్యానం, శ్వాస వ్యాయామాలు, ఇష్టమైన కార్యకలాపాల్లో పాల్గొనడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది.

క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు చేయించుకోవడం, వైద్యుల సలహా మేరకు మందులు వాడటం చాలా ముఖ్యం.

రోజుకి 7-8 గంటలు మంచి నిద్ర పోండి.