వయసుతో సంబంధం లేకుండా చాలామంది షుగర్ వ్యాధితో బాధపడుతున్నారు. షుగర్ ని కంట్రోల్లో ఉంచుకునేందుకు మాత్రలు తీసుకోవడంతో పాటు రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అయితే ఈ ఒక్క మొక్కతో షుగర్ ని తరిమికొట్టవచ్చు అంటున్నారు నిపుణులు. అదేంటో చూసేయండి.
ప్రస్తుతం చాలామందిని వేధిస్తున్న సమస్య డయాబెటిస్. ఒక్కసారి షుగర్ వస్తే అన్నీ మారిపోతాయి. షుగర్ ఎక్కువైనా ప్రాబ్లమే. తక్కువైనా ప్రాబ్లమే. పైగా క్రమం తప్పకుండా మాత్రలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆహారం విషయంలోనూ చాలా జాగ్రత్తగా ఉండాలి. స్వీట్స్, కూల్ డ్రింక్స్ వంటి వాటి జోలికి అస్సలు వెళ్లకూడదు. డాక్టర్స్ సిఫారసు చేసినవి తీసుకుంటూ.. వ్యాయామాలు చేస్తూ షుగర్ ని కంట్రోల్లో ఉంచుకోవాల్సి ఉంటుంది.
అయితే ఎన్ని చేసినా చాలామందికి స్వీట్స్ తినాలనే కోరిక మాత్రం పోదు. కొంతమంది అయితే భోజనం తర్వాత కచ్చితంగా ఏదో ఒక స్వీట్ తింటారు. కానీ డయాబెటీస్ ఉన్నవారు తీపి పదార్థాలు తీసుకోవడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఆరోగ్యవంతులు కూడా ఎక్కువ తీపి పదార్థాలు తీసుకోవడం ద్వారా షుగర్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి.
మరి ఈ స్వీట్ క్రేవింగ్స్ ని, షుగర్ ని ఎలా కంట్రోల్ చేసుకోవాలని ఆలోచిస్తున్నారా? అయితే ఈ సమాచారం మీకోసమే. షుగర్ ని కంట్రోల్ చేయడానికి ఒక మొక్క చాలా బాగా పనిచేస్తుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. మరి ఆ మొక్క ఏంటి? ఎలా ఉపయోగపడుతుంది వంటి విషయాలను ఇక్కడ తెలుసుకుందాం.
డయాబెటిస్ చికిత్సకు ఉపయోగపడే సిరుకురింజన్ మొక్క..
సిరుకురింజన్ అనే ఒక ఔషధ మొక్క డయాబెటిస్ చికిత్సకు సహాయపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. ఈ మొక్కను "స్వీట్ కిల్లర్" అని కూడా పిలుస్తారట. సిరుకురింజన్ ఆకులు ఆయుర్వేదంలో చాలా కాలంగా వాడుకలో ఉన్నాయట. ఇది తీపి తినాలనే కోరికను తగ్గించి డయాబెటిస్‌ను నియంత్రణలో ఉంచుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఒక రకంగా చెప్పాలంటే.. సిరికురింజన్ మొక్క ఆకులు తీపి పదార్థాల రుచిని తగ్గిస్తాయి. సాధారణంగా స్వీట్ తింటుంటే ఆ రుచి.. మనల్ని మరింత తినేలా ప్రోత్సహిస్తుంది. ఈ మొక్క ఆకులు తినడం వల్ల దాన్ని నివారించవచ్చు.
మీరు తీపి పదార్థాలు తినడానికి ముందు సిరుకురింజన్ ఆకులు తినాలి. ఈ ఆకులను నేరుగా తినలేకపోతే.. వాటి రసాన్ని తీసుకోవాలి. దీనివల్ల నాలుకపై ఎలాంటి తీపి రుచి తెలియదు. ఈ ఆకులు మీరు తినే తీపి పదార్థాల రుచిని తగ్గిస్తాయి. తద్వారా మీరు తక్కువ తీపి పదార్థాలు తింటారు.
అంతేకాదు ఈ ఆకులు అతిగా ఆకలి వేయడాన్ని కూడా నియంత్రిస్తాయి. సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారికి ఎక్కువ ఆకలి వేస్తుంది. దాన్ని నివారించడానికి ఈ ఆకులు చక్కగా పనిచేస్తాయి. వీటిలోని సమ్మేళనాలు శరీరంలో ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతాయి. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారు దీన్ని తీసుకోవచ్చు. కానీ ఈ ఆకులు మాత్రమే డయాబెటిస్‌ను తగ్గించవు. సమతుల్య ఆహారం, వ్యాయామం కూడా ముఖ్యం.
సిరుకురింజన్ మొక్కలను కనుక్కోవడం కష్టం. నగరంలో ఉండేవారికి ఇవి అరుదుగా కనిపిస్తుంటాయి. కానీ ప్రస్తుతం ఈ ఆకుల పొడి.. నాటు మందుల దుకాణాల్లో, ఆన్‌లైన్‌లో కూడా అందుబాటులో ఉంటోంది.
సిరికురింజన్ మొక్క వల్ల కలిగే అదనపు ప్రయోజనాలు
కొలెస్ట్రాల్ నియంత్రణ:
సిరికురింజన్ మొక్క కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడంలో సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.
మెరుగైన జీర్ణవ్యవస్థ:
సిరుకురింజన్ మొక్క ఆకులు తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుందట. అంతేకాదు గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలను తగ్గించడానికి ఈ మొక్క ఆకులు చాలా బాగా పనిచేస్తాయట.
వాపు తగ్గడానికి:
సిరుకురింజన్ మొక్కలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు.. వాపును తగ్గించడానికి సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇతర ఉపయోగాలు:
సిరుకురింజన్ ను ఆర్థరైటిస్, అనీమియా, ఆస్తమా, ఇతర ఆరోగ్య సమస్యలకు నివారణిగా కూడా ఉపయోగించవచ్చని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి.
గమనిక:
ఈ సమాచారం అవగాహన కోసం మాత్రమే. ఏదైనా మూలికా చికిత్సను ప్రారంభించే ముందు నిపుణుల సలహా తీసుకోవడం మంచిది.

